ఆ పుస్తకాలతో స్ఫూర్తి పొందా!

ABN , First Publish Date - 2020-06-27T08:40:16+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మూడునెలలుగా బెంగళూరు సాయ్‌ సెంటర్‌లోనే చిక్కుకుపోయిన భారత...

ఆ పుస్తకాలతో స్ఫూర్తి పొందా!

నూతనోత్సాహంతో సిద్ధమవుతున్నా

టోక్యో నాకు చివరి ఒలింపిక్స్‌


న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మూడునెలలుగా బెంగళూరు సాయ్‌ సెంటర్‌లోనే చిక్కుకుపోయిన భారత పురుషులు, మహిళల హాకీ జట్ల క్రీడాకారులు వారంరోజుల క్రితం స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ అన్ని రోజులు ప్రాక్టీస్‌ లేకుండా.. కుటుంబసభ్యులకు దూరంగా వాళ్లంతా ఎలా గడిపారు? ఏమేం చేశారు? అంటే.. ఎవరికి తోచిన విధంగా వాళ్ల అలవాట్లకు అనుగుణంగా సరదాగా గడిపామని అంటున్నాడు పురుషుల జట్టు సీనియర్‌ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌. అన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండడమంటే చాలా ఇబ్బందేనన్న కేరళ స్టార్‌ శ్రీజేష్‌.. తాను మాత్రం స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశానని అంటున్నాడు. ఇంకా అతనేం చెప్పాడో అతని మాటల్లోనే..

అదెంతో కష్టం..

విదేశీ టోర్నీలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ఇన్నిరోజులు ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉండలేదు. ఆ మూడునెలలు కుటుంబాన్ని మిస్సయ్యానన్న బాధ చాలా ఉండేది. హార్ట్‌ పేషెంటైన నాన్నతోపాటు, నా భార్య, చిన్నపిల్లలైన ఇద్దరు కొడుకులు, కుమార్తె గురించి చాలా బెంగపడ్డా. వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందోనని ఆలోచించేవాణ్ని. ఎప్పటికప్పుడు ఫోన్‌లో సంప్రదిస్తూ వాళ్ల ఆరోగ్య వివరాలు కనుక్కొనేవాడిని. 

  అవే పెద్ద నేస్తాలు..

లాక్‌డౌన్‌తో ఇంటికి వెళ్లలేక.. అలాగని ఇక్కడ ఖాళీగా ఉండలేని పరిస్థితి. దీంతో నాకు పుస్తకాలే నేస్తాలయ్యాయి. నన్ను నేను స్ఫూర్తివంతం చేసుకునేందుకు అనేక పుస్తకాలు చదివా. వీటిలో ప్రధానంగా అమెరికన్‌ ఒలింపియన్‌ ట్రయాథ్లెట్‌ జొన్నా జీగర్‌ రాసిన ‘ది చాంపియన్స్‌ మైండ్‌సెట్‌ (మానసిక స్థైర్యానికి ఓ అథ్లెట్‌ మార్గదర్శనం)’ పుస్తకం నన్నెంతో ప్రభావితం చేసింది. దీన్ని మళ్లీ మళ్లీ చదివా. నాలోని వ్యతిరేక ఆలోచనలను పార దోలేందుకు ఈ పుస్తకాలు ఎంతో దోహదం చేశాయి. ఇక.. అన్నిరోజులు క్యాంపస్‌లో సహచరులమంతా సరదాగా గడిపాం. 

 ఇంటికి వచ్చినా కూడా..

బెంగళూరు నుంచి మా ఇంటికి వచ్చినా కూడా పిల్లలతో ఇప్పుడే ఆడుకోలేని పరిస్థితి నాది. కరోనా నిబంధనల ప్రకారం 14రోజుల హోం క్వారంటైన్‌లో ఉంటున్నా. మా ఇంట్లోనే నేను పైఅంతస్థులో ఉంటే.. కుటుంబసభ్యులు కింద ఫ్లోర్‌లో ఉంటున్నారు. పిల్లలను చూస్తున్నా కానీ.. వారిని ముట్టుకోవడం లేదు. అయినా.. ఇదంతా మన ఆరోగ్యం కోసమే కదా. ఏదేమైనా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.

ఈ విరామం మంచిదే..

ఇంట్లో నెలరోజులు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మళ్లీ బెంగళూరు వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తాం. కొత్త ఆలోచనలతో, నూతనోత్సాహంతో మైదానం లోకి అడుగుపెట్టేందుకు ఈ విరామం ఎంతగా నో దోహదం చేస్తుంది. వచ్చే ఏడాది టోక్యో క్రీడలు నాకు కెరీర్‌లో మూడో ఒలింపిక్స్‌. ఇవే నాకు చివరి విశ్వక్రీడలు అనుకుంటున్నా. ఒలింపిక్‌ పతకంతో కెరీర్‌ను విజయవంతంగా ముగించాలన్నది నా అంతిమ లక్ష్యం.

Updated Date - 2020-06-27T08:40:16+05:30 IST