కొవిడ్‌ బారిన పోలీస్‌!

ABN , First Publish Date - 2021-05-17T05:18:01+05:30 IST

‘ఈస్ట్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐ ఒకరు విధి నిర్వహణలో కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆ విషయం తెలియక ఎప్పటిలాగే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది.’ ఇలాంటి అనుభవాలు నగరంలోని అనేక మంది పోలీస్‌ కుటుంబాలకు ఎదురవుతున్నాయి.

కొవిడ్‌ బారిన పోలీస్‌!

విధి నిర్వహణలో సోకుతున్న వైరస్‌

ఇప్పటివరకూ 969 మందికి వ్యాధి నిర్ధారణ

వారి నుంచి కుటుంబ సభ్యులకూ వ్యాప్తి

ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి


 (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

‘ఈస్ట్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐ ఒకరు విధి నిర్వహణలో కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆ విషయం తెలియక ఎప్పటిలాగే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది.’ ఇలాంటి అనుభవాలు నగరంలోని అనేక మంది పోలీస్‌ కుటుంబాలకు ఎదురవుతున్నాయి.

 కొవిడ్‌పై జరుగుతున్న పోరులో క్రియాశీలకంగా వ్యవహరించే శాఖల్లో  పోలీస్‌శాఖ ఒకటి. వైరస్‌ ముప్పు అడుగుదూరంలోనే ఉన్నప్పటికీ కరోనా నియంత్రణ కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ, విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాయి. అయితే క్షేత్రస్థాయిలోనూ, ఆస్పత్రుల వద్ద, మృతదేహాల తరలింపులో విధులు నిర్వర్తించి, ఇంటికి వెళుతుండడంతో కుటుంబ సభ్యులు వైరస్‌ బారినపడుతున్నారు. నగర పరిధిలో ఇప్పటివరకూ పోలీస్‌శాఖలో కరోనా కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడగా, వారి కుటుంబసభ్యులు మరికొందరు కరోనా కాటుకి బలవడం ఆందోళనకుగురిచేస్తోంది. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,135 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా నగరంలో కర్ఫ్యూ అమలు, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో రాకపోకల నియంత్రణ, ఆస్పత్రుల వద్ద వివాదాలు పరిష్కరించడం, కరోనా కారణంగా మృతిచెందినవారిని తరలిచేందుకు ఎవరూ ముందుకు రాకుంటే మృతదేహాలను శ్మశానవాటికకు తరలించడం వంటి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏ చిన్న పొరపాటుతోనో వైరస్‌ సోకుతోంది. ఈ విషయం త్వరగా గుర్తించే అవకాశం ఉండదు కాబట్టి, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో కలిసిపోతున్నారు. దీనివల్ల పోలీసులతోపాటు వారి  కుటుంబసభ్యులు వైరస్‌ బారినపడుతున్నారు. నగర పరిధిలో ఫస్ట్‌ వేవ్‌లో 708 మంది పోలీసులు వైరస్‌ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్సపొందగా, నలుగురు మృతిచెందారు. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటివరకూ 261 మందికి కరోనా సోకగా వారిలో నలుగురు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల కుటుంబ సభ్యులు మరికొందరు కరోనా వైరస్‌కు గురవగా, పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. 


కట్టడిలో పోలీసులదే కీలక పాత్ర 

కరోనా కేసులు  వెలుగుచూసే ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలను నియంత్రించే బాధ్యత పోలీసులదే. ఈ క్రమంలో వైరస్‌ సోకినవారితో కూడా పోలీసులు దగ్గరి నుంచే మాట్లాడాలి.  బయటకు వెళ్లడానికి గల కారణాలపై ఆధారాలు అందిస్తే వాటిని చేతిలోకి తీసుకుని పరిశీలించాలి. ఈ క్రమంలో వారికి వైరస్‌ ఉంటే పోలీసులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కర్ఫ్యూ నేపథ్యంలో ఆస్పత్రులకు వెళ్లేవారిని, మందుల దుకాణాలకు వెళ్లేవారిని మాత్రమే అనుమతించాలి. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చేవారందరినీ పోలీసులు ఆపి సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. కరోనా బాధితులతోనూ నేరుగా మాట్లాడడం, వైరస్‌ సోకినవారు తాకిన వస్తువులను తాకుతుండడంతో పోలీసులకు కరోనా సోకుతోంది. వెంటనే లక్షణాలు బయటపడవు కాబట్టి, జాగ్రత్తగానే విధులు నిర్వర్తించామనే ధీమాతో డ్యూటీ ముగిసిన వెంటనే ఇంట్లోకి వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మెలిసిపోతుండడంతో వారికీ వైరస్‌ వ్యాప్తిచెందుతోంది. 


వేరుగా ఉండడం సాధ్యపడక 

కరోనా ప్రారంభంలో మొదటి రెండు వారాలపాటు పోలీసులు లాడ్జిలు, హోటళ్లలో వుంటూ కుటుంబానికి దూరంగా గడిపారు. తమ నుంచి కుటుంబాలకు ముప్పు ఎదురవకూడదని జాగ్రత్తలు పాటించారు. అయితే నెలల తరబడి కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతుండడంతో ఏం చేయాలో పాలుపోక ఇళ్ల నుంచి డ్యూటీకి వెళ్లి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోపాటు వారి కుటుంబసభ్యులు వైరస్‌కు చిక్కుతున్నారు. 


సిబ్బంది రక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం 

కరోనా నేపథ్యంలో ముందుండి విధులు నిర్వర్తించేది పోలీసులే. సిబ్బంది, అధికారుల రక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది 4,135 మంది వుండగా వారిలో 4,088 మందికి రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించాం. విధి నిర్వహణలో వైరస్‌ బారినపడకుండా ఫేష్‌షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు అందజేస్తున్నాం.  కాంటాక్ట్‌ లెస్‌ పోలీసింగ్‌, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌, సిబ్బందికి అనుమానం కలిగితే నివృత్తి చేసేందుకు ఏడీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో కొవిడ్‌ హెల్త్‌ మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశాం. చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించేందుకు వీలుగా ప్రతి ఏసీపీకి వంద రాపిడ్‌ కిట్‌లు అందించాం.  నగరంతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన పోలీసులు, వారి కుటుంబసభ్యులకు కరోనా చికిత్సకు స్పెషల్‌ కొవిడ్‌ హాస్పిటలైజేషన్‌ అందుబాటులోకి తెచ్చాం.  హోంఐసోలేషన్‌లో ఉన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుగా ప్రతిరోజూ వెబ్‌నార్‌ నిర్వహిస్తున్నాం.

-  మనీష్‌కుమార్‌సిన్హా, నగర పోలీస్‌ కమిషనర్‌


Updated Date - 2021-05-17T05:18:01+05:30 IST