పీనుగులపై పేలాలు.. బరితెగించిన అంబులెన్స్‌ల సిబ్బంది

ABN , First Publish Date - 2020-09-25T03:01:17+05:30 IST

కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తుల తరలింపులో ప్రభుత్వ అంబులెన్స్‌ల సిబ్బంది కొందరు కాసుల వేట సాగిస్తున్నారు. అందినకాడికి

పీనుగులపై పేలాలు.. బరితెగించిన అంబులెన్స్‌ల సిబ్బంది

  • కోవిడ్ మృతదేహాలపై ప్రభుత్వ అంబులెన్స్‌ల కాసుల వేట
  • చనిపోయిన వారిని తరలించడానికి రూ.15వేల చొప్పున డిమాండ్‌
  • కాకినాడలో బరితెగించిన మహాప్రస్థానం అంబులెన్స్‌ల సిబ్బంది
  • దూరప్రాంతానికి తరలించాల్సి వస్తే రూ.20వేల పైనే
  • మార్చురీలో మృతదేహం ఉంచడానికీ కాసులు ముట్టజెప్పాల్సిందే


(కాకినాడ,ఆంధ్రజ్యోతి): కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తుల తరలింపులో ప్రభుత్వ అంబులెన్స్‌ల సిబ్బంది కొందరు కాసుల వేట సాగిస్తున్నారు. అందినకాడికి దండుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తులను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మహాప్రస్థానం అంబులెన్స్‌లో ఉచితంగా తరలించాలి. కానీ కొందరు అంబులెన్స్‌ సిబ్బంది మాత్రం యథేచ్చగా కాసులు దండేస్తున్నారు. మృతుడి స్వస్థలం దూరం బట్టి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు అడ్డగోలుగా పిండేస్తున్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా పీనుగులపై పేలాలు ఏరుకుంటున్నారు. జీజీహెచ్‌ మార్చురీలోనూ ఇదే తంతు. కోవిడ్‌ మృతదేహాం ఉంచడానికి ఆ తర్వాత తరలించడానికి కూడా పైసలతోనే పని జరుగుతోంది. ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడి గురించి చెప్పక్కర్లేదు.



కాసులవేటకు కనికరమేది?

జిల్లాలో కరోనా కేసులు 91 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య సైతం 600 పైనే. ముఖ్యంగా జిల్లాలో పాజిటివ్‌ నిర్థారణ అయిన వాళ్లలో ఎక్కువ మందిని లక్షణాల ఆధారంగా కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి పరిస్థితి విషమించినా ఇక్కడకే తరలిస్తున్నారు. దీంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోతున్న కేసులు కూడా అధికంగా ఉంటున్నాయి. ఆలస్యంగా ఆసుపత్రికి రావడం, వయస్సు రిత్యా పరిస్థితి విషమించి చనిపోతున్న వారు కూడా ఎక్కువ మందే. చికిత్స పొందుతూనే సకాలంలో ఐసీయూ పడక కన్నుమూస్తున్న సంఘటనలూ ఎన్నో ఉంటున్నాయి. అయితే ఇలా కోవిడ్‌తో కన్నుమూస్తోన్న వ్యక్తులను జీజీహెచ్‌లో ఉన్న ఏడు ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్‌లకు అప్పగిస్తారు. వీటిని ఆయా అంబులెన్స్‌లు మృతుడి స్వస్థలం ఆధారంగా అక్కడికి తరలిస్తారు. ఇక్కడే పలువురు మహాప్రస్థానం వాహనం సిబ్బంది కొందరు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. మృతులను ఉచితంగా తరలించాల్సి ఉన్నప్పటికీ పీనుగులపై పేలాలు పిండుతున్నారు.


ఆయా మృతుడి స్వస్థలం దూరం ఆధారంగా మామూళ్లు భారీగా వసూళ్లు చేస్తున్నారు. కాకినాడ చుట్టు పక్క ప్రాంతాలకు రూ.8వేలు, తుని, రాజమహేంద్రవరం, ఏజెన్సీ, కోనసీమ తదితర ప్రాంతాలకు తరలించడానికి రూ.15 నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉచితంగా మృతదేహాన్ని తరలించాల్సి ఉన్నా అదేదీ జరగడం లేదు. మృతుల తాలుకా బంధువులకు తమ రేటు చెప్పి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని తరలించడం పెద్ద సవాల్‌ అని చెబుతూ డబ్బులు అడుగుతున్నారు. బయలుదేరే ముందు కొంత, ఇంటికి చేరిన తర్వాత మరికొంత లాగేస్తున్నారు. చేసేదిలేక పలువురు అడిగిన డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి జీజీహెచ్‌లో కోవిడ్‌తో చనిపోయిన వారిని తరలించడానికి మహాప్రస్థానం అంబులెన్స్‌ వాహనాలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తాయి. ఇటీవల కాలంలో కోవిడ్‌ మృతుల సంఖ్య జీజీహెచ్‌లో పెరిగింది.


దీంతో వాహనాలు చాలడం లేదు. దీంతో చాలామంది మృతులను తరలించాలని, ఇందుకు సమయం పడుతుందని ఆయా బంధువులకు సిబ్బంది చెబుతున్నారు. ముందుగా తీసుకువెళ్లాలంటే ఫలానా మొత్తం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాము కాకపోతే బయట అంబులెన్స్‌లను ఆశ్రయిస్తే రూ.30 వేల వరకు వసూలు చేస్తారని, ఏది కావాలో తేల్చుకోవాలంటే అక్కడికక్కడ కొందరు సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ సమయంలో ఆలస్యం చేయలేక, ఎవరికీ ఫిర్యాదు చేయలేక అడిగిన మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గడచిన కొన్ని నెలలుగా జీజీహెచ్‌ వద్ద ఇదే పరిస్థితి. 


మార్చురీలోనూ..

కోవిడ్‌తో రాత్రి వేళల్లో ఎవరైనా మృతిచెందితే వారిని ప్రభుత్వ మార్చురీకి తరలిస్తారు. రాత్రివేళల్లో మహాప్రస్థానం వాహనాలు ఉండవు. ఆ మరుసటి రోజు ఉదయం మార్చురీ నుంచి స్వస్థలాలకు తరలిస్తారు. ఇదే అదనుగా మార్చురీలో కొందరు సిబ్బంది ఒక్కో మృతదేహానికి సంబంధించి వారి బంధువుల నుంచి రూ.2వేలు వసూలు చేస్తున్నారు. కాసులు ముట్టజెప్పకుంటే ఏదో కొర్రీ వేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలిస్తే భారీగా డబ్బులు అడుగుతారనే భయంతో చేసేది లేక బంధువులు మార్చురీ సిబ్బందికి డబ్బులు ముట్టజెబుతున్నారు. మరోపక్క దూరపు బంధువులు ఎవరైనా చూసేందుకు రావలసి ఉంటే వారు వచ్చే వరకు మృతదేహాన్ని మార్చురీలో ఉంచడానికి మరో రేటు. ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే తక్షణం అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించేయాల్సిందే.


ఒక్క అరగంట కూడా అక్కడ ఆయా ఆసుపత్రి సిబ్బంది ఉండనీయడం లేదు. దీంతో బంధువులు వచ్చే వరకు కనీసం ఒకరోజు కొవిడ్‌ మృతదేహాన్ని అనధికారికంగా ప్రభుత్వమార్చురీలో ఉంచుతున్నారు. ఇందుకు లోపాయికారీగా డబ్బులు వేలల్లోనే పిండుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే కొవిడ్‌ మృతుడి తరలింపు బేరం తగిలిందంటే చాలు ప్రైవేటు అంబులెన్స్‌లు దూరం బట్టి రూ.40వేల వరకు పిండేస్తున్నాయి. ఆయా వాహనదారులు వసూలు చేసే ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆడిందిఆట పాడింది పాటగా మారింది. కొందరైతే కొవిడ్‌ నేపథ్యంలో మృతదేహాల తరలింపు గిరాకీతో ఏకంగా కొత్తవాహనాలు కూడా దించుతున్నారు.

Updated Date - 2020-09-25T03:01:17+05:30 IST