త్వరలో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-08T04:15:28+05:30 IST

కొవిడ్‌ బాధితులకు, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో త్వరలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించనున్నారు.

త్వరలో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం
జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

- పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

- కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు సహాయం

- సమాచార సేకరణ, స్థితిగతులపై దృష్టి

- కొవిడ్‌ వార్డు పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, సీఐ తదితరులు

గద్వాలక్రైం, మే 7 : కొవిడ్‌ బాధితులకు, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో త్వరలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించనున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు కొవిడ్‌ వార్డులో చేరితే, వారి కుటుంబసభ్యులు, బంధువులు వారిని కలిసే వీలుండదు. వైద్యులు కూడా వారిని లోనికి అనుమతించరు. దీనికి తోడు వార్డులోకి వెళ్తే తమకూ కరోనా సోకుతుందన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తమ వారు వార్డులో ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు.. స్థితిగతులు ఏంటి.. అన్న విషయాలు సమగ్రంగా తెలియడం కష్టసాధ్యం. ఆ సమస్యకు త్వరలో చెక్‌ పడనున్నది. బాధితుల స్ధితిగతులను వారి బంధువులకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే హెల్ప్‌డెస్క్‌ ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో అతి త్వరలోనే కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ యాదగిరి, సీఐ జక్కుల హనుమంతు, ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ వార్డు పరిసరాలను పరిశీలించారు. రాష్ట్ర పోలీస్‌ అధికారుల ఆదేశాల మేరకు హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 


సమాచారం అందిస్తాం : డీఎస్పీ

కొవిడ్‌ బాధితుల బంధువులను వార్డు లోనికి అనుమతించరు. దీంతో తమ వారి సమాచారం తెలియక వారు తీవ్ర మనో వేదనకు గురవుతూ ఉంటారు. కొవిడ్‌ సెంటర్‌ బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వార్డులో కరోనా బాధితుల రక్షణ, వారి స్థితిగతులను పూర్తిగా బంధువులకు ఎప్పటికప్పుడు తెలియచేయడమే హెల్ప్‌డెస్క్‌ ముఖ్య ఉద్దేశం. 

- యాదగిరి, డీఎస్పీ

Updated Date - 2021-05-08T04:15:28+05:30 IST