ప్రజల చెంతకే కొవిడ్‌ వైద్యం

ABN , First Publish Date - 2022-01-22T06:49:54+05:30 IST

కరోనా నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఒమైక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వేమొదలు పెట్టింది. ప్రజల చెంతకే వెళ్లి కొవిడ్‌ వైద్యాన్ని అందిస్తోంది. శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో జ్వర సర్వేను చేపట్టారు.

ప్రజల చెంతకే కొవిడ్‌ వైద్యం

జిల్లాలో మొదలైన జ్వర సర్వే 

సమాచారం సేకరిస్తున్న 1,240 బృందాలు

జ్వరం, దగ్గు, జలుబు, కరోనా వివరాల సేకరణ

లక్షణాలు ఉన్న వారికి ఇంటివద్దే

హోం ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఒమైక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వేమొదలు పెట్టింది. ప్రజల చెంతకే వెళ్లి కొవిడ్‌ వైద్యాన్ని అందిస్తోంది. శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో జ్వర సర్వేను చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్‌, రెవెన్యూతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఆధ్వర్యంలో సర్వేను నిర్వహిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల వివరాలను సేకరిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే ఇంటి వద్దే హోం ఐసోలేషన్‌ కిట్లను అందిస్తున్నారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి మండలం పరిధిలో ప్రత్యేక అధికారులను నియమించి సర్వే పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. 

ఫ ఇంటివద్దే హోం ఐసోలేషన్‌ కిట్ల అందజేత..

జిల్లాలో 1,240 బృందాలను సర్వే కోసం నియమించారు. ప్రతి బృందానికి మూడు వందల ఇళ్ల నుంచి 350 వరకు కేటాయించారు. సర్వేలోని బృందం సభ్యులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత మంది వేయించుకున్నారో ఆరాతీస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌ కిట్స్‌ను అందిస్తున్నారు. వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నారు. లక్షణాలు ఉన్న వారి వివరాలను గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ వార్డుల అధికారులకు అందిస్తున్నారు. జిల్లాలో ఐదు రోజులలోనే సర్వే పూర్తయ్యే విధంగా మండలాల వారీగా ప్రణాళిక రూపొందించి సర్వేను కొనసాగిస్తున్నారు. సర్వే బృందంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా, అంగన్‌ వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు. జిల్లాలో గడిచిన పదిహేను రోజులుగా సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలి..

నిజామాబాద్‌ అర్బన్‌: ఇంటింటి జ్వరం సర్వే, హరితహారం, వా

్యక్సినేషన్‌ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో సర్వే వివరాలను కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 3,48,941 గృహాలు ఉండగా, 1,240 బృందాలను నియమించామన్నారు. మొదటి రోజు 1,06,093 ఇళ్లను సందర్శించి 3,83,891 మంది వివరాలు సేకరించామన్నారు. వారిలో 1,835 మందికి జర్వం లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ మకరంద్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డీఆర్డీవో చందర్‌ పాల్గొన్నారు.

జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

బోధన్‌రూరల్‌: ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్‌లో నిర ్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. సర్వే  తీరును ఆశా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెండు డోసులు తీసుకున్న 60సంవత్సరాలు పైబడిన వారు బూస్టర్‌ డోసును తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ గఫార్‌మియా, డిప్యూటీ ఈఈ శివానందం, ఏఈలు శివకృష్ణ, శ్రీనివాస్‌, మెప్మా శ్రీనివాస్‌లతో వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-22T06:49:54+05:30 IST