Abn logo
Sep 29 2021 @ 01:48AM

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

కొవిడ్‌ నింపిన కల్లోలం... ప్రభుత్వం నుంచి అందని సాయం

వైరస్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆసరా ఏదీ?


తిరుపతి సిటీ, సెప్టెంబరు 28:  కొవిడ్‌.. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. పిల్లాపాపలతో హాయిగా సాగిపోతున్న కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మహమ్మారి ధాటికి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు కొందరైతే.... పిల్లలే సర్వస్వంగా భావిస్తూ వారిని కోల్పోతున్న తల్లిదండ్రులు ఇంకొందరున్నారు. తల్లిదండ్రు లిద్దరినీ కోల్పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటే తల్లినో లేక తండ్రినో కోల్పోయి అనాథలుగా మారిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 10మంది చిన్నారులను అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురికి  ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 10 లక్షల సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో ఆరుగురు చిన్నారులను సాయానికి అర్హులుగా గుర్తించి వారి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.తల్లినో లేక తండ్రినో కోల్పోయిన సెమీ ఆర్ఫాన్‌ చిన్నారులను 500 మందికిపైగా అధికారులు గుర్తించారు. వీరిలో 200 మంది చిన్నారుల వివరాలను ప్రభుత్వానికి చేరవేయగా ఇంకా 300 మంది చిన్నారుల వివరాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 1000 మందికి పైగా 18 ఏళ్లలోపు చిన్నారులు సెమీ ఆర్ఫాన్‌ కింద ఉన్నారు. కానీ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టకపోవడం, ఈ ఆర్థిక సాయంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వందల సంఖ్యలో అర్హులు ఈ సాయానికి దూరమవుతున్నారు.


సాయానికి మెలిక

ప్రభుత్వ సాయానికి వివరాలు నమోదు చేసుకోవాలంటే మొదట కొవిడ్‌తో మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం అవసరం.అయితే ఈ పత్రాలు అంత తేలికగా అందడంలేదు. ఇంటి వద్ద మృతి చెందారని లేక కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత మృతి చెందారని అధికారులు మెలిక పెట్టి అర్హులైన చిన్నారులను సాయానికి దూరం చేస్తున్నారు.ఈ విషయమై ఐసీడీఎస్‌ పీడీ టి.ఉమామహేశ్వరిని అడగ్గా చిన్నారుల వివరాలను జిల్లావ్యాప్తంగా పక్కాగా సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులకు ఆర్థిక సాయం కూడా అందిందన్నారు.


దరఖాస్తు ఇలా చేసుకోవాలి

 కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు అందించే రూ. 10 లక్షల పరిహారం కోసం క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్‌ అధికారులు అర్హుల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపాలి. వారు నమోదు చేయకుంటే జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసే నాటికి పిల్లల వయస్సు 18 ఏళ్లలోపు ఉండాలి. పరిహారాన్ని ఏదైనా జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. ఆ బాండ్‌ను పిల్లలకు అప్పగిస్తారు. వారికి 25 ఏళ్లు నిండే వరకు ఆ నగదు నుంచి వచ్చే వడ్డీని చదువుల కోసం వినియోగించుకోవచ్చు. 25 ఏళ్లు నిండిన తరువాత ఏక కాలంలో మొత్తం నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒక్కరిని కోల్పోయిన 18 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఈ విధంగానే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ప్రతి నెలా రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఒక కుటుంబంలో ఇద్దరుంటే కూడా ఇద్దరు చిన్నారులకూ ఆర్థిక సాయం అందుతుంది.


పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు తిరుపతి చెన్నారెడ్డికాలనీకి చెందిన జి.వెన్నెల(10), జి.సిద్దార్థ(7). వీరి తండ్రి శ్రీనాథ్‌(45) వ్యవసాయ శాఖలో స్వీపర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో 2016లో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య మీనా(30) కష్టపడి చిన్నారులను పెంచుతుండేది. ఈ క్రమంలో ఆమె కొవిడ్‌ బారినపడి మే 16న మృతిచెందింది.చిన్నారుల బాధ్యతను ప్రస్తుతం వృద్ధురాలైన వీరి నాన్నమ్మ నాగమ్మ మోస్తోంది. ఇప్పటికే వయసు మీద పడిన ఆమె వారిని సాకలేక ఇబ్బందులు పడుతోంది.వీరికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందిన దాఖలాలు లేవు. 


పై చిత్రంలో నలుగురు చంటి బిడ్డలతో కనిపిస్తున్న మహిళ పేరు షహరున్నీషా. ఈమె తిరుపతి అర్బన్‌ మండల పరిధిలోని మాధవనగర్‌లో నివాసముం డేది. ఈమె భర్త రిజ్వాన్‌వలీ(34) కూలి పనులతో  కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కొవిడ్‌ బారిన పడి ఏప్రిల్‌ 16న మృతిచెందాడు. అప్పటివరకు భర్త, పిల్లలు తప్ప వేరే లోకం తెలియని షహరున్నీషా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని వయస్సులో ముగ్గురు ఆడబిడ్డలు, ఒక కుమారుడితో తమ్ముడి ఇంట్లో తలదాచుకుని జీవితాన్ని నెట్టుకొస్తోంది. వీరికి కూడా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందిన దాఖలాల్లేవు. కొవిడ్‌తో తల్లినో లేక తండ్రినో కోల్పోయిన సెమీ ఆర్ఫాన్స్‌ కింద అందే సాయం కాదు కదా కనీసం కొవిడ్‌తో మృతిచెందితే ప్రభుత్వం అందించే రూ. 15 వేల సాయం కూడా వీరికి అందలేదు.  


పై చిత్రంలో ఇద్దరు చిన్నారులతో కనిపిస్తున్న మహిళ తిరుపతిలోని మాధవనగర్‌కు చెందిన నాయిన రాధ. ఈమె భర్త రామయ్య(39) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.కొవిడ్‌తో మే 18న మృతి చెందాడు.అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో పెద్దదిక్కును కోల్పోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రాధ వార్డు వలంటీరుగా పనిచేస్తూ వచ్చే రూ. 5 వేలతోనే కుటుంబ భారాన్ని మోస్తోంది.ఈ చిన్నారులకు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.