గణతంత్ర వేడుకలకు కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-26T06:02:28+05:30 IST

గణతంత్ర దినోత్సవంపై కొవిడ్‌ ఎఫెక్ట్‌ పడింది.

గణతంత్ర వేడుకలకు కొవిడ్‌ ఎఫెక్ట్‌
గణతంత్ర వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్‌ ప్రాంగణం

- నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

- ఉదయం 10 గంటలకే అంతటా పతాకావిష్కరణ

- కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గణతంత్ర దినోత్సవంపై కొవిడ్‌ ఎఫెక్ట్‌ పడింది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కొవిడ్‌ నిబంధనల మేరకే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. జనసమ్మర్ధం లేకుండా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే పోలీస్‌ పరేడ్‌, శకటాల ప్రదర్శన, సర్టిఫికెట్ల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దయ్యాయి. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కాకుండా కలెక్టరేట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదురుగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటలకే పతాకావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లోనూ ఆ సమయానికే పతాకావిష్కరణ జరగనున్నది. కార్యక్రమంలో పాల్గొనేవారందరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని, వేడుకల ప్రదేశాలను శానిటైజ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 10 గంటలకు ముందు జెండా ఆవిష్కరణ చేయవద్దని సూచించారు. 


Updated Date - 2022-01-26T06:02:28+05:30 IST