కొవిడ్‌ దోపిడీ

ABN , First Publish Date - 2021-05-17T05:14:58+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ బాధితులకు చుక్కలు చూపెడుతోంది. ఇదే అదనుగా కొందరు మందుల దోపిడీకి తెరతీశారు. కొవిడ్‌ బాధితులకు అవసరమైన అత్యవసరమైన మందులతో పాటు అందరూ తప్పనిసరిగా వాడాల్సిన శానిటైజర్లు, మాస్కులను అమాంతం పెంచేశారు. అదేవిధంగా కరోనా బాధితులకు అత్యవసరంలో వినియోగించే ఇంజక్షన్లు, మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు.

కొవిడ్‌ దోపిడీ
ఒంగోలులో ఓ స్కానింగ్‌ కేంద్రం వద్ద రిపోర్టు కోసం వేచి ఉన్న బాధితులు

బ్లాక్‌లో కరోనా మందులు 

అత్యవసర మందుల ధరలు ఆకాశంలో..

మాస్కులు, శానిటైజర్లకు రెక్కలు

స్కానింగ్‌, పరీక్షల పేరుతో గుంజుడు

నకిలీ వైద్యులు, అనుమతుల్లేని ఆసుపత్రులు

ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై విజిలెన్స్‌ ఆరా

అయినా పట్టించుకోని యజమానులు

ఒంగోలు(క్రైం), మే 16 :


  కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతితో వైద్యంతోపాటు మందుల విక్రయాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. దీంతో  ప్రజలపై అదనపు భారం పడింది. గతంలో శ్వాసకోశాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని సమాచారం తెలుసుకునేందుకు చేయించే రక్తపరీక్షలు మొత్తం రూ.650 కాగా ప్రస్తుతం రూ.4,950 వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

 కొన్ని ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళితే రూ.లక్ష డిపాజిట్‌ చేయమని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా రోజుకు రూ.30వేల నుంచి రూ.40వేలు కూడా వసూలు చేసే ఆసుపత్రులు ఉండడం గమనార్హం.

 ఇటీవల కరోనా బాధితునికి శ్వాస ఇబ్బంది నేపథ్యంలో అత్యవసరమైన ఇంజక్షన్‌ ఎమ్మార్పీ రూ.7,000 కాగా ఒక్కొక్కటి రూ.15,000 చొప్పున 12 ఇంజక్షన్లను రూ.1.8లక్షలకు విక్రయించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 

 శానిటైజర్ల డబ్బాల నుంచి మాస్కులు కరోనా రోగులకు ఆక్సిజన్‌ పెట్టేందుకు వినియోగించే పరికరాలు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. సర్జికల్‌ మాస్క్‌ ధర రూ.3 లోపే కాగా మార్కెట్‌లో రూ.10కి విక్రయిస్తున్నారు. శానిటైజర్ల ధరలైతే పరుగులు తీస్తున్నాయి. నిన్న రూ.30 అమ్మిన శానిటైజర్‌ ఈరోజు లేబుల్‌ మార్చి రూ.40కు విక్రయిస్తున్నారు

 కరోనా వైద్యానికి వినియోగించే అనేక రకాల టాబ్లెట్స్‌, సిర్‌పలు ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నారు. తద్వారా అధికంగా వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు


కరోనా సెకండ్‌ వేవ్‌ కొంతమంది వైద్యులకు, మెడికల్‌ షాపుల యజమానులకు కల్పతరువుగా మారింది. ప్రాణాలు పోతున్నాయి అంటున్నా ఆసుపత్రుల్లో బెడ్‌ దొరికే పరిస్థితి లేదు. ఎలాగోలా అప్పులు చేసైనా సరే వైద్యం చేయించుకునేందుకు వెళితే కనీసం మందులు దొరకని పరిస్థితి నెలకొంది. కొంతమంది కరోనా మందుల డిమాండ్‌ను అనుసరించి బ్లాక్‌మార్కెట్‌కు తరలించి అధిక మొత్తాలకు విక్రయించుకుంటూ దండుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే.. నకిలీ వైద్యులు, అనుమతులు లేని ఆసుపత్రులు, అధిక మొత్తం వసూలు చేస్తున్న లేబొరేటరీలు, బ్లాక్‌లో మందుల విక్రయాలు, ఆసుపత్రిలో బెడ్‌ కావాలంటే డిపాజిట్‌ వసూళ్లు.. ఇలా వైద్యం పేరుతో సాగుతున్న దోపిడీతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది.


 కరోనా సెకండ్‌వేవ్‌ బాధితులకు చుక్కలు చూపెడుతోంది. ఇదే అదనుగా కొందరు మందుల దోపిడీకి తెరతీశారు. కొవిడ్‌ బాధితులకు అవసరమైన అత్యవసరమైన మందులతో పాటు అందరూ తప్పనిసరిగా వాడాల్సిన శానిటైజర్లు, మాస్కులను అమాంతం పెంచేశారు. అదేవిధంగా కరోనా బాధితులకు అత్యవసరంలో వినియోగించే ఇంజక్షన్లు, మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితులు శ్వాస సమస్య వచ్చిన సమయంలో వినియోగించే రెమ్‌డిసివిర్‌ లాంటి మందులు బ్లాక్‌లో విక్రయాలు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడటమే. ఇటీవల ఒంగోలులోని ఓ మెడికల్‌ షాప్‌లో కరోనా మందులకు అధిక మొత్తం వసూలు చేసినందుకు ఇరువురుని అరెస్టు చేశారు పోలీసులు. అలాగే విజిలెన్స్‌ తనిఖీల్లో ఓ వైద్యశాలలో రెమ్‌డెసివిర్‌ నిల్వలో అవకతవకలు జరిగాయని తేల్చారు. అంతేకాదు కనిగిరిలో కరోనా పరీక్షలకు అధిక మొత్తం వసూలు చేస్తున్న లేబొరేటరీ యజమానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా ఒంగోలు సుందరయ్యభవన్‌ రోడ్డులో అసలు డాక్టర్‌ పట్టా లేకుండా కరోనా రోగులకు వైద్యం చేస్తూ ఓ ఫార్మసిస్టు విజిలెన్స్‌ అధికారులకు దొరికిపోయాడు. దీనిని బట్టి కొవిడ్‌ వైద్యం పేరుతో దోపిడీ ఎలా సాగుతుందో ఇట్టే అర్ధమవుతోంది. కరోనా రోగులకు ఆక్సిజన్‌ ఇచ్చేందుకు వినియోగించే పరికరాలు సైతం బ్లాక్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. అసలు మాస్కులు ధరలు గమనిస్తే సర్జికల్‌ మాస్కు రూ.3 విలువ చేసేది ప్రస్తుతం రూ.10కి విక్రయస్తున్నారు. 


ఆసుపత్రుల్లో దోపిడీపై విజిలెన్స్‌ ఆరా

ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా రోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్యం ఇటీవల నిర్ణయించిన ధరలు అసలు ఎక్కడా అమలు కావడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం దొరకడం గగనంగా మారడంతో కొంతమంది ఆస్పత్రుల్లో అడిగినకాడికి ఇచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. అందుకు బయట వేలకు వేలు అప్పులు చేస్తున్నారు. ఆనేక ఆస్పత్రుల్లో  డిపాజిట్‌ పేరుతో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ముందుగానే చెల్లించిన తరువాత రోగులను చేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు ప్రభుత్వ వైద్యశాలలో బెడ్లు దొరకక, ప్రైవేటు వైద్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులలో ఫీజులు కూడా రోజుకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బిల్లులు రూపంలో ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు అనేక ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా వైద్యం చేయించుకొని ఇళ్లకు వెళ్లిన వారి చిరునామాలను సేకరించి ఆస్పత్రుల్లో వైద్యం ఎలా అందింది ఎంత బిల్లులు చెల్లించారు అనే కోణంలో విచారణ చేపట్టారు. దీంతో ఆసుపత్రుల వర్గాలకు చెందిన కొందరు రోగులను బతిమాలు కుంటున్నారు. మీరు విజిలెన్స్‌ అధికార్లకు అధికమొత్తం వసూలు చేసినట్లు చెప్పవద్దు అంటూ వేడుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపఽథ్యంలో విజిలెన్స్‌ దర్యాప్తులో కొంత మంది వద్ద అధికంగా వసూలు చేసినట్లు చెప్పినట్లు సమాచారం.


స్కానింగ్‌ నుంచి రక్తపరీక్షల వరకు గుంజుడే

కరోనా రోగులకు చెస్ట్‌ స్కాన్‌కు మూడువేలు తీసుకోవాల్సి ఉంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు వసూలు చేయడం గమనార్హం. ఎమర్జెన్సీ పేరుతో ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇంకా రక్తపరీక్షల పేరుతో ఐదు నుంచి రూ.10వేలు వరకు వసూలు చేస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసినప్పటికి పరీక్షల పేరుతో గుంజుడు ఆగలేదు. బ్లాక్‌లో మందులు విక్రయాలు, అధిక ఫీజులు వసూళ్లపై అధికార యంత్రాగం పూర్తిగా దృష్టి సారించాల్సి ఉంది.


Updated Date - 2021-05-17T05:14:58+05:30 IST