వైద్య సిబ్బందికి కొవిడ్‌ కష్టాలు

ABN , First Publish Date - 2022-01-24T06:09:07+05:30 IST

జిల్లాలో మార్చి 2019లో మొట్టమొదటిసారి కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

వైద్య సిబ్బందికి కొవిడ్‌ కష్టాలు

- పలువురికి పాజిటివ్‌

- జ్వర సర్వే చేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కరువు

- అడుగడుగునా ఇబ్బందులు

సుభాష్‌నగర్‌, జనవరి 23: జిల్లాలో మార్చి 2019లో మొట్టమొదటిసారి కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కరోనా నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలో రోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారికి సేవలందిస్తున్న పలువురు సిబ్బందికి, ఓ అధికారికి కొవిడ్‌ సోకినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలున్నాయి.

-22 నుంచి ఇంటింటి జ్వర సర్వే

 ఈ నెల 22 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వైద్య ఆరోగ్య శాఖ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వేను ప్రారంభించింది.  వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు మున్సిపాలిటీ పంచాయతీరాజ్‌ రెవెన్యూ మహిళా సంఘాల లీడర్లతో కూడిన టీమ్‌లను ఏర్పాటు చేసింది. వారంతా ప్రతిరోజు తమకు కేటాయించిన పరిధిలోని ఇళ్లకు వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హోం ఐసొలేషన్‌ కిట్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది రోజు కొంత మంది పాజిటివ్‌ బారిన పడినట్లు తెలిసింది.  అధికారులు వారందర్నీ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది.

- జిల్లా కేంద్రానికి గ్రామీణ పాంత్రాల సిబ్బంది

సిబ్బంది కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని జిల్లా కేంద్రంలో సర్వేకు కేటాయించారు.  వారికి నీళ్లు, భోజనం, ఇతర సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం సర్వేకు వెళ్లిన తర్వాత సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వరకు వారికి ఆహారం లభించడం లేదు. ఉదయం నుంచి నడుస్తూ ప్రతి ఇంటికి వెళ్లి సర్వేను నిర్వహిస్తున్న వారికి అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో  సర్వేను పూర్తి చేయాలని అధికారులు అంటున్నారు. తమ అవసరాలు గుర్తించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

-రెండు రోజుల్లో 92,756 ఇళ్లలో సర్వే

జిల్లాలో శనివారం ఇంటింటి జ్వర సర్వే ప్రారంభమైంది. రెండు రోజుల్లో 1,377 బృందాలు 92,756 ఇళ్లలో సర్వే నిర్వహించి 2,229 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. లక్షణాలు ఉన్నవారికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు.


Updated Date - 2022-01-24T06:09:07+05:30 IST