Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మళ్లీ కొవిడ్‌ దడ

twitter-iconwatsapp-iconfb-icon
మళ్లీ కొవిడ్‌ దడ

వేగంగా విస్తరిస్తున్న వైరస్‌

నాలుగు రోజుల నుంచి 

భారీగా కేసులు నమోదు

సంక్రాంతి వేళ అన్నిచోట్లా పెరిగిన రద్దీ

ఈ వారంలో పాజిటివ్‌లు

మరింత పెరిగే అవకాశం

నిర్లక్ష్యంగా జనం... 

నియంత్రణపై దృష్టి పెట్టని యంత్రాంగం

ఒంగోలు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : 

జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కోరలుచాస్తోంది. వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తూ దడపుట్టిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నాలుగు రోజుల నుంచి జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్‌ల సంఖ్య భారీగా ఉంటోంది. అదేస్థాయిలో క్రియాశీలక కేసులు పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది. జిల్లాలో నాలుగు రోజుల్లో ఏకంగా 617 మంది వైరస్‌ బారినపడటం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. సంక్రాంతి పండుగతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రద్దీ పెరగడం, వేలాది మంది బయటి ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లిన నేపథ్యంలో ఈ వారంలో మరిన్ని కరోనా కేసులు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రజల్లో కరోనా జాగ్రత్తల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. యంత్రాంగం వైపు నుంచి పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు కరువయ్యాయి. 

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈనెలలో ఇప్పటి వరకూ 886 పాజిటివ్‌లు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2020 మార్చి 18న తొలి కరోనా కేసు వెలుగు చూసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 1,39,706 పాజిటివ్‌లు నమోదయ్యాయి. 1131 మంది మరణించారు. అనధికారిక లెక్కల ప్రకారం మరో లక్ష వరకూ కేసులు, వెయ్యికిపైగా మరణాలు సంభవించినట్లు సమాచారం. గత నెల నుంచి జిల్లాలో థర్డ్‌వేవ్‌ వ్యాప్తిచెందుతున్నట్లు యంత్రాంగం భావిస్తున్నప్పటికీ డిసెంబరులో కేసుల నమోదు పరిమితంగానే ఉంది. ఈనెల తొలి వారం వరకు రోజువారీ కేసులు రెండంకెల లోపుగానే ఉన్నాయి. అయితే గడిచిన పది రోజుల నుంచి పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

నాలుగు రోజులుగా నిత్యం 100కుపైగా కేసులు

అధికారిక లెక్కల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు 886 కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు. వాటిలో గత నాలుగు రోజుల్లోనే  ఇంచుమించు 70శాతం మేర పాజిటివ్‌లు ఉన్నాయి. నిత్యం వందకుపైన కేసులు నమోదయ్యాయి.  అంతేకాక రోజువారీ వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ఈనెల 10వతేదీన 33 కేసులు నమోదు కాగా 11న 46, 12వతేదీన 90 నిర్ధారణ అయ్యాయి. 13వతేదీన కేసుల సంఖ్య ఏకంగా సెంచరీ దాటి 107 మంది వైరస్‌ బారిన పడ్డారు. 14వతేదీన 142, 15వ తేదీన 190, 16వతేదీన 178 వెలుగు చూశాయి. అలా వారం రోజుల్లో కేసుల సంఖ్య ఏకంగా 753 నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 810 క్రియాశీలక కేసులు ఉండగా ఈవారంలో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

కట్టడి చర్యలపై యంత్రాంగం నిర్లక్ష్యం 

ఒక్కసారిగా కరోనా విజృంభించి వేగవంతంగా కేసులు పెరుగుతున్నప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు, నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాంగంలో ఒకింత నిర్లక్ష్యమే కొనసాగుతోంది. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని చోట్ల రద్దీ అధికంగానే ఉంటోంది. ప్రత్యేకించి ప్రస్తుత సంక్రాంతి సమయంలో వ్యాపార ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రెస్టారెంట్లతోపాటు వివిధ క్రీడలు, ఇతరత్రా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో జనం రద్దీ భారీగా పెరిగింది. అత్యధిక చోట్ల మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటింపు మచ్చుకైనా కనిపించడం లేదు. అలాంటి పరిస్థితులను నియంత్రించి వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం ఆవైపు పెద్దగా దృష్టి పెట్టిన దాఖాలాలు లేవు. దీంతో జిల్లాలో మరింతగా కేసులు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

పరీక్షలు, చికిత్స చర్యలపై దృష్టి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు, ఆదేశాలతో కరోనా చికిత్స విషయంలో యంత్రాంగం ఒకింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారిని గుర్తించి వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. డిసెంబర్‌ 1నుంచి ఇప్పటి వరకు దాదాపు 22వేల మందికిపైగా విదేశాల నుంచి జిల్లాకు రాగా వారిలో 200 మంది వరకు పాజిటివ్‌ ఫలితం వచ్చింది. అందులో ఐదుగురికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మరోవైపు అధికారులు జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల మెరుగుకు చర్యలు చేపట్టారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కొవిడ్‌  సోకిన తర్వాత చికిత్స చర్యల కన్నా వైరస్‌వ్యాప్తి నివారణ ప్రధానంగా గుర్తించి అటు ప్రజలు, ఇటు యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


 ప్రముఖులకు కరోనా

గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు దంపతులకు పాజిటివ్‌

మంత్రి బాలినేని సతీమణికీ కొవిడ్‌

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళన పెరిగింది. సంక్రాంతి ఉత్సవాల్లో వీరు  అధికంగా పాల్గొనడంతో వారితో కలిసి తిరిగిన అనుచరులు, అభిమానులు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా హోంక్వారంటైన్‌కు వెళుతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన సతీమణి కొవిడ్‌ బారినపడ్డారు. వారిద్దరూ  ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రెండు రోజులుగా ఒంగోలు నియోజకవర్గంలో వివిఽధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆదివారం ఉదయం ఫలితం వచ్చిన వెంటనే బాలినేని కూడా కార్యక్రమాలను రద్దు చేసుకుని హోంక్వారంటైన్‌కు వెళ్లారు. శచీదేవితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని అనుచరుడు శేషారెడ్డికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయా కార్యక్రమాలకు హాజరైన అనుచరులు, వైసీపీ నేతలందరూ ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరు ఆదివారం మధ్యాహ్నం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.