అక్షయ తృతీయపై మళ్లీ కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2021-05-15T06:06:17+05:30 IST

వరుసగా రెండో ఏడాది అక్షయ తృతీయ బులియన్‌ మార్కెట్‌ను నిరాశ పరిచింది. కొవిడ్‌ రెండో దశతో ఈ సంవత్సరం కూడా బులియన్‌ మార్కెట్‌ కుదేలైంది

అక్షయ తృతీయపై మళ్లీ కొవిడ్‌ పంజా

వరుసగా రెండో ఏడాది పసిడి అమ్మకాలు ఢమాల్‌


న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాది అక్షయ తృతీయ బులియన్‌ మార్కెట్‌ను నిరాశ పరిచింది. కొవిడ్‌ రెండో దశతో ఈ సంవత్సరం కూడా బులియన్‌ మార్కెట్‌ కుదేలైంది. కొవిడ్‌కు ముందున్న 2019 అమ్మకాలతో పోలిస్తే శుక్రవారం ముగిసిన అక్షయ తృతీయ అమ్మకాలు పది శాతం కూడా లేవని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు అమలవుతున్నాయి. లాక్‌డౌన్‌ లేని సమయమైన  ఉదయం ఆరు నుంచి పదింటి లోపు కొన్ని చోట్ల కొన్ని షాపులు తెరిచినా చేసినా కొనుగోలుదారులు లేక షాపులు బోసిపోయాయి. కొవిడ్‌తో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమూ ఈ సంవత్సరం అక్షయ తృతీయ నగల అమ్మకాలను దెబ్బతీసింది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొద్ది స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. 


గ్రాము ‘గోల్డ్‌ బాండ్‌’ ధర రూ.4,777

ఈ నెల 17 నుంచి జారీ చేసే గ్రాము సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ఽ(ఎస్‌జీబీ) ధరను ప్రభుత్వం రూ.4,777గా ఖరారు చేసింది. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ధరపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆసక్తి ఉన్న మదుపరులు గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (జీబీఎస్‌) 2021-22 సీరిస్‌-1 పేరుతో ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారా ఈ బాండ్స్‌ జారీ చేస్తోంది. ఈ నెల 21 వరకు ఈ బాండ్స్‌ కోసం దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసిన అందరికీ ఈ నెల 25న బాండ్లను కేటాయిస్తారు. 

Updated Date - 2021-05-15T06:06:17+05:30 IST