కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-09-29T06:42:07+05:30 IST

జిల్లాలోని 13 మండలాల్లోని 43 పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. పట్టించుకోరా?
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న హరినారాయణన్‌

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: జిల్లాలోని 13 మండలాల్లోని 43 పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవో, తహసీల్దార్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేవీపల్లె, పీలేరు, చంద్రగిరి, కలికిరి, మదనపల్లె, ఎర్రావారిపాళ్యం, బి.కొత్తకోట, శ్రీకాళహస్తి, పూతలపట్టు, తిరుపతి రూరల్‌, పాకాల, రేణిగుంట, వాల్మీకిపురం మండలాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే అక్కడి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బి.కొత్తకోట, శ్రీకాళహస్తిల్లోని రెండు సచివాలయాల్లో గత వారం ఒక్క కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించక పోవడం సరికాదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నామన్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా జిల్లాలో 20 మలేరియా, 53 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని,  వైద్యాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లాకు టీకా మందులు రానున్నట్లు చెప్పారు. రామకుప్పం, కుప్పం, నగరి, వీకోట, బైరెడ్డిపల్లె, చిత్తూరు, కలకడ మండలాల్లో బయోమెట్రిక్‌ విధానంలో ఉద్యోగుల హాజరు శాతం పెరగాలన్నారు. జేసీలు వెంకటేశ్వర, రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:42:07+05:30 IST