సందేశాత్మకం ఈ కొవిడ్‌ బోర్డ్‌ గేమ్‌!

ABN , First Publish Date - 2020-12-24T05:30:00+05:30 IST

జర్మనీకి చెందిన నలుగురు అక్కచెల్లెళ్లు ్లకలిసి క్రిస్మస్‌ కానుకగా ఎవరూ ఊహించని గిఫ్ట్‌ను తమ దేశ ప్రజలకు అందించారు.

సందేశాత్మకం  ఈ కొవిడ్‌ బోర్డ్‌ గేమ్‌!

జర్మనీకి చెందిన నలుగురు అక్కచెల్లెళ్లు ్లకలిసి క్రిస్మస్‌ కానుకగా ఎవరూ ఊహించని గిఫ్ట్‌ను తమ దేశ ప్రజలకు అందించారు. కొవిడ్‌ థీమ్‌తో బోర్డు గేమ్‌ను ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు రూపొందించారు! ఈ బోర్డు గేమ్‌ను నలుగురు  ఆడాలి. ఇంటి పక్కన ఉండే సీనియర్‌ సిటిజన్స్‌ వైరస్‌ బారిన పడకుండా రక్షించేందుకు ఈ గేమ్‌ సహాయపడుతుంది. దీని సందేశం కూడా అదే. ఎలా అంటారా?  కొవిడ్‌ విజృంభిస్తున్న  ఈ సమయంలో  ఇంటి నుంచి బయటకు రాకుండా వారి గృహ అవసరాలను ఈ ఆట ద్వారా తీర్చవచ్చు. సీనియర్‌ సిటిజన్‌ కుటుంబం ఇచ్చిన షాపింగ్‌ లిస్టులోని సరుకులను ఈ ఆట ఆడుతున్న నలుగురిలో ఎవరు వేగంగా కొని ఆ కుటుంబానికి మొట్టమొదట అందజేస్తారో అతడు/ఆమె విజేత అవుతారు. కార్డులతో ఈ ఆట ఆడతారు. ఆ కార్డులను రెండు చేతులతో పైకి కిందకు తెస్తూ, మారుస్తూ గేమ్‌ కొనసాగిస్తారు. ఆట ఆడే క్రమంలో వైరస్‌ వంటి ఎన్నో ఆటంకాలు ఆటగాళ్లకు ఎదురవుతుంటాయి. కొవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో క్వారంటైన్‌ కావడమూ ఇందులో ఉంది. అయితే ఈ ఆటలో  అందర్నీ ఆకర్షించే ఒక వినూత్న కోణం ఉంది. ఈ ఆటను ఆడే నలుగురు ఆటగాళ్లు ఆటలో ఎత్తులు వేస్తూనే చక్కటి సంఘీభావాన్ని ప్రదర్శించాలి. తోటి ఆటగాళ్ల ఎత్తులకు సామరస్యంగా స్పందిస్తూ, సంఘీభావం కనబరస్తూ ఆట ఆడడమా లేదా! వారిని ఇరకాటంలో పెట్టేలా ఆటంకాలను సృష్టిస్తూ వైర్‌సతో ప్రత్యర్థి మార్గాన్ని బ్లాక్‌ చేయాలా! అన్నది   ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవాలి.  


తండ్రి ఆలోచనతో మార్కెట్‌లోకి

  స్ర్పింగ్‌ టైమ్‌లో జర్మనీలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు  జర్మనీకి చెందిన ఈ నలుగురు కొవిడ్‌ బోర్డు గేమ్‌కి ప్రాణం పోశారు. తాము రూపొందిస్తున్న బోర్డు గేమ్‌లో ఎప్పటికప్పుడు కరోనా గురించి వస్తున్న  కొత్త విషయాలను కూడా ఫోలో అవుతూ.... ఎన్నో  కొత్త కొత్త అంశాలను జోడిస్తూ  కరోనా గేమ్‌ను రూపొందించారు. ఇటలీలో కరోనా వైరస్‌ గురించి వ్యాప్తి ఉన్న సమయంలో ఎంతోమంది  తమ ఇంటి బాల్కనీలలో చేసిన కాన్‌సర్ట్స్‌ ఈ నలుగురు సోదరీమణులకు స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే ఈ అమ్మాయిలూ కార్డులతో కరోనా బోర్డ్‌ గేమ్‌కి రూపకల్పన చేశారు. ఈ విషయాన్ని నలుగురు సోదరీమణుల్లో ఒకరైన రెబకా వెల్లడించింది.


  తమ నలుగురు కూతుళ్లు రూపొందించిన కరోనా బోర్డు గేమ్‌ చూసి ముగ్దుడైన వాళ్ల తండ్రి బెనడిక్ట్‌ గేమ్‌ని కమర్షియల్‌ చేయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆ గేమ్‌లో వాడే కార్డులు, బోర్డు, బాక్సులను ప్రత్యేకంగా ఒక ఆర్టిస్టు చేత డిజైన్‌ చేయించారు. ఇప్పటిదాకా రూ.2వేల వరకూ ఈ కిట్స్‌  అమ్ముడయ్యాయి. అంతేకాదు ఒక బొమ్మల షాపుతో సెకండరీ డిస్ట్రిబ్యూటర్‌ ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు  బెనడిక్ట్‌. మొత్తానికి ఈ నలుగురు అక్కచెల్లెళ్లు  రూపొందించిన కరోనా బోర్డ్‌ గేమ్‌కి జర్మనీలో బాగా డిమాండ్‌ పెరిగింది. దీంతో అతి స్వల్ప వ్యవధిలో 500 గేమ్‌ కాపీలను ప్యాకింగ్‌ చేసి కస్టమర్లకు పోస్టు ద్వారా అందించారు ఈ నలుగురు జర్మన్‌ సిస్టర్లు. సరదాతో పాటు సందేశాత్మకంగా ఉన్న ఈ గేమ్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. 

Updated Date - 2020-12-24T05:30:00+05:30 IST