అన్ని పీహెచ్‌సీల్లో కొవిడ్‌-19 పరీక్షలు

ABN , First Publish Date - 2020-08-08T10:01:54+05:30 IST

జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

అన్ని పీహెచ్‌సీల్లో కొవిడ్‌-19 పరీక్షలు

220 పకడలతో కొవిడ్‌ బ్లాక్‌

హైదరాబాద్‌ వెళ్లి డబ్బు దుర్వినియోగం చేసుకోవద్దు

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కరోనా నిరోధక చర్యలతో పాటు పలు అంశాలంపై శుక్రవారం మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు వంద పడకలతో ఉన్న కొవిడ్‌ బ్లాక్‌ను, 220 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తున్నారన్నారు. అన్ని పడకలకు సెంట్రలైజ్‌ ఆక్సిజన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఆదివారం నుంచి ఈ పడకలన్నీ అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.


అలాగే ఎస్వీఎస్‌లో కూడా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌లో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా కొవిడ్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులందరూ అక్కడే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు 108, 104 వాహనాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌కు ధీటుగా మహబూబ్‌నగర్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని, హైదరాబాద్‌ వెళ్లి అనవసరంగా డబ్బు దుర్వినియోగం చేసుకోవద్దని మంత్రి సూచించారు.


అనంతరం రైతు వేదికల నిర్మాణాలపై మాట్లాడుతూ, సెప్టెంబర్‌ నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తవ్వాలన్నారు. మహబూబ్‌నగర్‌కు త్వరలో ఎనర్జీ పార్కు వస్తుందని, ఎనర్జీతో నడిచే బస్సుల తయారీ యూనిట్‌ కూడా రాబోతోందని మంత్రి వెల్లడించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఆర్డీవో శ్రీనివాస్‌, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామ్‌కిషన్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, డీఏవో వై.సుచరిత, హౌజింగ్‌ అధికారి రమణారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:01:54+05:30 IST