కొవిడ్‌-19 గురించి మరో షాకింగ్ న్యూస్!

ABN , First Publish Date - 2020-02-20T08:52:16+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ మూలాలు చైనాలోని ఒక ప్రయోగశాలలో ఉన్నాయా? సౌత్‌ చైనా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు ఈ ప్రశ్నకు

కొవిడ్‌-19 గురించి మరో షాకింగ్ న్యూస్!

చైనా ల్యాబ్‌ నుంచే  కొవిడ్‌-19!

అక్కడ గబ్బిలాలపై పరిశోధనలు

ఒక పరిశోధకుడిపై గబ్బిలాల దాడి

అతడి చర్మంపై గబ్బిలాల రక్తం, మూత్రం

సౌత్‌ చైనా వర్సిటీ శాస్త్రజ్ఞుల వ్యాసం

న్యూఢిల్లీ/ బీజింగ్‌/ టోక్యో, ఫిబ్రవరి 19: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ మూలాలు చైనాలోని ఒక ప్రయోగశాలలో ఉన్నాయా? సౌత్‌ చైనా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు. ‘ద పాజిబుల్‌ ఆరిజన్స్‌ ఆఫ్‌ 2019-ఎన్‌సీవోవీ కరోనా వైరస్‌’ పేరుతో వారు ఒక వ్యాసం రాశారు. దాని ప్రకారం.. చైనాలోని ‘వూహాన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’లో గబ్బిలాలపై కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వైర్‌సకు కేంద్రస్థానంగా భావిస్తున్న  వూహాన్‌లోని సీఫుడ్‌ మార్కెట్‌కు కేవలం 300 గజాల దూరంలో ఉందీ పరిశోధన కేంద్రం.


ఒకరోజు ఆ కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడిపై దాడి చేశాయని.. వాటి రక్తం అతడి చర్మంపై పడిందని, వాటి మూత్రం కూడా అతడిపై పడిందని వర్సిటీ నిపుణులు తమ పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఆ పరిశోధకుడు రెండువారాలపాటు స్వయంగా క్వారంటైన్‌లో ఉన్నాడని వివరించారు. మరోవైపు కొవిడ్‌-19 మృతుల సంఖ్య చైనాలో 2000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 75 వేల మందికిపైగా ఆ వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 74 వేల మంది చైనీయులు కాగా.. 1000 మందికిపైగా బాధితులు ఇతర దేశాల్లో ఉన్నారు.


ఆ వెయ్యి మందిలోనూ 621 మంది జపాన్‌ తీరంలో క్వారంటైన్‌గా మారిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని వారే! ఆ నౌకలో ఉన్న 138 మంది భారతీయుల్లో ఆరుగురు ఇప్పటికే వైరస్‌ బారిన పడగా.. బుధవారం మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్టు పరీక్షల్లో తేలింది. అతడితోపాటు మరో 88 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైరస్‌ భయం కారణంగా ఫిబ్రవరి 5 నుంచి అందులో బందీలుగా ఉండిపోయినవారిలో.. వైరస్‌ సోకని 500 మందిని జపాన్‌ అధికారులు బుధవారం నౌకలోంచి కిందికి దిగనిచ్చారు. ఇక, వూహాన్‌ నుంచి మనదేశానికి తరలించి ఐటీబీపీ క్వారంటైన్‌లో ఉంచిన భారతీయులందరినీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కాగా.. చైనా నుంచి చైన్నై రేవుకు చేరుకున్న ఒక నౌకలో ఇద్దరు చైనీయులకు జ్వరం రావడంతో వారిని నౌకలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు చెన్నై పోర్ట్‌ ట్రస్టు తెలిపింది. ఆ నౌకలోని సిబ్బంది అంతా(19 మంది) చైనీయులే కావడం గమనార్హం. 


2022 నాటికి వ్యాక్సిన్‌

2022 తొలినాళ్ల నాటికి కొవిడ్‌-19 వైర్‌సకు టీకా సిద్ధం అవుతుందని పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అమెరికాకు చెందిన కొడాజెనిక్స్‌ కంపెనీతో కలిసి టీకాను సిద్ధం చేశామని.. ప్రస్తుతం దాన్ని జంతువులపై పరీక్షిస్తున్నామని, ఆరు నెలల్లో మానవులపైనా పరీక్షిస్తామని పేర్కొంది.


గాంధీకి మరో ఇద్దరు అనుమానితులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారి వద్ద నుంచి నమునాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు. వారికి కొవిడ్‌-19 సోకిన లక్షణాలేవీ లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 75 మంది నమునాలు సేకరించగా, 73 మందికి వైరస్‌ లేదని తేలింది. ఇద్దరి నివేదిక రావాల్సి ఉంది.


క్షేమంగా చేరిన తెలుగు వారు

గుంటూరు(మెడికల్‌), ఫిబ్రవరి 19: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వెలుగుచూసిన చైనాలోని వూహాన్‌ నగరం నుంచి ఇద్దరు గుంటూరు జిల్లావాసులు బుధవారం క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. మూడు వారాల క్రితం 23 మంది తెలుగువారు వూహాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి మిలటరీ ఆస్పత్రిలో వారికి పలు దఫాలు వైద్యపరీక్షలు నిర్వహించగా, ఇన్ఫెక్షన్‌ లేదని తేలింది. దీంతో వారు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చేరుకున్నారు. ఈక్రమంలోనే గుంటూరుకు చెందిన ఇద్దరు బుధవారం స్వస్థలాలకు చేరుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రకటించాయి. 

Updated Date - 2020-02-20T08:52:16+05:30 IST