కొవాగ్జిన్‌ ధర రూ.295

ABN , First Publish Date - 2021-01-13T07:34:51+05:30 IST

‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’ టీకా ‘కొవాగ్జిన్‌’ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. 55 లక్షల కొవాగ్జిన్‌ డోసుల కొనుగోలుకు భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే స్వచ్ఛంద

కొవాగ్జిన్‌ ధర రూ.295

పన్నులతో కలుపుకొని రూ.309.50


న్యూఢిల్లీ, జనవరి 12 : ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’ టీకా ‘కొవాగ్జిన్‌’ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. 55 లక్షల కొవాగ్జిన్‌ డోసుల కొనుగోలుకు భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే స్వచ్ఛంద సేవా భావంతో 16.50 లక్షల డోసులను ప్రభుత్వానికి ఉచితంగా అందించాలని భారత్‌ బయోటెక్‌ నిర్ణయించింది. మిగతా 38.50 లక్షల డోసులను.. డోసుకు రూ.295 చొప్పున సర్కారుకు విక్రయించనుంది. పన్నులతో కలుపుకుంటే కొవాగ్జిన్‌ ధర రూ.309.50కు చేరనుంది. ఉచితంగా ఇవ్వనున్న 16.50 లక్షల డోసులను కలుపుకొని లెక్కిస్తే.. ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ.206కే అందుతోంది. ఈ ఒప్పందం మొత్తం విలువ రూ.162 కోట్లు.


మరోవైపు బ్రెజిల్‌ ప్రభుత్వంతోనూ భారత్‌ బయోటెక్‌కు డీల్‌ కుదిరిందని ఆకంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌   కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఇప్పటికే కోటి పది లక్షల ఆక్స్‌ఫర్డ్‌(కొవిషీల్డ్‌) టీకా డోసుల కోసం పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు సోమవారమే ఆర్డరు ఇచ్చిన కేంద్రం, ఏప్రిల్‌ నాటికి మరో 4.5 కోట్ల  డోసుల కొనుగోలుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఆ కంపెనీకి ఆర్డరు ఇచ్చిన మొత్తం డోసుల సంఖ్య 5.6 కోట్లకు చేరింది. ఇందుకోసం మొత్తం రూ.1,176 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది.


కొవిషీల్డ్‌ డోసు ధర రూ.210గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటు మార్కెట్‌లో ఒక్కో డోసును రూ.వెయ్యికి విక్రయిస్తామని ‘సీరం’ కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా మంగళవారం స్పష్టంచేశారు. సామాన్యులకు అండగా నిలవాలనే సంకల్పంతోనే మొదటి కోటి డోసులను రూ.200కే సర్కారుకు విక్రయించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-01-13T07:34:51+05:30 IST