Abn logo
Mar 4 2021 @ 01:25AM

కొవాగ్జిన్‌ సామర్థ్యం 81%

వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలను వెల్లడించిన భారత్‌ బయోటెక్‌

యూకే స్ట్రెయిన్‌ సహా అన్ని స్ట్రెయిన్లనూ

సమర్థంగా నిరోధించగలదని స్పష్టీకరణ

కొవాగ్జిన్‌ టీకాల వైపు ఫ్రాన్స్‌ చూపు?

కృష్ణ ఎల్లాను కలిసిన ఫ్రెంచ్‌ రాయబారి!

భారత్‌.. వ్యాక్సిన్‌ సూపర్‌ పవర్‌

కొవాగ్జిన్‌ విజయమే ఇందుకు నిదర్శనం

ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ


హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌ బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాపై సందేహాలు పటాపంచలయ్యాయి! ఆ టీకా సామర్థ్యంపై గూడుకట్టుకున్న భయాందోళనలు తొలగిపోయేలా.. వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలు వెల్లడయ్యాయి. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటిదాకా తయారైన ఏ వ్యాక్సిన్‌కూ కొవాగ్జిన్‌ తీసిపోదని ఆ ఫలితాల ద్వారా తేలింది. తమ టీకా సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అంతేకాదు.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే యూకే స్ట్రెయిన్‌ కరోనానూ తమ టీకా సమర్థంగా అడ్డుకుంటోందని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ టీకా మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన మధ్యంతర విశ్లేషణను భారత్‌ బయోటెక్‌ సంస్థ బుధవారం మధ్యాహ్నం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. దాని ప్రకారం.. గత ఏడాది నవంబరులో దేశవ్యాప్తంగా 25 ప్రాంతాలకు చెందిన 25,800 మంది వలంటీర్లపై కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభించారు. వారిలో 2433 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా.. 4500 మందికి కోమార్బిడిటీస్‌ (మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల వంటివి) ఉన్నాయి. వారిని రెండు బృందాలుగా విభజించి.. ఒక బృందంలోనివారికి కొవాగ్జిన్‌ టీకాను, మరో బృందానికి ప్లాసిబో(సెలైన్‌ వాటర్‌) ఇచ్చారు. అనంతరం కొద్దిరోజులకు వారిలో 43 మందికి కరోనా సోకింది. ఆ 43 మందిలో 36 మంది ప్లాసిబో గ్రూపువారు కాగా.. ఏడుగురు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు. 


అందరిలోనూ లక్షణాలు చాలా తక్కువ స్థాయిలో మాత్రమే కనిపించాయి. మొత్తమ్మీద వ్యాక్సిన్‌ ప్రభావశీలత 80.6ుగా ఉంది. అయితే, మరింత సమాచారం కోసం, వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు.. మొత్తం 130 కేసులు నమోదయ్యే దాకా ట్రయల్స్‌ను కొనసాగిస్తామని భారత్‌ బయోటెక్‌ సంస్థ వెల్లడించింది. కాగా, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ చేసిన విశ్లేషణ ప్రకారం.. కొవాగ్జిన్‌ టీకా వల్ల శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు యూకే స్ట్రెయిన్‌ను, ఇతర స్ట్రెయిన్లను కూడా నిలువరిస్తున్నాయని తేలిందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇక.. ‘‘వ్యాక్సిన్‌ అభివృద్ధిలో, కరోనాపై పోరులో ఈ రోజు(బుధవారం) ముఖ్యమైన మైలురాయి. మా వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలతో కలిపి.. మూడు దశల్లో 27 వేల మందిపై నిర్వహించిన ట్రయల్స్‌ తాలూకూ సమాచారాన్ని వెల్లడించాం.’’ అని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.  


ఫ్రాన్స్‌ ఆసక్తి..?

మనదేశంలో చాలా మంది కొవాగ్జిన్‌ టీకా వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. కానీ.. ఫ్రాన్స్‌ మాత్రం కొవాగ్జిన్‌ టీకాల కొనుగోలుపై దృష్టి సారించినట్టు మనీ కంట్రోల్‌ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు కొవాగ్జిన్‌ టీకాల కొనుగోలు నిమిత్తం భారతదేశంలో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లాను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి మాట్లాడినట్టు సమాచారం. కాగా.. 40కి పైగా దేశాలు తమ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపుతున్నాయని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. టీకాలను తయారుచేసిన తర్వాత నిర్వహించే ట్రయల్స్‌లో వాటి సామర్థ్యం (ఎఫికసీ) ఎంత అనే విషయంపైనే శాస్త్రజ్ఞులు దృష్టి సారిస్తారు. ట్రయల్స్‌ మధ్యలోనో, ముగిశాకనో.. ‘మా వ్యాక్సిన్‌ ఎఫికసీ ఇంత శాతం’ అని ప్రకటిస్తారు. ఈ కోవలోనే.. ఫైజర్‌ సంస్థ తమ వ్యాక్సిన్‌ సామర్థ్యం 95 శాతంగా ప్రకటించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ ఎఫికసీ 95 శాతం. ఇక కొవిషీల్డ్‌ ట్రయల్స్‌ ఒకదాంట్లో 90 శాతం, మరొక దాంట్లో 62 శాతం ఎఫికసీ వచ్చింది. దీంతో సగటున 70ు సామర్థ్యం ఉన్నట్లుగా తేల్చారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా సామర్థ్యం 66ు కాగా.. నోవావాక్స్‌ టీకా 89.3ు సామర్థ్యాన్ని కనబరిచినట్టు ఆ సంస్థ ప్రకటించింది. వీటన్నింటితో పోలిస్తే.. కొవాగ్జిన్‌ సామర్థ్యమేమీ తక్కువ కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


ఎఫికసీ అంటే ?

ఇంతకీ ఎఫికసీ అంటే ఏమిటి? ‘‘ఫైజర్‌ టీకా ఎఫికసీ 95ు అని ప్రకటించింది కాబట్టి.. ఆ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 95ు మందిపై వైరస్‌ ప్రభావం ఉండదు. మిగతా ఐదు శాతం మందిలో ఉంటుంది’’ అని చాలా మంది అనుకుంటారు. కానీ, అది తప్పు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల 95ు కేసులు తగ్గుతాయని దీని అర్థం. ఉదాహరణకు.. ఫైజర్‌ సంస్థ 43,448 మంది మీద ట్రయల్స్‌ నిర్వహించింది. వారిలో 21,720 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చింది. 21728 మందికి ప్లాసిబో (సెలైన్‌ వాటర్‌) ఇచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కేవలం 8 మందికి కరోనా రాగా.. వ్యాక్సిన్‌ తీసుకోని గ్రూపులో 163 మందికి వచ్చింది. ప్లాసిబో గ్రూపునకు కూడా వ్యాక్సిన్‌ ఇచ్చి ఉంటే ఆ గ్రూపులో కూడా 95ు తక్కువ కేసులు (163లో 95 శాతం తక్కువ అంటే.. రెండో గ్రూపులో కూడా దాదాపు 8 కేసులే) నమోదై ఉండేవి. దీన్నే వ్యాక్సిన్‌ ఎఫికసీగా వ్యవహరిస్తారు. ఇక ఎఫెక్టివ్‌నెస్‌ అంటే.. వ్యాక్సిన్‌ పనిచేసే తీరు. టీకా తయారీ పద్ధతి ఏదైనా.. రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేయడమే దాని లక్ష్యం. ఆ పనిని అన్ని వ్యాక్సిన్లూ చేస్తున్నాయి. కాబట్టి ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని.. సందేహాలు వద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement