కొవాగ్జిన్‌ ‘మూడోదశ’ ఫలితాలకు ఎస్‌ఈసీ ఆమోదం

ABN , First Publish Date - 2021-06-23T09:45:51+05:30 IST

భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ మూడోదశ ప్రయోగ పరీక్షల సమాచారంపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది.

కొవాగ్జిన్‌ ‘మూడోదశ’ ఫలితాలకు  ఎస్‌ఈసీ ఆమోదం

టీకా ప్రభావశీలత 77.8 శాతం 

25,800 మందిపై ట్రయల్స్‌లో గుర్తింపు

డీసీజీఐ నివేదికలో భారత్‌ బయోటెక్‌ వెల్లడి

డబ్ల్యూహెచ్‌వో అనుమతులకు ప్రయత్నాలు

కొవాగ్జిన్‌ ‘మూడోదశ’ ఫలితాలకు ఆమోదం 

టీకా ప్రభావశీలత 77.8ు: భారత్‌ బయోటెక్‌


న్యూఢిల్లీ, జూన్‌ 22 : భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ మూడోదశ ప్రయోగ పరీక్షల సమాచారంపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. తుది దశ ట్రయల్స్‌కు సంబంధించిన నివేదికను గతవారాంతంలోనే డీసీజీఐకు భారత్‌ బయోటెక్‌ సమర్పించగా, దాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ ఈమేరకు నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా 25,800 మందిపై నిర్వహించిన ఈ ప్రయోగ పరీక్షల్లో కొవాగ్జిన్‌ టీకా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలిందంటూ ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది.


కొవాగ్జిన్‌కు అంతర్జాతీయ స్థాయి అత్యవసర అనుమతుల అంశంపై చర్చించేందుకు బుధవారం (ఈనెల 23న) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారులతో భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు భేటీ కావడానికి ఒకరోజు ముందే.. టీకాకు ఎస్‌ఈసీ అనుమతులు లభించడం గమనార్హం. ఇక డబ్ల్యూహెచ్‌వో నుంచి కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులను పొందేందుకు మార్గం సుగమం అయినట్లేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ ప్రక్రియతో ముడిపడిన పత్రాలు, సమాచారం మొత్తాన్ని డబ్ల్యూహెచ్‌వోలోని సంబంధిత విభాగానికి భారత్‌ బయోటెక్‌ అందించిందని చెప్పాయి. 

Updated Date - 2021-06-23T09:45:51+05:30 IST