కౌలు కార్డులెక్కడ?

ABN , First Publish Date - 2022-07-07T05:56:21+05:30 IST

కౌలు కార్డులెక్కడ?

కౌలు కార్డులెక్కడ?

జిల్లాలో నత్తనడకన కౌలు కార్డుల జారీ ప్రక్రియ

ఇప్పటివరకు ఇచ్చింది 48 శాతమే.. 

జిల్లాలో కౌలు రైతు కార్డుల పంపిణీ లక్ష్యం 52,625

ఇప్పటివరకు పంపిణీ చేసినవి 25,127


కౌలు రైతు గుర్తింపు కార్డుల మంజూరు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభమైనా జిల్లాలో ఇప్పటివరకు 48 శాతం మందికే కార్డులు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలన్నింటికీ ఈ కార్డులే కీలకం కావడంతో ఏం చేయాలో తెలియక మిగతా రైతులు తలలు పట్టుకుంటున్నారు. 


గుడివాడ, జూలై 6 : పెదపారుపూడి మండలం యలమర్రులో 538 మంది కౌలు రైతులు ఉండగా,  కేవలం నలుగురికే పంట సాగు హక్కు పత్రాలు (కౌలు రైతు కార్డులు) జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. జిల్లాలో వ్యవసాయం చేసే వారిలో నూటికి తొంభై శాతం మంది కౌలు రైతులే. మనజిల్లాలో 1.54 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, ఇందులో మూడో వంతు మందికే పంట సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందులో కూడా ఇప్పటివరకు 48 శాతం మందికే జారీ చేశారు. గత ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఉన్న కార్డులనే పరిగణనలోకి తీసుకుని రైతు భరోసా నిధులు జమ చేశారు. దీంతో అత్యధిక శాతం మందికి ఈ పథకం అందలేదు. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని కౌలు రైతులు భయపడుతున్నారు. ఖరీఫ్‌ పనులు ముందస్తుగా ప్రారంభించామని ఘనంగా ప్రకటించుకున్న ప్రభుత్వం కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీలో తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గుర్తించిన కౌలు విస్తీర్ణ ఆయకట్టు తక్కువగా ఉండటంతో అదే దామాషాలో కార్డుల జారీకి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని తెలుస్తోంది. 

సగం కూడా ఇవ్వని దుస్థితి

జిల్లావ్యాప్తంగా కౌలురైతు కార్డుల ప్రక్రియ కేవలం 48 శాతమే పూర్తయింది. ఈ ప్రక్రియ ఆలస్యమైతే ప్రభుత్వ రాయితీలకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. నాగాయలంక మండలంలో అత్యధికంగా 87 శాతం మందికి కార్డులు జారీ చేశారు. గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో కేవలం 29 శాతమే పూర్తయింది. బందరు, కంకిపాడు మండలాల్లో 70 శాతానికిపైగా పూర్తిచేశారు. చల్లపల్లి, మోపిదేవి, కృత్తివెన్ను, పెనమలూరు, ఉయ్యూరు, గూడూరు, ఉంగుటూరు, బంటుమిల్లి, కోడూరు మండలాల్లో 50 శాతం పూర్తిచేశారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, గన్నవరం, పెడన, అవనిగడ్డ, మొవ్వ, పమిడిముక్కల, పామర్రు, బాపులపాడు, ఘంటసాల, గుడివాడ మండలాల్లో 50 శాతం కంటే తక్కువగా గుర్తింపు కార్డులు అందజేశారు. 

కౌలు రైతు కార్డు ఉంటేనే రైతు భరోసా

కౌలు రైతుల్లో అత్యధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. వీరికి గుర్తింపు కార్డు ఉంటేనే రైతు భరోసా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఏ రాయితీ పొందాలన్నా కార్డు తప్పనిసరి. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే వరి విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. పెడన, గూడూరు, బందరు, బంటుమిల్లి తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు పనులు ప్రారంభమయ్యాయి. పెదపారుపూడి మండలంలో బోర్ల కింద వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాకపోవడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు. పంట సాగుకు, పెట్టుబడికి బ్యాంకు రుణం పొందాలన్నా పంట సాగు హక్కు పత్రం అవసరం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పంట సాగు హక్కు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కౌలు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

అర్హులందరికీ ఇస్తాం..

కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రం మొత్తంమ్మీద మన జిల్లా ముందంజలో ఉంది. రెవెన్యూ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులు వ్యవసాయ శాఖ అధికారులను కలిసి గుర్తింపు కార్డులు తీసుకోవాలి. భూ యజమానులు కూడా అంగీకారం తెలపాలి.

- మనోహరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

Updated Date - 2022-07-07T05:56:21+05:30 IST