ఏలూరు: వైసీపీపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayudu) మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సస్పెన్షన్‌పై పార్టీ నియమావళి పాటించలేదని తప్పుబట్టారు. తనపై పార్టీకి ఫిర్యాదు చేసింది ఎవరు?, ఏమని చేశారు? అని ప్రశ్నించారు. కనీసం తనతో మాట్లాడకుండానే సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. ఎవరి ఒత్తిడితో తనను సస్పెండ్ చేశారో చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు పట్టుబట్టారు. వైసీపీ క్రమశిక్షణా సంఘం తీరుపై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. రోజు పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామ (Raghu Rama)పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. సీఎం జగన్ (Jagan) కన్నా ముందే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ అవినీతి లేదని కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ (YCP) నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ.. ఆయన్ను సాగనంపాలని సిఫారసు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించింది. ఈ హఠాత్తు నిర్ణయం వైసీపీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుతో కొత్తపల్లికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు మరింత చిచ్చు రాజేసింది. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నరసాపురాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా చేయకుండా భీమవరాన్ని చేయడాన్ని సుబ్బారాయుడు తీవ్రంగా విమర్శించారు.
ఎమ్మెల్యే వల్లే జిల్లా కేంద్రం రాలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రంగా నరసాపురాన్నే ప్రకటించాలంటూ అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ ఉద్యమంలో ఎమ్మెల్యేపై కొత్తపల్లి విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని బహిరంగ సభలో చెప్పుతో కొట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ప్రసాదరాజుకు అండగా ఉన్న అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నానిని కూడా కొత్తపల్లి వదల్లేదు. అయితే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ తుది నోటిఫికేషన్ రావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. రెండు నెలల నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి