ధాన్యం డబ్బులేవి?

ABN , First Publish Date - 2022-05-21T06:17:31+05:30 IST

‘ధాన్యం విక్రయించి రెండు నెలలైనా డబ్బులు రాకుంటే ఎలా? ఏడాదికి వచ్చే పంట ఒకటి, డబ్బులు ఎప్పటికి వస్తాయి?’ అని బొందలపాటి వెంకటేశ్వరరావు అనే రైతు ఎమ్మెల్యే సింహాద్రిని ప్రశ్నించారు.

ధాన్యం డబ్బులేవి?

ఎమ్మెల్యే సింహాద్రిని నిలదీసిన రైతు 

 కొత్తమాజేరులో గడప గడపనా సమస్యల ఏకరువు 

చల్లపల్లి, మే 20 : ‘ధాన్యం విక్రయించి రెండు నెలలైనా డబ్బులు రాకుంటే ఎలా? ఏడాదికి వచ్చే పంట ఒకటి, డబ్బులు ఎప్పటికి వస్తాయి?’ అని బొందలపాటి వెంకటేశ్వరరావు అనే రైతు ఎమ్మెల్యే సింహాద్రిని ప్రశ్నించారు. ‘మీరు ధాన్యం వ్యాపారికి అమ్మారా? ఆర్‌బీకేలో అమ్మారా’ అని ఎమ్మెల్యే అడుగ్గా, ఆర్‌బీకే ద్వారానే విక్రయించామని చెప్పటంతో అధికారులనడగి విషయం తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుచేసి నాలుగు రోజులైందని చెప్పగా 21 రోజులకు డబ్బులు వస్తాయని ఎమ్మెల్యే బదులిచ్చారు. ధాన్యం డబ్బులు, సాగునీటి సమస్యలు, లింగన్నకోడు వంతెన అభివృద్ధి, అస్తవ్యస్త రహదారులు, గృహనిర్మాణాలు ఇలా గడప గడపనా ప్రజలు సమస్యలు ఏకరువుపెట్టారు. సంక్షేమ పథకాలు అందే విషయంలో నెలకొన్న సమస్యలనూ కొందరు ప్రస్తావించారు. చల్లపల్లి మండలం కొత్తమాజేరులో 3వ రోజు శుక్రవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుకు ఎదురైన అనుభవాలివి. 

 లింగన్నకోడు వంతెన ప్రమాదకరంగా మారిందనీ, రెయిలింగ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయనీ, రహదారి అధ్వానంగా మారిందనీ, 9/2 బ్రాంచి కాలువకు సాగునీటి సరఫరా సరిగాలేకపోవటంతో సుమారు 450 ఎకరాల రైతులు సాగుకు ఇబ్బందులు పడుతున్నారని రైతులు కొల్లూరి నరసింహారావు, గొట్టిపాటి చంద్రశేఖరరావు, కోటేశ్వరరావులు ఎమ్మెల్యేకు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీఇచ్చారు.

 కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు, దళితవాడలో పర్యటించిన ఎమ్మెల్యే తనయుడు సింహాద్రి వికాస్‌కు మహిళలు, కాలనీవాసులు అంతర్గత రహదారుల సమస్యలు విన్నవించారు. వర్షం వస్తే నీటిలో నడవాల్సి వస్తోందని గ్రామంలో రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు.  2019లో అగ్నిప్రమాదంలో తమ గృహాలు దగ్ధమయ్యాయనీ పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలనీ పలువురు మహిళలు ఎమ్మెల్యేను కోరారు. గృహాలు మంజూరై ఉన్నాయనీ, కట్టుకోవాలని ఎమ్మెల్యే సూచించగా, పెద్దిబోయిన లక్ష్మి అనే మహిళ తాము ఇల్లు కట్టుకోలేమనీ, కాలనీ అంతా కట్టిఇస్తాం అన్నారనీ, కట్టి ఇవ్వాలని కోరగా, ఇళ్లు కట్టి ఇవ్వలేం.. గృహనిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తాం లబ్ధిదారులే కట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. చేయూత రెండవ విడత నగదు రాలేదనీ, పింఛన్‌ మంజూరు కాలేదనీ ఇలా పలువురు సంక్షేమ పథకాల మంజూరు విషయంలో సమస్యలు తెలియచేయగా, సంబంధిత అధికారులు, సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యేతోపాటు అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ కళ్లేపల్లి లక్ష్మి, ఎంపీటీసీలు తమ్ము లక్ష్మి, మోపిదేవి ద్వారకానాథ్‌, సొసైటీ చైర్‌పర్సన్‌ అర్జా శివశంకర్‌, ఈవోఆర్డీ బూరేపల్లి అశోక్‌, డీఈ భానూజీరావు, ఏఈ శేషగిరిరావు, కార్యదర్శి నరసింహారావు, వీఆర్వో ఓగిరాల నాగమల్లేశ్వరరావు, ఎస్‌ఐ సందీప్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T06:17:31+05:30 IST