కొత్త పాలకులు వచ్చేశారు !

ABN , First Publish Date - 2021-02-25T04:53:04+05:30 IST

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పలువురు సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త పాలకులు వచ్చేశారు !

బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు

మంచి ముహుర్తం కోసం మరి కొందరు నిరీక్షణ

నూతన ప్రజాప్రతినిధులకు అవగాహన తప్పనిసరి

ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి


ఆత్మకూరు, ఫిబ్రవరి 24 : జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పలువురు సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మరి కొందరు మంచి ముహుర్తం కోసం  ఎదురుచూ స్తున్నారు. కొత్తగా ఎంపికైన వీరికి పంచాయతీ  పాలన, చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో  జరగాల్సిన సమావేశాల ను గురించి తెలుసుకుందాం.


సాధారణ సమావేశం


  పంచాయతీలో సమస్యలు పరిష్కరించేందుకు, ఆర్ధిక వ్యవహారాలు చక్కదిద్దేందుకు  సర్పంచ్‌ల ఆధ్వర్యంలో 90 రోజులలోగా సాధారణ సమావేశం నిర్వహించాలి.ఈ సమా వేశంలో వార్డు సభ్యులతోపాటు గ్రామస్థులు కూడా పాల్గొం టారు. ఆ తరువాత  ప్రతి నెలా తప్పనిసరిగా  నిర్వహించే సాఽధారణ సమావేశంలో వార్డు సభ్యులు పాల్గొంటారు.  సమావేశ తేదీకి మూడురోజుల ముందుగా అజెండాతో కూడిన నోటీసు సభ్యులకు అందజేయాలి. పంచాయతీలోని మూడోవంతు సభ్యులు హాజరైతేనే సమావేశం నిర్వహించా లి. ఈ సమావేశం నిర్వహించడానికి సర్పంచ్‌కు, కార్యదర్శి లిఖితపూర్వకంగా నోటు సమర్పించాలి. సర్పంచ్‌ సమావేశ తేదీని నిర్ణయించినా, నిర్ణయించకపోయినా 90 రోజుల్లో తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలి. లేకపోతే పంచాయ తీ కార్యదర్శి ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994, సెక్షన్‌ 31 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.


అభ్యర్థన సమావేశం


పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాలకవర్గ సభ్యులు ఎవరైనా కోరితే.. అభ్యర్ధన సమావేశం నిర్వహి స్తారు. ఈ సమావేశానికి కూడా మూడో వంతు సభ్యుల లిఖితపూర్వక మద్దతు ఉండాలి. ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించాలి..? ఎప్పటిలోగా నిర్వహించాలి అన్న విషయాల ను స్పష్టంగా తెలియజేస్తూ 10 రోజుల ముందు సర్పంచ్‌కు కానీ, పంచాయతీ కార్యదర్శికి కానీ నోటీసు అందజేయాలి. నోటీసు అందిన ఐదు రోజులలోగా అందులో పేర్కొన్న అంశాలను చర్చించేందుకు సర్పంచ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


అత్యవసర సమావేశం 


 ఏదైనా కొన్ని అంశాలపై అత్యవసర నిర్ణయాలు తీసుకో వాల్సి ఉంటే అత్యవసర సమావేశం నిర్వహించవచ్చు. దీనికి కూడా మూడో వంతు సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది.


ప్రత్యేక సమావేశం 


  ఏదైనా ప్రత్యేక నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మూడు రోజుల వ్యవధిలోపు అజెండాతో కూడిన నోటీసును సభ్యులకు పంపించి ప్రత్యేక సమావేశం నిర్వహించవచ్చు.  ఈ అత్యవసర సమావేశంలో చేసిన తీర్మానాలను మొత్తం సభ్యుల్లో సగం మంది ఆమోదించాల్సి ఉంది. సహజంగా ఇలాంటి అత్యవసర సమావేశాలను మూడు నెలల్లో ఏదైనా తీర్మానాన్ని రద్దు చేయాల్సి వచ్చినా... మార్చాల్సి వచ్చినా నిర్వహిస్తుంటారు. ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.  ఇలా ప్రభుత్వ నిబంధనలు మేరకు పాలన సాగించి.. పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించాల్సిన బాధ్యత కొత్తగా ఎంపికైన పాలకులపై ఉంది.

Updated Date - 2021-02-25T04:53:04+05:30 IST