Abn logo
Nov 4 2021 @ 02:25AM

కోట్లు పెట్టి కొనుక్కున్న గుణపాఠం‌!

ఇటువంటి సందర్భాలలో ఆయన ఉన్నట్టుండి అంతర్థానమవుతుంటారు. కొన్ని రోజుల దాకా కనబడరు, వినపడరు. బహుశా, ‘ఆ మూల సౌధంబు దాపల’ గాయాలకు కట్టు కట్టుకుంటూ, సేద దీరుతూ ఉంటారు. ఆత్మవిమర్శ ఎక్కడ అవసరమవుతుందోనన్న భయంతో అస్మదీయులు, కొండంతను గోరంత చేసి చూపించే ప్రయత్నంలో మునిగిపోతారు. తివాచీ కిందికి ఊడ్చేయడానికి ఇది కాసింత కసవు కాదు కదా, దుమ్ము లేపిన గాలివాన!


తెలంగాణలో ఇప్పట్లో అధికారంలోకి రాలేని భారతీయ జనతాపార్టీలోకి చేరాక, ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో గెలిస్తేనేమి, ఓడిపోతేనేమి, పెద్దగా రాజకీయ పర్యవసానాలేమీ ఉండవు అని మొదట అనిపించింది కానీ, అంత తేలికగాపోకుండా తెలంగాణ రాష్ట్రసమితి అధినేతే, ఈ ఎన్నికలను మహాసంగ్రామంగా తీర్చిదిద్దారు. ఈ పోరాటానికి పెద్ద అర్థాన్ని ఆయనే కల్పించారు. తాను, తన బలగమూ, సమస్త కోశాగారమూ, తన ప్రతిష్ఠా పణంగా పెట్టి జూదానికి దిగారు. కృష్ణ తులాభారం లాగా, ఎంత సొమ్మూ ఓటరును తూచలేకపోయింది. ధనమూ, అధికారమూ, అహంకారమూ తప్ప మరేమీ లేని దుర్బలత్వంలో అధికారపక్షం పడిపోయింది. భూకంప కేంద్రం ఎక్కడ ఉన్నా, ప్రకంపనలు యావత్ తెలంగాణను కుదిపివేశాయి. గెలిచింది, రాజేందర్ అనే అసమ్మతివాదా? భారతీయ జనతాపార్టీ అనే రాజకీయ పార్టీయా? ఇక్కడ వ్యక్తమయింది, ఒక స్థానిక నాయకుడికి ప్రజలకు నడుమ ఉన్న దుర్భేద్య సంబంధమా? లేక, ఒక సార్వజనీన ఆగ్రహపు నమూనానా? 


హుజూరాబాద్ ఫలితంలో ప్రస్ఫుటమైన విలువ ఏదైనా ఉన్నదంటే, అది జనాభిప్రాయానికి, భాగస్వామ్యానికి స్థానం లేని అధికార రాజకీయం ఎప్పటికైనా దెబ్బతినవలసిందేనన్నది. తమ ప్రాంతం మీద, చరిత్ర మీద, సంస్కృతి మీద, స్థానిక ప్రయోజనాల మీద గాఢమైన అనురక్తిని రగిలించి రాజకీయాలను నిర్వహించిన ఉద్యమ నాయకుడు, తన ఓటర్లను డబ్బుతోను, మాయతోను ప్రలోభపెట్టడానికి, హీనపరచడానికి వేల కోట్లను కుమ్మరించడం, సొంత గొంతు పెగిల్చినందుకు సాటి పోరాటకారుడిని పగబట్టినట్టు వేధించడం ఊహకు కూడా అందని దుర్మార్గాలు. ఎన్నిక ఫలితం ఆంతర్యాన్ని సరిగ్గా గ్రహించగలిగితే, ప్రజల నిరసన పూర్వక నిరాకరణ అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి అహం అడ్డువస్తే, నిరాకరణ తిరస్కరణ అవుతుంది. 


ఈటల రాజేందర్ అనే నాయకుడి ఉద్యమ ప్రతిష్ఠ, ప్రభుత్వంలో ఉంటూనే ఆయన వ్యక్తం చేస్తూ వచ్చిన కించిత్ అసమ్మతి, ఇవి ఇవ్వగలిగే ప్రతిఘటన కంటె, ఎక్కువ ప్రతిఘటన హుజూరాబాద్ ఓటర్లు ఇచ్చారు. ఇందుకు భారతీయ జనతాపార్టీ బలం కారణమని చెప్పలేము. ప్రచారంలో, విజయంలో ఆ పార్టీ నాయకుల, కార్యకర్తల దోహదం ఉన్నది కానీ, ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి గతంలో ఉన్న పునాది ఏమంత గొప్పది కాదన్నది తెలిసిందే. హుజూరాబాద్ ఫలితం తనకున్న జనాదేశాన్ని పునరుద్ఘాటించాలని ముఖ్యమంత్రి అనుకున్నట్టే, ఆయన వ్యవహారసరళిపై తమ వ్యతిరేకతను స్పష్టం చేయాలని అక్కడి ఓటర్లూ అనుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, చాలా చోట్ల ఓటర్లు అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయవచ్చు. ఏ పార్టీ అని కాదు. అధికారపక్షానికి ఎవరు ఎదురు నిలవగలిగితే వారిని ఎంచుకోవడానికి సిద్ధపడవచ్చు. విప్లవ ఉద్యమాలకు ఒకనాడు పుట్టినిల్లుగా ఉన్న నియోజకవర్గంలో జనం బిజెపికి ఓటుచేయడానికి కూడా వెనుకాడకపోవడంలో ఒక మతలబు ఉన్నది, ఏలినవారు తెలుసుకుంటే!


తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వానికి, దాని అధినేతకు రాజేందర్ విజయం ఒకటో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేసిందనుకుందాం. మరి రాజేందర్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? అది ఫలవంతమయిందా? ఈటల రాజేందర్ స్వతంత్రంగా నిలబడి, తెలంగాణ అధికారపార్టీలోని అసమ్మతిని ఆకర్షించే కేంద్రం అయితే బాగుండేదన్న అభిప్రాయం మొదట్లో వ్యక్తమయింది. అందులో చాలా కష్టనష్టాలు ఉండవచ్చు. ఆస్తులు పూర్తి వివాదంలోకి వెళ్లే ప్రమాదం ఉండవచ్చు. జైలుకు కూడా వెళ్లవలసి రావచ్చు. అయినా, ధిక్కారంతో ముందుకు వెడితే, అందుకు తగ్గ ఫలితం కూడా ఉండేది. తన నాయకత్వంలో కొత్త రాజకీయ సమీకరణ జరిగి ఉండేది.. అది తనకే కాదు, తెలంగాణకు కూడా తప్పిపోయిన అవకాశం. కానీ, నాటి పరిస్థితులపై రాజేందర్ మదింపు భిన్నంగా ఉన్నది. శత్రువు కర్కశత్వాన్ని భరించలేమనుకున్నప్పుడు, అందుకు తగ్గ ఆలోచనలు రావడం సహజం. సొంతంగా నిలబడలేనని భావించిన రాజేందర్ తనకు రక్షణ కోసం ఒక జాతీయపార్టీని ఆశ్రయించారు. నిజానికి, రాజేందర్ బిజెపిలో చేరిన తరువాత, ఆయనపై ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష వేధింపులు తగ్గాయి. పరోక్ష నిఘాలు, గూఢచర్యాలు, అనుచరుల కొనుగోళ్లు వంటివి సరే. కానీ, తాను కోరుకున్న రక్షణ రాజేందర్‌కు లభించినట్టే ఉన్నది. కానీ, ఆయనను చేరదీసిన పార్టీ, సమీప భవిష్యత్తులో తెలంగాణ అధికారపీఠాన్ని చేరుకోగలిగినది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో ఓటములు, గెలిచిన ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు తప్ప సానుకూల వాతావరణం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష స్థాయిలో ఉన్నది. ఇప్పటికే ఉన్న అనేకమంది సీనియర్ నాయకులను, అందులోనూ బిసి నాయకులను కాదని రాజేందర్‌కు బిజెపిలో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుందా? అన్నది చూడాలి. 


అది కాక, భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో మరొక ఇబ్బంది ఉన్నది. తాము అధికారానికి రావడమే వారి ప్రథమ లక్ష్యం. అట్లా కాని పక్షంలో, టిఆర్‌ఎస్ అధికారంలో ఉండడమే వారికి అనుకూలం. వచ్చే సాధారణ ఎన్నికల్లో అవసరమైతే నాలుగు స్థానాలు మద్దతు ఇవ్వడానికి టిఆర్ఎస్ పనికివస్తుంది కానీ, కాంగ్రెస్ కాదుగా! రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ, కాంగ్రెస్, బిజెపి రెండూ దాన్ని తమకు అనుకూలంగా మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తే, బిజెపి టిఆర్ఎస్‌తో సామరస్యాన్నే కోరుకోవచ్చు. ఈ పరిస్థితి ఈటల రాజేందర్‌కు ఏమంత అనుకూలమైనది కాదు. బిజెపిలో చేరబోయే ముందు కూడా ఆయన, బిజెపికి, టిఆర్ఎస్‌కు ఉన్న అవగాహన గురించి ఆందోళన చెందారు. హుజూరాబాద్ ఫలితం వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ, తన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రాజేందర్ ప్రకటించారు. దానికి పార్టీ నుంచి సహకారం లభిస్తుందా లేదా జాతీయపార్టీలో స్వతంత్ర కార్యాచరణకు ఉండే పరిమితులేమిటి అనేవి క్రమంగా తెలిసివచ్చే విషయాలు. హుజూరాబాద్ ప్రచారంలో బిజెపి నేత లెవరూ, వారి తరహాలో సాంప్రదాయిక ప్రసంగాలు చేయలేదు. రాజేందర్ అభ్యర్థన మేరకు కావచ్చు, కొన్ని అంశాలకు మాత్రమే ఆ ప్రచారం పరిమితమయింది. కెసిఆర్ కుటుంబపాలన, వ్యవహారసరళి వంటి అంశాలపై బండి సంజయ్ ఉపన్యాసం జనరంజకంగాను, ప్రభావశీలంగానూ ఉండింది. ఒక్క నిర్దిష్ట నియో జకవర్గం కోసం ప్రత్యేక తరహాలో ప్రచారం జరగడానికి అనుమతించిన భారతీయ జనతాపార్టీ నాయకత్వం, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక వ్యూహరచన చేసి, బిసిల రాజకీయాధికారాన్ని ముందుకు తీసుకురాగలిగితే, రాజేందర్‌కు, బిజెపిలోని ఇతర నేతలకు కూడా లక్ష్యశుద్ధితో కూడిన రాజకీయ కార్యక్రమం సమకూరుతుంది. అప్పుడు కూడా, ఆ పార్టీ తన మతపరమైన అంశాలపై వక్కాణింపును పక్కకు పెట్టాలి. ఇదంతా జరగడానికి అవకాశాలు తక్కువ కాబట్టి, బిజెపి, రాజేందర్‌ల మధ్య సమన్వయం నల్లేరు మీద నడక కాకపోవచ్చును. 


ఈ విజయం అందించిన విశ్వాసం, రాజేందర్‌లోని సంకోచాలని, తటపటాయింపులను కొంత తొలగించి ఉండవచ్చు. తననింత బాధించిన రాజకీయ శక్తిపై గట్టి పోరాటానికి ఆయన ఉపక్రమిస్తారని అర్థమవుతూనే ఉన్నది. కానీ, బిజెపిలో ఉన్న రాజేందర్ వైపు టిఆర్ఎస్‌లోని బాధితుల సమీకరణ జరుగుతుందా? ఈ మొత్తం క్రమం అంతా టిఆర్ఎస్‌లోని విధేయులను, రహస్య అవిధేయులను భయపెట్టిందేమో కూడా! రాజేందర్ ఏవో తంటాలు పడి, మరో పార్టీని చేరుకుని, తానూ కొంత ఖర్చు పెట్టుకుని నెగ్గుకు వచ్చాడు కానీ, అది అందరికీ సాధ్యం కాదని, అంత యాతన తాము పడ లేమని అధికులు పాఠం తీసుకున్నారేమో? అటువంటి భయాన్ని అందరిలో ప్రతిష్టించడానికే అధినేత హుజూరాబాద్‌పై ఇంతగా గురిపెట్టారేమో? తెలంగాణ రాష్ట్రసమితిలో విధేయతల సరళిలో ఇకపై వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. కొత్తగా తోకలు ఝాడించగలిగే ధైర్యం ఎవరిలో నన్నా కనిపిస్తోందా? అట్లా కనిపించే తోకలను కత్తిరించే దమ్ము ఇక మీదట అధినేతకు ఉంటుందా? ఏది ఏమయినా, రానున్న రోజులలో తెలంగాణ రాజకీయాలు రంజుగా మారనున్నాయనిపిస్తోంది.

కె. శ్రీనివాస్

ప్రత్యేకం మరిన్ని...