ముగిసిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం

ABN , First Publish Date - 2021-07-25T07:18:23+05:30 IST

కొవిడ్‌ కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగి.. సుభిక్షంగా ఉండాలని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శనివారం పూర్ణాహుతితో ముగిసింది.

ముగిసిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం
అమ్మవారు - పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు

వేడుకగా చక్రస్నానం 



తిరుచానూరు, జూలై 24: కొవిడ్‌ కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగి.. సుభిక్షంగా ఉండాలని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. అమ్మవారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆలయంలోని కేటీ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నిత్య హవనం, మహా ప్రాయశ్చితహోమం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ నిర్వహించారు. తర్వాత ఉత్సవర్లు, చక్రత్తాళ్వార్లకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత గంగాళంలో చక్రస్నానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి అవతారమైన పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ.. టీటీడీ నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంతో మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ఆకాంక్షించారు. జేఈవో సదాభార్గవి, సీవీఎస్వో గోపీనాఽథ్‌జెట్టి దంపతులు, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు మధు, శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-25T07:18:23+05:30 IST