తెరపైకి కొత్తమండలాల నినాదం

ABN , First Publish Date - 2022-08-20T07:09:43+05:30 IST

జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు కోసం కొట్లాట జరుగుతోంది.

తెరపైకి కొత్తమండలాల నినాదం
బీరవెల్లి గ్రామ సూచిక బోర్డు ఇదే

ఆందోళన బాటలో జిల్లాలోని పలు  గ్రామాలు 

నెలరోజులుగా వరుస ఆందోళనలు

పట్టించుకోని పాలకులు

నిర్మల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు కోసం కొట్లాట జరుగుతోంది. తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తామని పాలకులు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఆ గ్రామస్థులు పట్టుబడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో కొన్ని కొత్త మండ లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జిల్లాలో కూడా ఈ డిమాండ్‌ మళ్లీ తీవ్రమవుతోంది. గతంలో జిల్లాలోని పలు మేజర్‌ గ్రామ పంచా యతీలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామంటూ పాలకులు ప్రక టించారు. అయితే ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ప్రభుత్వం కూడా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొం దింపజేసినప్పటికీ ఆ ప్రతిపాదనలకు ఇప్పటి వరకు మోక్షం కల్పించ లేదు. దీంతో ఆయాగ్రామాల్లో కొత్తమండలాల కోసం ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ముఖ్యంగా మామడ మండలంలోని పొన్కల్‌ గ్రామస్థులు గత నెల రోజుల నుండి కొత్త మండలం కోసం పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో రాజకీయ చైతన్య గ్రామంగా పేరు ఉన్న పొన్కల్‌ వాసులు గతంలో తమకు ఇచ్చిన హామీని నెర వేర్చాలంటూ పట్టుబడుతున్నారు. వీరంతా ప్రత్యేక ఉద్యమ శిబిరాన్ని ఏర్పాటు చేసి రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రామస్థులు మండల కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించారు. అలాగే తమ గ్రామానికి వచ్చిన అధికార నేతలను సైతం మండల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఇక నిరసన కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో పొన్కల్‌ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలు ఈ ఆందోళనలో పాల్గొంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి, కడెం మండలంలోని లింగాపూర్‌, తానూర్‌ మండలంలోని బెల్‌తరోడా గ్రామా లను కూడా మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉధృ తం అవుతోంది. ఈ గ్రామాలను గతంలోనే కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తామని పాలకులు హామీని ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చకపోవడం పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

రోజుకో రీతిన నిరసన కార్యక్రమం

కాగా జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తీవ్రమవుతోంది. ముఖ్యంగా మామడ మండలంలోని పొన్కల్‌ గ్రామస్థులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ గత నెల రోజుల నుండి పెద్దఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. రోజుకో కొత్తతరహా ఆందోళన చేపట్టి వీరు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొదట మామడ మండలకేంద్రంలో భారీ ఊరేగింపు నిర్వహించిన పొన్కల్‌ గ్రామస్థులు ఆ తర్వాత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే గ్రామంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు. చివరకు గ్రామంలోని ఓ కుక్కకు కూడా వినతిపత్రం సమర్పించి తమ నిరసన వెల్లడించారు. అలాగే కడెం మండలంలోని లింగాపూర్‌ గ్రామస్థులు కూడా కొత్త మండలం కోసం గొంతెత్తుతున్నారు. వీరంతా ఇక వరుస ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి గ్రామస్థులు కూడా కొత్తమండలం ఏర్పాటు కోసం ఆందోళన బాట చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తానూర్‌ మండ లంలోని బేల్‌తరోడా వాసులు కూడా కొత్త మండలం కోసం ఉద్యమిం చేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. 

హామీని నిలబెట్టుకోవాలి

తంలో అధికార పార్టీ నేతలు తమ గ్రామానికి మండలంగా ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. మళ్లీ ఎన్నికలు రాబోతు న్నాయి. తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయనట్లయితే తాము, తమకు హామీ ఇచ్చిన నేతలకు సహాయ నిరాకరణ చేస్తాం. ఇప్పటి కైనా స్పందించి వెంటనే పొన్కల్‌ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలి. లేనట్లయితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. 

ద్యాగల రాము, పొన్కల్‌ గ్రామస్థుడు

బీరవెల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి

బీరవెల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పా టు చేయాలని సర్పంచ్‌ రవీంధర్‌రెడ్డి అ న్నారు. బీరవెల్లి మండలంగా ఏర్పాటైతే ఇక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన ప్రభు త్వ సేవలు అందడంతో పాటు మండల కేంద్రానికి దూరభారం తగ్గుతుంది. ప్రభు త్వ కార్యాలయాలు కూడా అందుబాటులో ఉండడంతో వెను వెంటనే పనులు కూడా పూర్తవుతాయి. ఇకనైనా పాలకులు, అధికారులు దృష్టిలో ఉంచుకొని బీరవెల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 

రవీంధర్‌రెడ్డి, సర్పంచ్‌, బీరవెల్లి 

బేల్‌తరోడాను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి

బేల్‌ తరోడా గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామం చుట్టు పక్కల చాలా గ్రామాలు ఉ న్నాయి. ప్రస్తుతం తానూర్‌ మండల కేంద్రం దూరం గా ఉండడంతో తమకు ఇబ్బందులు తలె త్తుతున్నాయి. గతంలోనే ప్రజాప్రతినిధులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. లేనట్లయితే ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాము. 

Updated Date - 2022-08-20T07:09:43+05:30 IST