కోటప్పకొండ తిరునాళ్లకు పగడ్బందీ ఏర్పాట్ల

ABN , First Publish Date - 2021-03-02T05:46:06+05:30 IST

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అధికారులను ఆదేశించారు.

కోటప్పకొండ తిరునాళ్లకు పగడ్బందీ ఏర్పాట్ల
సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌, డీఎస్పీ డి.విజయభాస్కరరావు

సమీక్షా సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌

నరసరావుపేట, మార్చి 1: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అధికారులను ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం తిరునాళ్ళ ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండదిగువ చేపట్టిన రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.  డీఎస్పీ డి.విజయభాస్కరరావు మాట్లాడుతూ ట్రాఫిక్‌ ఇబ్బందు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  తిరునాళ్ళకు 430 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు  అధికారులు తెలిపారు. వీఐపీల కోసం 25 బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 9 వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ పరీక్షలకు కిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

11, 12న విద్యుత్‌ సరఫరా నిలిపివేత 

  ప్రభలు కొండకు చేరే సమయంలో యూటీ దగ్గర ఉన్న ప్రధాన విద్యుత్‌ లైన్‌కు సరఫరా నిలిపివేసేందుకు పవర్‌ గ్రిడ్‌ నుంచి అనుమతులు లభించాయని అధికారులు తెలిపారు. అయితే మునిసిపల్‌ ఎన్నికలు 10న జరుగుతున్నందున చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని పురుషోత్తపట్నం నుంచి నిర్మిస్తున్న 8 ప్రభలను 8వ తేదీన కొండకు తరలించాలని ఇందుకు సంబంధించి విద్యుత్‌ సరఫరా నిలిపివేతకు అనుమతులు తీసుకోవాలని పవర్‌ గ్రిడ్‌ అధికారులకు డీఎస్పీ సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:46:06+05:30 IST