ప్రజల మనోభావాలతో జగన్‌ చెలగాటం

ABN , First Publish Date - 2020-08-02T11:45:29+05:30 IST

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జి ..

ప్రజల మనోభావాలతో జగన్‌ చెలగాటం

అమరావతిపై మాటమార్చారని విమర్శ

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 1 :  ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  విమర్శించారు. నెల్లూరులోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలకు పుట్టగతులుండవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజధాని అమరావతి మార్పు ఉండదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. నాడు అమరావతికి మద్దతిచ్చిన జగన్‌ ఇప్పుడెందుకు మాటమార్చారన్నారు.


రాజధాని రైతుల గుండె ఘోషను సీఎం జగన్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33వేల ఎకరాలను ఇచ్చిన రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని, దీనిపై బీజేపీ నేతలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారన్నారు. రాజధాని బిల్లు సెలెక్ట్‌ కమిటీలో ఉండగా దానిని గవర్నర్‌ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానిగా ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ ఉచ్చి భువనేశ్వరీప్రసాద్‌, ఆకుల హనుమంతు పాల్గొన్నారు.


రాజ్యాంగ విరుద్ధం

మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి గంజాం రాఘవేంద్ర అన్నారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఆయన నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈబిల్లుపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటే గవర్నర్‌ బిల్లును ఆమోడించడం రాజ్యాంగ విరుద్దమన్నారు. రాజధానిని విశాఖకు మార్చితే నెల్లూరు జిల్లాకే ఎక్కువ నష్టమని పేర్కొన్నారు.


ప్రజావ్యతిరేక చర్య

బిల్లుపై గవర్నర్‌ సంతకం పెట్టడం ప్రజావ్యతిరేక చర్య అని జడ్పీ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌ అన్నారు. బిల్లుపై గవర్నర్‌ సంతకం చేయడాన్ని నిరసిస్తూ తన కార్యాలయంలో ఆయన తెలిపారు. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి అసాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉడతా సుమన్‌యాదవ్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T11:45:29+05:30 IST