Abn logo
Sep 18 2021 @ 01:39AM

‘ఫ్యాన్‌’ వేయాలంటే భయం

మాట్లాడుతున్న కోటంరెడ్డి


పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 17 : వైసీపీ గుర్తు ఫ్యాన్‌ అని, విద్యుత్‌ బిల్లుల మోతతో ఇళ్లలో ఫ్యాన్‌ వేయాలంటే ప్రజలు భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలపై పైసా కూడా భారం మోపేదిలేదని ఎన్నికలకు ముందు పాదయాత్రలో అక్కడ జగన్‌, ఇక్కడ అనిల్‌ ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. చంద్రబాబు నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రం రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రాజధాని నిర్మించడమే కాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. కానీ నేడు విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కి రూ.1.30 పైసలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారన్నారు. కరోనాకి భయపడి ఇన్నాళ్లు ఇంట్లో కూర్చున్న జగన్‌, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడం తో ప్రజల్లోకి వస్తున్నాడని, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకి ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. ఆయన బయటకొస్తే జనాగ్రహం తప్పదన్నారు. ఎంతమంది పీకేలు వచ్చినా ఏమీ పీకలేరని, జగన్‌ను పైకి లేపలేరన్నారు. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో విడతల వారీగా ధర్నాలు చేస్తామన్నారు. జగన్‌ దిగిపోయే వరకు టీడీపీ మిలిటెంట్‌ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పిట్టి సత్యనాగేశ్వరరావు, ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌, అనగాని ప్రసాద్‌, మాబాషా, తానే మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.