కోటకు కొత్త ‘కాంతులు’

ABN , First Publish Date - 2022-05-17T05:42:05+05:30 IST

కోటకు కొత్త ‘కాంతులు’

కోటకు కొత్త ‘కాంతులు’
ఖిలావరంగల్‌ మధ్యకోటలోని ఖుష్‌మహల్‌కు ఏర్పాటు చేసిన పసాడ్‌ లైట్లు, మెట్ల వద్ద ఏర్పాటు చేసిన పసాడ్‌ లైట్లు, మధ్యకోటలో వెలగని ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లు

రూ.ఆరు కోట్లతో లైటింగ్‌  

కొనసాగుతున్న లైట్ల అమరిక పనులు  

త్వరలో విరజిమ్మనున్న వెలుగులు


ఖిలావరంగల్‌, మే 16: కాకతీయుల కట్టడాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ఖిలావరంగల్‌లోని శిల్పాలు కొత్త వెలుగులతో పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శిల్పాలు, కట్టడాలు, ఏకశిలగుట్ట, దక్షిణ ద్వారానికి పసాడ్‌ కంపెనీ రంగురంగుల లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో బాక్స్‌లో తొమ్మిది వరుసల్లో ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. మొదటి మూడు వరుసల్లో ఎరుపు, తర్వాత మూడు వరుసల్లో ఆకుపచ్చ, మిగతావి పసుపుపచ్చవి ఉన్నాయి. విద్యుత్‌ ఆదాతోపాటు రంగురంగుల వెలుతురుతో శిల్పాలు అద్భుతమైన శోభను సంతరించుకోనున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. సుమారు నెలరోజుల నుంచి పసాడ్‌ కంపెనీ పనులను శరవేగంగా చేస్తోంది. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది. కాగా, కోటకు పర్యాటకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు, వేసవి సెలవుల దృష్ట్యా పెద్దలు, పిల్ల్లలు పెద్దసంఖ్యలో కోటను సందర్శిస్తున్నారు. 


రూ.6కోట్లతో లైట్లు..

కోటలోని శిల్పసంపదకు కొత్త అందాలు అద్దేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయగా, పసాడ్‌ సంస్థ సుమారు రూ.6కోట్లతో విద్యుత్‌  దీపాలను అమర్చుతోంది. మధ్యకోటలోని దక్షిణ ద్వారం, మెట్ల ప్రాంతం, ఖుష్‌మహల్‌, ఏకశిలగుట్టపై పెద్ద సంఖ్యలో పసాడ్‌లైట్లను శాశ్వతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కోటలోని రాతి, మట్టికోటతో పాటు శిల్పాల ఆవరణ, కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్‌, శృంగారపుబావి, అక్కాచెళ్లెళ్ల బావి, సవతుల బావి, కోడికూత బావి, మినీ వేయిస్తంభాల దేవాలయం, రామాలయం, శివాలయాలను ఉదయంతో పాటు రాత్రులు సైతం వీక్షించవచ్చు. కోటలో కాకతీయుల చరిత్రను తెలిపే లైట్‌ అండ్‌ సౌండ్‌షో, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.. వీటికితోడు పసాడ్‌ లైటింగ్‌ తోడయితే పర్యాటకులకు మరింత కనువిందు కానుంది. 


అభివృద్ధి పనులు పూర్తయితే..

కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. మధ్యకోటలో మంకీఫుడ్‌ కోర్టు, 25ఎకరాల్లో వనవిహారం, ఏకశిల పిల్ల్లలపార్కుతో పాటు ప్రారంభానికి సిద్ధమౌతున్న కాకతీయుల చరిత్రకు సంబంధించిన పనిముట్లు, ఆభరణాలు, ఆయుధాలు, శిల్పాలు, విగ్రహాలు, నాణేలు తదితర వస్తువులను ప్రతాపరుద్ర మ్యూజియంలో సందర్శకులు వీక్షించవచ్చు.


టికెట్ల ధరలు ఇలా.. 

కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో  శిల్పాలు, ఖుష్‌మహల్‌, ఏకశిలగుట్ట, శృంగారపు బావులను తిలకించేందుకు పెద్దలకు టికెట్‌ రూ.25, 12 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాకతీయుల కాలంనాటి చరిత్రను తెలిపే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను తిలకించేందుకు పెద్దలకు రూ.40, పిల్ల్లలకు రూ.20, షో ప్రతీరోజు సాయంత్రం 6 నుంచి 6.50 గంటల వరకు, రెండోషో 7నుంచి 7.50 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే, ఏకశిల పిల్ల్లల పార్కులో పెద్దలకు టికెట్‌ రూ. 20, పిల్ల్లలకు రూ.10. 


మధ్యకోటలో పనిచేయని ‘కుడా’ లైట్లు

‘కుడా’ ఆధ్వర్యంలో లక్షల రూపాయలు వెచ్చించి ఎల్‌ఈడీ లైట్లు మధ్యకోటలోని రాతికోట చుట్టూ ఏర్పాటు చేశారు. ‘కుడా’ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంధకారం నెలకొంటోంది. మధ్యకోటలో 4 కిలోమీటర్ల చుట్టూ రాతి కట్టడాలకు మెట్లు ఉన్నాయి. ‘కుడా’ ఆధ్వర్యంలో రాతికోట చుట్టూ గతంలో సీసీరోడ్డు నిర్మించారు. రాతికోటను పర్యాటకులు ఉదయంతో పాటు రాత్రులు తిలకించేందుకు సుమారు 200 ఎల్‌ఈడీ లైట్లను గత సంవత్సరం ఏర్పాటు చేశారు. కానీ, పర్యవేక్షణ లోపంతో అవి వెలగడం లేదు. దీంతో పర్యాటకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-05-17T05:42:05+05:30 IST