జగపతిబాబులో ఆ గుణం ఉంది: కోట (పార్ట్ 55)

ఇప్పుడు నాకు కూతుర్లు ఇద్దరు కాదు. మా కోడలితో కలిపి ముగ్గురు. అసలు మా వాడు పోయాడని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చిన్నప్పటి నుంచే నా కాల్షీట్లు చూసేవాడు. మేం ఉంటున్న ఇంటిని దగ్గరుండి ప్లాన్ చేసి, ఇష్టపడి తనే కట్టించాడు. ఈ ఇంటి ప్రతి ఇటుకలో మా వాడి చెమట చుక్క ఉంది. ప్రతి ఇంచిమీద వాడి పేరుంది. వాడిని తలచుకుంటే నిద్రపట్టదు. తిండి తినాలనిపించదు. భగవంతుడు నా పట్ల అంత నిరాదరణ ఎందుకు చూపించాడో అర్థం కాదు. సర్లెండి.. మా వాడి సంగతి పక్కనపెడదాం.

అదే జగపతిబాబు సిద్ధాంతం

జగపతిబాబు గురించి మరొక్కమాట చెప్పాలండీ.. అతనిలో నాకు బాగా నచ్చింది ఏమంటే ‘లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌’ తాను బతుకుతూ, పది మందిని బతికించాలనే సిద్ధాంతం ఉన్న నటుడతను. సెట్‌లో ఎవరైనా నిజంగా బాగా చేశారనే అనుకుందాం. అలాంటివారి గురించి ‘ఫలానా వాడు చాలా బాగా చేస్తాడండీ’ అని ధైర్యంగా నలుగురితోనూ చెప్పే గుణం అతనికి ఉంది. చాలా మంది అలా చెప్పారు. కాస్త పేరున్నవారు, హీరోలు అవతలివారి ప్రతిభను గుర్తించినప్పుడు చాలా ఉపయోగం ఉంటుందండీ. ‘హీరోగారే చెప్పారంటే అతనిలో ఏదో ఉండే ఉంటుంది’ అనే ఆలోచనతో అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ముందుకొస్తారు. అలా నాలుగు అవకాశాలు వస్తే ఆ సదరు వ్యక్తి జీవితం నిలబడుతుందనేది నా ఉద్దేశం.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Advertisement

FilmSerialమరిన్ని...

Advertisement