పవర్‌స్టార్ అలా అనగానే.. కళ్ళలో నీళ్ళు వచ్చాయి: కోట (పార్ట్ 52)

బన్నితో నటించిన ‘జులాయి’ కూడా అంత మంచి చిత్రమే. బనియన్‌ వేసుకుని, పంచె కట్టుకుని మెడలో రుద్రాక్షతో నల్లదారం వేసుకుని చాలా బావుంటుంది ఆ పాత్ర. అందులో ఒక డైలాగ్‌ ఉంటుందండీ. ‘రిషికొండ నుంచి భీమిలికి వెళ్ళే రూట్‌లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుతుందయ్యా అమ్మాయి నడుములాగా. కరెక్టుగా అక్కడ పదెకరాల బిట్టు మనకుంది బిట్టూ... అక్కడ కూర్చుంటే వైజాగ్‌ మొత్తం మన కాళ్ల కింద ఉన్నట్టు ఉంటుంది. చిన్నప్పుడు అక్కడే కూర్చునేవాణ్ణి. కరెక్టుగా అట్టాంటి బిట్టే ఒకటి హైదరాబాద్‌లో ఉందని విన్నానయ్యా. అక్కడ కూర్చోవాలని ఉంది. అలా సెయ్యాలంటే పవరుండాలి.. అది రావాలంటే కనీసం వెయ్యి ఉండాలి. వెళ్లి తెచ్చేయ్‌..’ అని. సోనూసూద్‌ని వెళ్ళి 1500కోట్ల రూపాయలు తీసుకురమ్మని నేను చెప్పే డైలాగ్‌ అన్నమాట. ఇలాంటి డైలాగులు రాయాలంటే కేవలం భాషమీద పట్టు ఉంటే సరిపోదు. ప్రాంతాల మీద అవగాహన ఉండాలి. లోకజ్ఞానం అవసరం. అది ఉంటే తప్ప ఇలాంటి డైలాగులు రాయలేరు. 


జనాలకు ఇట్టే కనెక్ట్‌ అయ్యే డైలాగులు ఇవే మరి. ఆ చిత్రంలో మరో సన్నివేశంలో సోనూసూద్‌ నన్ను చంపుతాడు. నేను బాధతో అల్లాడుతూ ‘‘డబ్బు మీకిచ్చేస్తానయ్యా’’ అని అరుస్తాను. అయినా కనికరించకుండా చంపేస్తాడు. నేను విలవిలా కొట్టుకుని చచ్చిపోయాక బిట్టు అంటాడూ, ‘‘తప్పు... మెమ్మమ్మ బెబ్బబ్బానా?మేమేం మాట్లాడుకున్నామో తెలుసా.... హ్యాండీకేప్డ్‌ని కామెంట్‌ చేయకూడదు. తప్పు అది..’ అని. రైటర్‌ ఎంత సెన్సిటివ్‌గా ఆలోచించకపోతే అలాంటి డైలాగులు పుడతాయి చెప్పండి. ఆ మాటే నేను త్రివిక్రమ్‌తో అంటే ‘నటుడిగా మీరేమైనా తక్కువ తిన్నారా కోటగారూ.. నేను డైలాగులే రాశాను. కానీ మీవి ఎక్స్‌ప్రెషన్స్‌, గొంతులో ఎక్స్‌ట్రా సౌండ్స్‌తో ఆ డైలాగుకు ప్రాణం పోశారు కదా. అలాంటివి మీకు ఎవరూ నేర్పక్కర్లేదు. సహజసిద్ధంగా వస్తూ ఉంటాయి’ అన్నారు ఆయన.

వేదికమీద నా కళ్ళుచెమర్చడం అదే ఫస్ట్‌ టైమ్

అంతకు ముందు ‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగింది. దాదాపు యూనిట్‌ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యాం. చాలా భారీ ఎత్తున చేశారు. ఆ వేడుకలో పవనకల్యాణ్‌గారు ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి ‘‘కోటగారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసుగానీ, అనుభవం కానీ సరిపోదు’’ అన్నారు. ఫస్ట్‌టైమ్‌ అనుకుంటా ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం. ఒక అరనిమిషం నా కళ్ళ నుండి నీళ్ళు కారాయి. హాల్లో జనాలందరూ ‘పవర్‌స్టార్‌ పవర్‌స్టార్‌’ అని కేకలు పెడుతుంటే, అంతటి క్రేజ్‌ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు గౌరవంగా చెప్పడం నాకు గొప్పగానే అనిపించింది.


అదే వేదికమీద త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావుగారు’’ అన్నారు. ఆయన సినిమాల్లో ఎక్కువ వేషాలు చేయకపోయినా, చేసిందే తక్కువే అయినా జీవితంలో గుర్తుండిపోయే చిత్రాలు చేశాను. ఒక ఆర్టిస్టుగా నేను చేయదగ్గ పాత్రలను త్రివిక్రమ్‌ చిత్రాల్లో చేశా. నాలోని నటుణ్ణి వెలికితీసిమరీ మంచి వేషాలిచ్చి చేయించారు త్రివిక్రమ్‌.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Advertisement

FilmSerialమరిన్ని...

Advertisement