Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 23 Oct 2021 22:01:12 IST

కనుబొమ్మలు తీసేస్తే క్రైమ్ అని.. నా మేకప్‌మ్యాన్ అలా చేశాడు: కోట (పార్ట్ 42)

twitter-iconwatsapp-iconfb-icon

ఒక రకంగా ఆర్టిస్ట్‌గా హీరో వెంకటేశ్‌గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన, నేను కలిసి యాక్ట్‌ చేసిన చిత్రాలన్నీ మంచి హిట్‌లు. అవన్నీ దాదాపుగా కథా పరంగా ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలే. మా కాంబినేషన్‌లో తొలి సినిమా ‘వారసుడొచ్చాడు’. 1988 అక్టోబర్‌లో విడుదలైంది. సుహాసిని నాయిక. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిశోర్‌గారు నిర్మించారు. మోహన్‌గాంధీ దర్శకత్వం వహించారు. అందులో శేషమ్మ అనే పాత్రలో నిర్మలమ్మ నటించారు. ఆమె అల్లుళ్లుగా అమ్మిరాజు పాత్రలో మారుతిరావుగారు, సుబ్బరాజు పాత్రలో నేనూ చేశాం. అంటే నేనూ మారుతిరావుగారు తోడల్లుళ్లం అన్నమాట. ఆ సినిమాలో మోహన్‌బాబుగారిది కూడా కీలక వేషం. ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా మారుతిరావుగారు అన్న మాటొకటి నాకు గుర్తొస్తుంటుందండీ... ఒక సన్నివేశంలో నిర్మలమ్మ అల్లుళ్లను ఇద్దరినీ పిలిచి ‘చెరి ఇన్ని ఎకరాలు ఇస్తాను. ఇద్దరూ వ్యవసాయం చేయండి... ఎవరు బాగా చేసి ఎక్కువ ధాన్యం పండిస్తే ఆ పొలం వారికే చెందుతుంది’ అని షరతు పెడుతుంది. ఇద్దరం ఒకరిముఖాలు ఒకరం చూసుకుంటాం.


అప్పుడు మారుతిరావుగారు ‘‘అలాగే అత్తయ్యా. చూస్తూ ఉండు.. నేను ‘రాజనాలు’ పండిస్తాను’’ అని అంటారు. అప్పుడు నేనంటానూ.. ‘రాజనాలా అంటే సైన్మ్ యాక్టర్‌ కదా... అయితే నేను రేలంగిని పండిస్తాను’ అని. ఆ సినిమా చేస్తున్నంత సేపు మారుతిరావుగారు చాలా బాగా మెచ్చుకునేవారు. ‘తెలంగాణ మాండలికాలతో చంపేస్తున్నావయ్యా నువ్వు. మేం ఎంత బాగా నటించినా, ఏం చేసినా, నువ్వు నోరు తెరిచి ఆ యాసతో నాలుగు డైలాగులు చెబితే మా ప్రతిభంతా కొట్టుకుపోతుంది’ అని తరచూ అనేవారు. ఆ తర్వాత కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో చేసిన ‘శత్రువు’ ఎంత పెద్ద హిట్‌ అయిందో మీకు తెలిసిందే. అందులో నేను చేసిన వెంకటరత్నం అనే కాంట్రాక్టర్‌ పాత్రకు రామ్‌గోపాల్‌వర్మ పెద్ద ఫ్యాన్.

ఒకరోజు వర్మగారు ఫోన్ చేసి ‘‘శ్రీనివాసరావుగారూ ఇప్పుడే ‘శత్రువు’ చూశానండీ. స్ర్కీన్ ముందు కూర్చుని విలన్ పాత్ర ఎప్పుడు వస్తుందా? అని నేను జీవితంలో రెండో సారి ఎదురుచూశాను. కాంట్రాక్టర్‌గా సిస్టమ్‌ను చేతిలో పెట్టుకుని నడిపించే పాత్రలో ఇట్టే ఒదిగిపోయారండీ. ఆ మాట మీతో పంచుకోవాలనిపించి ఫోన్ చేశాను’’ అని అన్నారు. ‘ఇంతకు ముందు మిమ్మల్ని అంతగా మెప్పించిన విలన్ సినిమా ఏది సార్‌?’ అని అడిగా. పైకి అడిగాను కానీ మనసులో ‘షోలే’ అయి ఉంటుందని అనుకున్నా. ప్రశ్న నా నోటి నుంచి రాకముందే ఆయన ‘షోలే అండీ’ అని అన్నారు. చాలా ఆనందంగా అనిపించి రామకృష్ణగారికి చెప్పా. ఆ తర్వాత కూడా వెంకటేశ్‌గారితో చాలా చిత్రాలు చేసినా.. ‘అబ్బాయిగారు’ మరో స్పెషల్‌ చిత్రం. అందులో అతనికి పినతల్లి జయచిత్ర. ఆమె ఎంత చెబితే అంత. తల్లిమాట జవదాటని కొడుకుగా నటించారు వెంకటేశ్. నేనేమో జయచిత్రగారి బ్రదర్‌గా చేశా. మీనా హీరోయిన్‌గా నటించింది. గోదావరి పరిసరాల్లోనే ఈవీవీ తెరకెక్కించాడు. రాశీమూవీస్‌ నరసింహారావుగారు నిర్మించిన సినిమా అది. తమిళంలో భాగ్యరాజ్‌ చేశారు. చాలా మంచి కథ. జంధ్యాలగారు డైలాగులు రాశారు.

కనుబొమ్మలు తీసేస్తే క్రైమ్ అని.. నా మేకప్‌మ్యాన్ అలా చేశాడు: కోట (పార్ట్ 42)

పెద్ద హిట్ చిత్రం గణేష్

ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘గణేశ్’ ఒక ఎత్తు. నా కెరీర్‌లో చాలా పెద్ద హిట్‌ సినిమా. అందుకే అందులో నా పాత్రను గురించి చాలా స్పెషల్‌గా చెప్పాలి. అందులోనూ ముఖ్యంగా నాకు, వెంకటేశ్‌బాబుకి బాగా నచ్చిన సినిమా ‘గణేశ్’. ఆ సినిమా మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఒకరోజు డి.సురేశ్‌బాబుగారు పిలిచారు. ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియోకి వెళ్లా. ‘కోటగారూ... వెంకటేశ్‌బాబుతో ఓ సినిమా అనుకుంటున్నాం. అందులో హెల్త్‌ మినిస్టర్‌ సాంబశివుడు అని ఒక పాత్ర ఉంటుంది. మీకు చక్కగా సరిపోతుంది. కాకపోతే గుండు కొట్టించుకోవాలండీ.. కనుబొమ్మలు కూడా తీసేయాలి. అందుకు గవర్నమెంట్‌ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ల పర్మిషన్ తీసుకోకుండా కనుబొమ్మలు తీసేస్తే క్రైమ్‌. బొంబాయి వాళ్లయితే తీసేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్లకైనా లక్షలు ఇచ్చుకోవాలి. మీరైతే నేటివిటీ బావుంటుంది. అందుకే చెప్తున్నా. మరి కనుబొమ్మల సంగతి ఏం చేయాలో ఆలోచించుకోండి’ అని అన్నారు సురేశ్‌బాబుగారు. ‘సరేనండీ. చాలా సినిమాలున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తా’ అని వచ్చేశా. ఆ తర్వాత రెండు రోజులకు మరలా కలిశాం. ‘నేను చేస్తానండీ’ అని అన్నా. ‘కనుబొమ్మలు తీసేస్తారా’ అని అడిగారు సురేశ్‌బాబు. ‘లేదండీ. కనుబొమ్మలు తీయను. తీయాలంటే గవర్నమెంట్‌కు పర్పస్‌, రీజనూ అన్నీ చెప్పాలి. పైగా నాకు అవతల చాలా సినిమాలున్నాయి. వాళ్లందరికీ ఇబ్బంది అవుతుంది. నా మేకప్‌మ్యాన్‌తో మాట్లాడాను. మేం మేకప్‌తో మేనేజ్‌ చేస్తాం. మీకు నచ్చితే చూడండి’ అని అన్నా. అందుకాయన... ‘గుండు కొట్టించుకుని, కనుబొమ్మలు తీసేస్తే మనిషిని గుర్తుపట్టడం నిజంగా కష్టమే. కానీ మేకప్‌తో ఆ లుక్‌ వస్తుందా? వస్తుందేమో చూడండి’ అని అన్నారు. ఆ మాట అన్నదే తడవుగా మా మేకప్‌‌మేన్ మోహన్ నా స్కిన్‌టోన్‌లో కలిసే విధంగా కనుబొమ్మలకు రంగు వేశాడు. చూడగానే నిర్మాతకు నచ్చేసింది. ఆ సినిమాలో నన్ను స్ర్కీన్ మీద చూసినప్పుడు కనుబొమ్మలు తీసేశానేమోననే అనిపిస్తుంది. అంత మాయ చేసింది మేకప్‌. ఆ తర్వాత మా దర్శకుడికి పిల్లి కళ్ళ ఆలోచన వచ్చింది. కానీ ఎలా పెట్టాలి? అని ఆలోచిస్తున్నప్పుడు వెంకటేశ్‌గారి మేకప్‌మేన్ రాఘవ అని ఉన్నాడు. అతను అంతకుముందు ఎప్పుడో వెంకటేశ్‌బాబుకి వాడిన ఐస్‌ తెచ్చి పెట్టి చూపించాడు. అంతా ‘పర్ఫెక్ట్‌’ అని అన్నారు. ఆ సంవత్సరం నాకు నంది అవార్డు వచ్చింది. ఆ గెటప్‌ అంత బాగా రావడానికి మా మోహన్‌తో పాటు రాఘవ కూడా ఓ చేయి వేసి సహకరించాడు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

FilmSerialLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement