ఆ విషయం జీవితతో చాలాసార్లు చెప్పా: కోట (పార్ట్ 10)

అది భగవంతుడి స్ర్కీన్‌ప్లే

‘వందేమాతరం’ సినిమా చేసేటప్పుడు విజయశాంతికి రత్నం అని మేకప్‌ మ్యాన్ ఉండేవాడు. తర్వాత పెద్ద ప్రొడ్యూసర్‌ కూడా అయ్యాడాయన. ‘ఎందుకైనా మంచిది ఈయన ఫేస్‌కి విగ్‌ పెడితే బావుంటుంది’ అని నాకు విగ్‌ పెట్టాడు రత్నం. విగ్‌ ఎందుకా? అనుకున్నా. కానీ ఆ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మా నాన్నగారు చనిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అపరకర్మలు చేసినప్పుడు గుండు, పిలకా.. తప్పదు. ఎలాగా? అని ఆలోచించా. ఆ సమయంలో విగ్‌ గుర్తుకొచ్చింది. ‘విగ్‌ ఎంత సేవ్‌ చేసిందీ’ అనుకున్నా. ఏదో సామెత చెప్తారే.. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడనీ.. అది నా గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనమూ కాదు. అది ఆ టైమ్‌. సక్సెస్‌కి వెనకాల తప్పకుండా ఓ పద్ధతి ఉంటుంది. అదే భగవంతుడి స్ర్కీన్‌ప్లే. అది నేను బాగా నమ్ముతాను. అలాంటివి నమ్మకుండా మన ప్రమేయంతో పెట్టుకుంటే మనకి టెన్షన్ అండీ.


ఆ విషయం జీవితతో చాలాసార్లు చెప్పా

యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కి ‘వందేమాతరం’ మొదటి సినిమా. నాది కూడా మంచి వేషం. టి.కృష్ణగారికి బాగా నచ్చింది. ఆ సినిమా చేస్తున్నన్ని రోజులూ నేను చెన్నై పాండిబజార్‌లోని ఓ హోటల్‌లో ఉండేవాణ్ణి. ఓ రోజు అక్కడ ఏం తిన్నానో ఏమో ఒళ్ళంతా వాచింది. అప్పుడే రాజశేఖర్‌ వచ్చాడు. నన్ను చూసి ‘ఇదేంటి? ఇలా ఉబ్బిపోతున్నారు’ అని అడిగాడు. ‘నాకేం అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఇలా అవుతున్నా’ అని చెప్పా. కాసేపటికి స్పృహ కోల్పోయినంత పని జరిగింది. ఏమనుకున్నాడో ఏమో వెంటనే నన్ను లేవదీశాడు రాజశేఖర్‌. ఆయన డాక్టర్‌ కాబట్టి వెంటనే నన్ను చేయి పట్టుకుని కిందికి తీసుకొచ్చి ఆటో ఎక్కించి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళాడు. లేకుంటే నేను తాత్సారం చేసుండేవాణ్ణి. అప్పుడు ఏం జరిగేదో ఏమో? ఇప్పటికీ రాజశేఖర్‌ కనిపిస్తే ఆ విషయమే గుర్తు చేస్తుంటా. జీవితతో కూడా చాలా సార్లు చెప్పా. ఈ సినిమా గురించి ఇంకో విషయం చెప్పుకోవాలి. సి.నారాయణరెడ్డిగారు రాసిన ‘వందేమాతరం... వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నదీ.. తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది’ అనే పాటను అంతకు ముందు ప్రజానాట్యమండలి కార్యక్రమాల కోసం శ్రీనివాస్‌ పాడేవారు. ఈ చిత్రంలో ఆ పాట పాడి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ అయ్యారు. సరే... అలా ఆ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని నేను హైదరాబాద్‌కు వచ్చేశా.

‘ప్రతిఘటన’లో నా అసలుపాత్ర రెండు నిమిషాలే!

‘వందేమాతరం’ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే టి.కృష్ణగారు ‘ప్రతిఘటన’ సినిమా మొదలుపెట్టారు. ఆ విషయం నాక్కూడా తెలిసింది. ఓ రోజు మధ్యాహ్నం నేను బ్యాంకులో ఉండగా ఫోన్ వచ్చింది. ఆయన పేరు చారి అనో, స్వామి అనో చెప్పారు. సరిగా గుర్తులేదు. ‘ఇలాగ... ఉషాకిరణ్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నాను.. టి.కృష్ణగారు మీకోసం ఫోన్ చేశారు. మిమ్మల్ని అర్జంటుగా వైజాగ్‌ పంపమన్నారు. అక్కడ ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. మీరు రావాలి’ అని చెప్పారు. ‘సరే బయలుదేరుతానులెండి’ అని చెప్పా. బ్యాంక్‌ మేనేజర్‌ దగ్గరికివెళ్ళి విషయంచెప్పి సెలవు తీసుకుని బయలుదేరా. అది గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వేసిన కొత్త. ఆ రైలుకు అప్పట్లో మంచి క్రేజ్‌. దాన్లో ఎక్కి వెళ్ళా. సినిమా యూనిట్‌ అంతా వైజాగ్‌లో ‘ఓషన్ వ్యూ’ హోటల్‌లో ఉండేది. నేను రైలు దిగాను. నాకు కారు పంపిస్తే ఆ హోటల్‌కి వెళ్ళి టి.కృష్ణగారిని కలిశా. నన్ను చూడగానే ‘వందేమాతరం’ లో మీ పోర్షన్‌ చాలా బావుందండీ, చాలా బాగా చేశారు, తప్పకుండా మంచిపేరు వస్తుంది. ‘నేనిప్పుడే చెబుతున్నా.. ఈ సినిమాకు మీరేం ఎక్స్‌పెక్ట్‌ చేయకండీ. స్ర్కీన్‌ మీద ఓన్లీ టూ మినిట్స్‌ కనిపిస్తారు. అదీ క్లైమాక్స్‌ సీన్‌లో’ అన్నారు. అయితే, ఆ తర్వాత విడుదలైన ‘ప్రతిఘటన’లో టి.కృష్ణగారు నాకు మొదట చెప్పిన సీను లేదు. ‘నేను రౌడీకి సీటు ఇస్తున్నాను. ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. తప్పకుండా మీరు ఓటేయండి’ అని మూడు మాటలు చెప్పాలండీ. అదే వేషం. వేస్తారు కదా? అని మొదట నాతో అన్నారు టి.కృష్ణగారు. ‘వేస్తానండీ. వచ్చాను కదా. తప్పకుండా వేస్తాను’ అని చెప్పి హోటల్‌కి వెళ్ళా. ఆ రాత్రి ఆయన నా దగ్గరకు వచ్చి ‘రేపు మీ సీన్లు తీయట్లేదండీ. కొంచెం ఇబ్బంది వచ్చింది. ఒక్కరోజు మీరు ఆగాల్సి ఉంటుంది, ఫర్వాలేదు కదా’ అని అడిగారు. ‘దానిదేముందండీ. ఫర్వాలేదు’ అని చెప్పా.


భలే చెప్పావురా అని మెచ్చుకున్న పి.ఎల్‌

ఆ రాత్రి పన్నెండింటికి నా రూమ్‌కి పి.ఎల్‌.నారాయణ వచ్చాడు. అప్పుడర్థమైంది నాకు నన్ను పి.ఎల్‌. రూమ్‌లోనే పెట్టారని. పి.ఎల్‌తో అంతకు ముందే నాకు పరిచయం. అదీ ఇదీ పిచ్చాపాటీగా మాట్లాడుకున్నాం. ‘ఏంట్రా... నువ్వు ఇంత సాఫ్ట్‌గా మాట్లాడితే ఎట్టా? నువ్వుంటే హుషారుంటుంది. చుట్టూ సందడి ఉంటుంది. రూమ్‌ ఇంత బోసిపోవడం నాకిష్టం లేదు. ఏదీ.. తెలంగాణ యాసలో రామాయణం చెప్తావ్‌గా... ఇప్పుడోసారి చెప్పు.’ అన్నాడు. అడగంగా అడగంగా ఒప్పుకుని మొదలుపెట్టా. బాగా ఊపందుకుని చెప్తుంటే, మధ్యలో అందుకుని ‘సోదర సోదరీమణులారా అందరికీ నమస్కారం అంటాం కదా. అదే మాటని తెలంగాణ యాసలో చెబితే ఎలా ఉంటుంది? ఒకసారి అనవా? అని అడిగాడు. ఎందుకొచ్చిందోనండీ అతనికి ఆ ఆలోచన! మనకి అర్థం కాదు. భగవంతుడి దయే అనుకుంటా. ‘మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ నాయనలకి అందరికీ పెడతాండా దండం’ అన్నా. ఆ ఒక్క వాక్కు విని ‘భలే చెప్పావురా’ అని మెచ్చుకున్నాడు. నాటకాల్లో అప్పటికే మంచి పేరున్నవాణ్ణి. సినిమాలకు కొత్త. నాకు 37, 38 ఏళ్ళు ఉండేవి. మంచి ఊపుమీద ఉండేవాణ్ణి. ఎక్కడా బెరుకులేదు. పి.యల్‌. ఇంకోసారి చెప్పమని అడగ్గానే చెప్పేశా.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Advertisement

FilmSerialమరిన్ని...

Advertisement