అమెరికా ‘కోట’పై మన ‘రవి’ కిరణం

ABN , First Publish Date - 2020-06-05T10:00:59+05:30 IST

సిక్కోలు వాసికి అమెరికాలో అరుదైన గుర్తింపు..

అమెరికా ‘కోట’పై మన ‘రవి’ కిరణం

సిక్కోలు వాసికి అరుదైన గుర్తింపు

అగ్రరాజ్యం భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా కోట రవి నియామకం

జిల్లావాసుల్లో హర్షం


టెక్కలి(శ్రీకాకుళం): సిక్కోలు వాసికి అమెరికాలో అరుదైన గుర్తింపు దక్కింది. అగ్రరాజ్యంలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా జిల్లాకు చెందిన కోట రవిని కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ నియమించింది. 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రవి స్వస్థలం.. సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం కోటపాడు గ్రామంలో సాగింది. దండుగోపాలపురం హైస్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివారు. టెక్కలిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ చదివారు.  బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్సీ పూర్తి చేశారు. అక్కడే అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదివారు. 1993లో ఐఏఎస్‌కు ఎంపికై మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి గౌరవ ప్రతిష్ఠలు తీసుకువచ్చారు.


అసోంలోని శివసాగర్‌, బోలోగాడ్‌, జోర్హాట్‌ జిల్లాలకు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. అస్సాం ప్రభుత్వంలో ఫైనాన్స్‌ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అసోంలో అర్బన్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో మునిసిపల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2007-08 కాలంలో ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చేరి, అండమాన్‌ ప్రాంతాలకు భారత ఆహార సంస్థ సీనియర్‌ రెసిడెన్షియల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి ఓఎస్‌డీగా, హోం ఎఫైర్స్‌, మానవ వనరుల శాఖ కార్యదర్శిగా, ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. తాజాగా, అగ్రరాజ్యం భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా నియమితులయ్యారు. తెలుగు వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కిందంటూ జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత బాధ్యతతో..

అమెరికాలో భారత్‌ ప్రత్యేక దౌత్యాధికారిగా నియమించడం సంతోషంగా ఉంది. వాషింగ్‌టన్‌ డీసీలో భారత దౌత్య కార్యాలయంలో ఎకనమిక్‌ విభాగానికి నాయకత్వం వహిస్తాను. భారత ప్రభుత్వం ఇచ్చిన చాలా అరుదైన అవకాశం ఇది.  బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం భారత దేశ ఆర్థిక పరిస్థితి, కొవిడ్‌-19 వల్ల భారత్‌- అమెరికా ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు, రాబోయే మూడేళ్లు నాకు పెద్ద బాధ్యతే. అమెరికా ప్రభుత్వంతో భారత ఆర్థిక మంత్రిత్వశాఖకు సమన్వయం చేయడం, ఇరు దేశాల ద్వౌపాక్షిక, ఆర్థిక ఒప్పందాలు చేయడం, భారత్‌కు పెట్టుబడులు తీసుకురావల్సిన బాధ్యత నాపై ఉంది.  ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌తో భారత్‌ తరఫున సమన్వయం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పరిజ్ఞానం.. బాధ్యత నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయి. 

- కోట రవి, భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్త

Updated Date - 2020-06-05T10:00:59+05:30 IST