తెరపైకి కోస్గి రెవెన్యూ డివిజన్‌

ABN , First Publish Date - 2021-07-20T04:50:02+05:30 IST

రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న సందర్భంలో నారాయణపేట జిల్లాలో కోస్గి రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

తెరపైకి కోస్గి రెవెన్యూ డివిజన్‌
కోస్గి పట్టణం

 మహబూబ్‌నగర్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న సందర్భంలో నారాయణపేట జిల్లాలో కోస్గి రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కొడంగల్‌ నియోజకవర్గంలో అంతర్భాగమై, నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న కోస్గి, మద్దూరు మండలాలతో పాటు, వికారాబాద్‌ జిల్లాలో కొనసాగే మండలాల్లోని గ్రామాలతో కలిపి నూతనంగా ఏర్పాటు చేసే గుండుమాల్‌, కొత్తపల్లి, దుద్యాల మండలాలతో కోస్గి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు రెవెన్యూశాఖ ప్రతిపాదనలు చేస్తోంది. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం సూచనలతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అప్పటికే రెండుసార్లు కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌ని ఓడించేందుకు ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పలు హామీలు, వాగ్దానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రేవంత్‌కు కీలక పదవి వచ్చింది. నియోజకవర్గంలో రెండు మండలాలు నారాయణపేట జిల్లాలో, మూడు మండలాలు వికారాబాద్‌ జిల్లాలో ఉండడంతో పాలనాపరంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. దాంతో ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో కోస్గి డివిజన్‌ ఏర్పాటు తెరమీదకు తెచ్చింది. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసి రూపొందించిన డివిజన్‌, కొత్త మండలాల ప్రతిపాదనను నేడో, రేపో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్‌ వెలువడనుంది.


 5 మండలాలు, 66 గ్రామాలతో కోస్గి డివిజన్‌

 నారాయణపేట జిల్లాలో ప్రతిపాదిస్తున్న కోస్గి రెవెన్యూ డివిజన్‌ను అయిదు మండలాలు, 66 రెవెన్యూ గ్రామాలతో ప్రతిపాదిస్తున్నారు. మద్దూరు, కోస్గితో పాటు కొత్తగా ఏర్పాటు చేయదలపెట్టిన గుండుమాల్‌, కొత్తపల్లి, దుద్యాల్‌ మండలాలను ఈ డివిజన్‌ కిందకు ప్రతిపాదిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన గుండుమాల్‌ మండలానికి కోస్గి నుంచి 8 గ్రామాలు, మద్దూరు మండలం నుంచి రెండు గ్రామాలకు కలిపి పది గ్రామాలతో ప్రతిపాదన రూపొందించారు. మద్దూరు మండలంలోని 11 గ్రామాలతో కొత్తపల్లి మండలాన్ని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో ఉన్న బొంరా్‌సపేట మండలం నుంచి 8 గ్రామాలు, కోస్గి మండలం నుంచి 2 గ్రామాలు, దౌల్తాబాద్‌ మండలం నుంచి ఒక గ్రామం, కొడంగల్‌ నుంచి మరో గ్రామం కలిపి 12 గ్రామాలతో దుద్యాల్‌ మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 


కొత్త మండలాల ప్రతిపాదన ఇవీ..

గుండుమాల్‌ మండలం: 1.గుండుమాల్‌, 2.సారంగరావుపల్లి, 3.బోగారం, 4.భక్తిమళ్ల, 5.భలభద్రాయపల్లి, 6.అప్పాయపల్లి, 7.అమ్లికుంట, 8.ముదిరెడ్డిపల్లి, 9.కొమ్మూరు, 10. వీరారం.

కొత్తపల్లి మండలం: 1.కొత్తపల్లి, 2.నిడ్జింత, 3.భూనీడు 4.దుప్పట్‌గట్‌ 5.గోకుల్‌నగర్‌, 6.తిమ్మారెడ్డిపల్లి, 7.పెద్దాపూర్‌, 8.మన్నాపూర్‌, 9.లింగాల్‌చేడ్‌, 10.నందిగామ, 11.అల్లీపూర్‌.

దుద్యాల మండలం: 1.దుద్యాల్‌, 2.లగుచెర్ల, 3.ఈర్లపల్లె 4.గౌరారం, 5.చిల్మల్‌మైల్వార్‌, 6.మాచన్‌పల్లి, 7.నజర్‌ఖాన్‌పల్లి, 8.అంసాన్‌పల్లి, 9.హకీంపేట, 10. పోలేపల్లి, 11.కుదిరమళ్ల, 12.హస్నాబాద్‌.

Updated Date - 2021-07-20T04:50:02+05:30 IST