బ్రాను తగలెయ్యాలి!

ABN , First Publish Date - 2020-03-02T07:06:40+05:30 IST

‘‘మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మేమే! ఇతరుల జోక్యం, తీర్పులూ మాకు అవసరం లేదు’’ అంటూ మహిళలు వినిపిస్తున్న ధిక్కార స్వరం దక్షిణ కొరియాలో తాజాగా ప్రకంపనలు రేపుతోంది. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఇంటా, బయటా ఏళ్ళుగా సాగుతున్న అణచివేతపై...

బ్రాను తగలెయ్యాలి!

  • ఇల్లు దాటి బయటకు వస్తే...
  • తరగతి గదులూ, ఆఫీస్‌ రూమ్‌లూ, మాల్స్‌, పబ్లిక్‌ టాయిలెట్స్‌... 
  • ఇలా ప్రతి చోటా మహిళల్ని అశ్లీలంగా చూడాలనీ, చూపించాలనీ కాచుకున్న దొంగ కళ్ళే! సెలబ్రిటీలైనా, సామాన్యులైనా...
  • కట్టూ, బొట్టూ, జుట్టూ, మేకప్‌... ప్రతీ దానికీ సమాజం వెక్కిరింతకో, వ్యాఖ్యానాలకో గురి కావలసిందే! ఇవన్నీ వేటి మీద ఆధారపడాలి? 
  • మన సొంత నిర్ణయాల మీదా? లేదా
  • మన జీవితాలతో ఎలాంటి ప్రమేయం లేని అనామకుల మీదా?
  • కొత్తతరం మహిళలు సంధిస్తున్న ప్రశ్న ఇది.

‘‘మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మేమే! ఇతరుల జోక్యం, తీర్పులూ మాకు అవసరం లేదు’’ అంటూ మహిళలు వినిపిస్తున్న ధిక్కార స్వరం దక్షిణ కొరియాలో తాజాగా ప్రకంపనలు రేపుతోంది. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఇంటా, బయటా ఏళ్ళుగా సాగుతున్న అణచివేతపై స్త్రీవాదులు తిరగబడుతున్నారు. సాంకేతికత అధునాతనం అవుతున్న కొద్దీ సంకుచితమవుతున్న భావజాలాల మీదా, సోషల్‌ మీడియా చాటున దాక్కొని వ్యాఖ్యానాలు రువ్వే దానయ్యల మీదా యుద్ధం ప్రకటించారు.


‘నో బ్రా’ హ్యాష్‌ట్యాగ్‌తో సాగుతున్న వారి ఉద్యమం ఇప్పుడు ఓ సంచలనం. మన దేశంలో నటి రాధికా మదన్‌ సైతం ఈ విషయంలో గళం విప్పారు. గార్మెంట్స్‌ విషయంలో మహిళలను ఇబ్బందికి గురి చేయడాన్ని ఆమె తప్పుపడుతున్నారు. ‘‘స్కూల్‌ డేస్‌లో ఒక విద్యార్థి నా బ్రా స్ట్రిప్‌ కనిపిస్తోందని అన్నాడు. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. బ్రా స్ట్రిప్‌ కనిపించడం ఏమైనా పాపమా అని ఆ సమయంలో అనిపించింది. టీనేజ్‌ అమ్మాయిలకు నేనొక్కటే చెబుతున్నా. బ్రా స్ట్రిప్‌ కనిపించడాన్ని షేమ్‌గా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అది మనం వేసుకునే దుస్తుల్లో భాగమే’’ అని అంటున్నారు రాధిక.


ఇది మా హక్కు!

ఇటీవల దక్షిణ కొరియాలో అతి పెద్ద ప్రసార సంస్థల్లో ఒకటైన ఎంబిసిలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తున్న ఇమ్‌ హ్యూన్‌-జూ (35) ఒక టీవీ కార్యక్రమంలో బ్రా ధరించకుండా పాల్గొన్నారు. దాంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి వెరవకుండా ఆమె తన అనుభవాన్ని ‘నో బ్రా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆమెకు అనూహ్య రీతిలో మద్దతు లభిస్తోంది. ‘‘ఏ దుస్తులు వేసుకోవాలో, ఎలా వేసుకోవాలో మా ఇష్టం. అది మా స్వేచ్ఛ. దాని కోసం మేము పోరాడుతాం’’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఒక ప్రదర్శనలో ముగ్గురు పురుషులు బ్రా ధరించగా, ఇమ్‌, మరో ఇద్దరు మహిళలు బ్రా లేకుండా పాల్గొన్నారు.  ‘‘బయటకు వచ్చినప్పుడు బ్రా ధరించకపోవడం మా హక్కు అని 2020లో కూడా గట్టిగా అరిచి చెప్పుకోవాల్సి రావడం దౌర్భాగ్యం’’ అంటారు సియోల్‌లో స్థానిక స్త్రీవాద ఉద్యమ సహ వ్యవస్థాపకురాలు, రంగస్థల నిర్దేశకురాలు జియాన్‌ వ్యూ.


మహిళలను దొంగచాటుగా గమనించడం, వారు టాయిలెట్లకు వెళ్ళినప్పుడూ, శృంగారంలో ఉన్నప్పుడూ రహస్య కెమేరాలతో చిత్రీకరించడం లాంటి దురాగతాలు అన్ని దేశాలలోలాగే దక్షిణ కొరియాలోనూ పెచ్చుమీరిపోతూ వచ్చాయి. వాటిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ 2018లో వేలాది మహిళలు దేశ రాజధాని సియోల్‌ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. ఆ తరువాత మహిళల హక్కులు పోతున్నాయని ఆరోపిస్తూ స్త్రీవాదులైన కొందరు కొరియన్‌ యువతులు ఫేస్‌బుక్‌లో టాప్‌లెస్‌ ఫొటోలు పెట్టారు. వాటిని ఫేస్‌బుక్‌ తొలగించింది. ఈ చర్యపై వారు నిరసన తెలుపడంతో వాటిని ఫేస్‌బుక్‌ తిరిగి పునరుద్ధరించింది.


దక్షిణ కొరియన్‌ సమాజంలో అందానికి ప్రాధాన్యం ఎక్కువ. ప్రపంచంలో కెల్లా ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకునే  వారి శాతం ఎక్కువగా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అందుకే మార్పు కోసం వాళ్ళు వినూత్న నిరసన మొదలుపెట్టారు. మేకప్‌ మానేస్తున్నారు. జుట్టును పొట్టిగా కత్తిరించుకుంటున్నారు. వివాహాలు చేసుకోబోమని ప్రకటిస్తున్నారు... ఇలా వివిధ రూపాల్లో సమాజం తీరుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న యువతుల సంఖ్య  ఇప్పుడు అక్కడ పెరుగుతోంది.  వారిపై జరుగుతున్న ఎదురుదాడి కూడా తక్కువేం కాదు. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు బ్రా ధరించనని చెప్పిన ప్రసిద్ధ కొరియన్‌ -పాప్‌ స్టార్లలో ఒకరైన శుల్లీ (చోయి జిన్‌-రి) తీవ్ర స్థాయిలో సైబర్‌ వేధింపులకు గురయ్యారు. అది తట్టుకోలేక, మానసిక వేదనకు గురై, కిందటి ఏడాది అక్టోబర్‌లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.


ఈ రకమైన వేధింపులను స్త్రీవాదులు నిత్యం ఎదుర్కొంటున్నారు. ధైర్యంగా వాటిని అంతే స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఉద్యమం పైకి కనిపిస్తున్నట్టు దుస్తులకు సంబంధించినది కాదు... ఇది అస్తిత్వ సమస్య. మహిళల ఆత్మగౌరవ సమస్య. అందుకే నానాటికీ ఈ పోరాటం బలపడుతోంది. ‘‘మీ వివక్షలను సహించం. మీ విశ్లేషణలూ, ఆంక్షలూ, ఉచిత సలహాలూ ఆపండి’’ అని గర్జిస్తోంది. ‘‘మాకు మేమే నిర్ణేతలం! నిర్దేశకులం!’’ అని చాటి చెబుతోంది.


దక్షిణ కొరియా న్యూస్‌ రీడర్‌ ఇమ్‌ హ్యూన్‌-జూ  ఇటీవల బ్రా ధరించకుండా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘గతంలో చాలా సహజంగా భావించిన పలు అంశాలు మహిళల హక్కులను అణచివేసేవే! వాటి నుంచీ బయటపడడానికే ఈ ప్రయత్నమంతా!’’ 

Updated Date - 2020-03-02T07:06:40+05:30 IST