కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో కొరియా సంస్థ

ABN , First Publish Date - 2021-07-25T07:43:16+05:30 IST

కొరియా వస్త్ర పరిశ్రమ దిగ్గజం యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. 13...

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో కొరియా సంస్థ

  • సెప్టెంబరులో ‘యంగ్‌వన్‌ కార్పొరేషన్‌’ శంకుస్థాపన
  • రిజిస్ట్రేషన్‌ నిబంధనలను సడలించిన రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కొరియా వస్త్ర పరిశ్రమ దిగ్గజం యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. 13 దేశాల్లో పరిశ్రమలను నెలకొల్పింది. చైనా, బంగ్లాదేశ్‌, వియ త్నాం, ఎల్‌-సాల్వడోలో సొంతంగా స్థలాన్ని కొనుగోలుచేసి యాజమాన్యం, నిర్వహణ పద్ధతిలో పరిశ్రమలను స్థాపించింది. ఇదే తరహాలో భారత్‌లోనూ కార్యకలాపాలు నిర్వహించనుంది. తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైట్‌ పార్కులో 2019 డిసెంబరులో ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 290 ఎకరాలను కేటాయించింది. ఇందులో రెండు దశల్లో ఐదు యూనిట్లను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. మొదటిదశలో రెండు యూనిట్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతోంది. సెప్టెంబరులో పనులు ప్రారంభించి.. గరిష్ఠంగా రెండేళ్లలోపు పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 290 ఎకరాల స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం టీఎ్‌సఐఐసీ కేటాయించిన భూముల్లో గరిష్ఠంగా రెండేళ్లలోపు నిర్మాణ పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. కొవిడ్‌ కల్లోలం, లాక్‌డౌన్ల నేపథ్యంలో జాప్యం జరిగిందని ఆ సంస్థ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకుని, నిర్మాణ పనులను ప్రారంభిస్తామంటూ ఇటీవల సర్కారును సంప్రదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Updated Date - 2021-07-25T07:43:16+05:30 IST