కరోనాపై ఆందోళన చెందవద్దు... రాష్ట్రంలో కోలుకుంటున్న వారి శాతం అధికం

ABN , First Publish Date - 2020-08-11T20:26:35+05:30 IST

కరోనాపై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి

కరోనాపై ఆందోళన చెందవద్దు... రాష్ట్రంలో కోలుకుంటున్న వారి శాతం అధికం

మరణాలు ఒక శాతమే.. రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): కరోనాపై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి శాతం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉందని, మృతుల సంఖ్య ఒక శాతం మాత్రమే ఉందని, ప్రజ లు అందోళన చెందవద్దన్నారు. జిల్లాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య, కోలుకుంటున్న వారి గురించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తదితరుల సూచనలను స్వీకరించాలన్నారు.


హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య స్థితిగతుల గురించి ప్రతీరోజు తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం ఉన్న వారందరికీ యాంటిజెన్‌ ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేయాలన్నారు. కిట్ల కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. జిల్లాలో మరికొన్ని పరీక్షా కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను పంపించాలన్నారు. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు వీలుగా అవసరాన్ని బట్టి డాక్టర్లు, టెక్పీషియన్లు, ఇతర సిబ్బంది నియామకాలను ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించేందు కు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. జిల్లాలో కరోనా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చే ప్రైవేట్‌ ఆసుపత్రుల దరఖాస్తులు వస్తే ప్రభుత్వానికి వెంటనే పంపించాలన్నారు. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో గల అన్ని పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. కరోనాకు సంబంధించిన చికిత్స ప్రోటోకాల్‌పై నిబంధనలను రూపొందించాలన్నారు. జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  టాబ్లెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రికి డాక్టర్లు వివరించారు.


ప్రజలను అప్రమత్తం చేయాలి..

పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌ నేత మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్‌ తానిపర్తి భానుప్రసాదరావు మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగు చికిత్సను అందిస్తున్నామని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ భారతీ హోళీకేరి, జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాల అభివృద్ధికి నెలనెలా నిధులు

సుల్తానాబాద్‌: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా నిధులను మంజూరు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సుల్తానాబాద్‌లో నూతన మండల పరిషత్‌ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ రాబోయే ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారతాయని, రైతులు ఆర్థికంగా ఎదిగే రోజులు రానున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నెలనెలా 399 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని, స్థానిక ప్రజాప్రతినిఽధులు చిత్తశుద్ధి కనబరిస్తే గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకా లను విజయవంతంగా అమలు చేయాలన్నారు. ఎంపీ వెంకటేశ్‌ , జడ్పీ చైర్మన్‌ పుట్ట మఽధుకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు తదితరులు  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు వివరించారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భారతి హోళీకేరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ స్వరూపరాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునిత, వైస్‌ చైర్‌పర్సన్‌ సమత, వైస్‌ ఎంపీపీ స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీడీఓ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T20:26:35+05:30 IST