న్యూఢిల్లీ: భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo) సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ (Aprameya Radhakrishna)కు అరుదైన గుర్తింపు లభించింది. లాభాపేక్ష లేని అంతర్జాతీయ జర్నలిజం సంస్థ రెస్ట్ ఆఫ్ వరల్డ్ (RoW) విడుదల చేసిన అత్యంత ప్రతిభావంతులైన టాప్-100 టెక్ లీడర్ల జాబితాలో రాధాకృష్ణకు చోటు లభించింది.
స్థానిక భాషల్లో స్వీయ వ్యక్తికరణే లక్ష్యంగా ప్రారంభమైన ‘కూ’ మిలియన్ల మంది జీవితాను ప్రభావితం చేసింది. కూ సహ వ్యవస్థాపకుడైన రాధాకృష్ణ.. సవాళ్లను అధిగమిస్తూ, తమకు బాగా తెలిసిన కమ్యూనిటీల కోసం ప్రొడక్ట్స్‌ను నిర్మిస్తున్న ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ నుంచి గుర్తింపు లభించింది.
దేశంలోని ఇంటర్నెట్ యూజర్లలో 10 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక భాషల్లోనూ తమ భావాలను వ్యక్తీకరించేందుకు, కమ్యూనిటీలను గుర్తించి మాట్లాడుకునేందుకు ‘కూ’ను తీసుకొచ్చారు. ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’లోని 100 గ్లోబల్ టెక్ చేంజ్ మేకర్స్ (Global Techs Changemakers) లో 'కల్చర్ అండ్ సోషల్ మీడియా' విభాగంలో కనిపించిన భారతదేశానికి చెందిన ఏకైక వ్యవస్థాపకుడు రాధాకృష్ణ కావడం గమనార్హం.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. రెస్ట్ ఆఫ్ వరల్డ్: గ్లోబల్ టెక్ చేంజ్ మేకర్స్‌లో గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. రెస్ట్ ఆఫ్ వరల్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ గుర్తింపు పొందడం నిజంగా తమకు ఎంతో గౌరవమని అన్నారు. స్థానిక భాషల్లో స్వీయ వ్యక్తికరణ అవసరం ఒక్క భారతదేశానికి మాత్రమే కాదని, ప్రపంచానికి కూడా సవాలేనని అన్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ‘కూ’ అని వివరించారు. భాషా సంస్కృతులతో ప్రజలను అనుసంధానించేందుకు భారత్‌లో తయారవుతున్న తమ ఉత్పత్తులను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే విషయమై దృష్టి సారించినట్టు రాధాకృష్ణ తెలిపారు.
ఇవి కూడా చదవండి