సార్‌.! బెయిల్‌పై వస్తే చంపేస్తారట..

ABN , First Publish Date - 2020-06-02T18:17:17+05:30 IST

‘సార్‌..! దాడిచేసి, మాపైనే కేసులు పెట్టారు. బెయిల్‌పై వస్తే..

సార్‌.! బెయిల్‌పై వస్తే చంపేస్తారట..

జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ముందు బాధితుల ఆవేదన

న్యాయం చేస్తామంటూ భరోసా..

తహసీల్దార్‌పై విచారణకు కమిటీ


యాడికి(అనంతపురం): ‘సార్‌..!  దాడిచేసి, మాపైనే కేసులు పెట్టారు. బెయిల్‌పై వస్తే చంపేస్తామంటున్నారు. మీరే మమ్మల్ని కాపాడాలం’టూ సోమవారం కోనుప్పలపాడు గ్రామానికి వచ్చిన జిల్లాకలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యఏసుబాబును బాధిత మహిళ, ఆమె భర్త వేడుకున్నారు. మే 15న యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో దళిత మహిళపై వైసీపీ నాయకుడి కుమారుడు శంకర్‌రెడ్డి అత్యాచారానికి యత్నించగా, ఆమె భర్త అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ సంఘటనలో దళిత మహిళ ఫిర్యాదు మేరకే అప్పట్లో పోలీసులు శంకర్‌రెడ్డితోపాటు మరికొంతమందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బాధిత మహిళ భర్త, బంధువులపై కేసు నమోదు చేశారు. ఇరువర్గాల్లో కొద్దిమందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


బాధిత మహిళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారుగా ధ్రువీకరిస్తూ తహసీల్దార్‌ భాస్కర్‌బాబు ఇచ్చిన పత్రం పోలీసులకు ఇచ్చారు. శంకర్‌రెడ్డి వర్గంపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును నీరుగార్చడానికి రాజకీయ ఒత్తిళ్లతో బాధిత మహిళ వర్గీయులు బీసీ-సీ కులధ్రువీకరణ పత్రం ఇచ్చి కేసు నీరు గార్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బాధిత మహిళ, బంధువులు ఎస్సీ సంఘాల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు జరిగిన అన్యాయంపై విన్నవించారు. ఆదివారం ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు కోనుప్పలపాడుకు వచ్చి బాధితుల నుంచి వివరాలను ఆరాతీశారు.


సోమవారం కలెక్టర్‌, ఎస్పీలు గ్రామానికి చేరుకొని బాధితులను సంఘటనపై ఆరాతీశారు. బాధిత మహిళ, ఆమె భర్త మాట్లాడుతూ సార్‌ మేము పెట్టిన కేసులు నీరు గార్చేందుకు ఎస్సీలమైన తమను బీసీ-సీగా సృష్టించి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. మీరే మమ్మల్ని కాపాడి, మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీలు మాట్లాడుతూ బాధితులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మీకు రక్షణ కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి ఆర్థికసాయంగా రూ.2లక్షలు అందజేస్తామని తెలిపారు. 


కులధ్రువీకరణ పత్రాల జారీపై విచారణ కమిటీ: కలెక్టర్‌

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి బీసీ-సీ అని కులధ్రువీకరణపత్రం ఇవ్వడంపై ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని రెండురోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను కలెక్టర్‌ ఆదేశించారు. నివేదిక ఆధారంగా తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి సహాయం అందజేస్తామన్నారు.


బెదిరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

కోనుప్పలపాడు సంఘటనలో బాధితులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులకు న్యాయ సహాయం చేస్తామని, బెదిరింపులు లేకుండా కౌన్సెలింగ్‌ ఇస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-06-02T18:17:17+05:30 IST