కొండాయపాళెంలో భూకబ్జా

ABN , First Publish Date - 2022-01-17T04:30:55+05:30 IST

ప్రభుత్వ భూములకు బినామీ పేర్లతో పట్టాలు సృష్టించారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సైతం పుట్టించారు.

కొండాయపాళెంలో భూకబ్జా
కబ్జాకు గురైన వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి

బినామీ పేర్లతో పట్టాలు

రూ.లక్షలకు విక్రయం

వందలాది ఎకరాల అమ్మకం

పట్టించుకోని అధికారులు


ఉదయగిరి, జనవరి16: ప్రభుత్వ భూములకు బినామీ పేర్లతో పట్టాలు సృష్టించారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సైతం పుట్టించారు. వాటి వివరాలు అడంగల్‌, 1బీలలో నమోదు చేయించారు. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం ప్రభుత్వ అసైన్డ్‌ భూములుగా నేటికీ రికార్డుల్లో చెలామణి అవుతున్నాయి. ఇలాంటి వందలాది ఎకరాల భూములను గుట్టుచప్పుడు కాకుండా లక్షలాది రూపాయలకు విక్రయించి రిజిసే్ట్రషన్‌లు సైతం చేయించారు.


గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు


 ఉదయగిరి మండలం కొండాయపాళెం మజారా కింద వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో వందల ఎకరాల భూములు బినామీల పేరుతో పట్టాలు సృష్టించి, గుట్టుచప్పుడు కాకుండా పలువురికి విక్రయించారు. 961/1, 965/3, 1039/3, 1054/1, 1059 తదితర సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములకు బినామీ పట్టాలు సృష్టించి అమ్మకాలు చేశారు. ఇవేకాక వందల ఎకరాలు ఇదేవిధంగా ప్రభుత్వ భూములకు బినామీ పట్టాలు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. కొనుగోలు చేసిన వ్యక్తులు వీటిని రిజిసే్ట్రషన్‌ చేయించారు. 


నెల్లూరులో రిజిసే్ట్రషన్లు


మండలంలోని కొండాయపాళెం మజారా ప్రభుత్వ భూములకు సంబంధించి నెల్లూరులో రిజిసే్ట్రషన్‌ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికారులకు భారీస్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులే, వ్యాపారులు లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన భూములను చదును చేసి బోర్లు వేశారు. భూముల చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటుకు ప్రయత్నాలు సాగించారు.ఐదేళ్లక్రితం అక్రమార్కులు ఆభూముల్లో పనులు చేపట్టగా అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుస కధనాలు ప్రచురించడవతో మిన్నకుండిపోయారు. మళ్లీ వీరు ఇటీ వల అధికారులకు తెలియకుండా  పనులకు పూనుకున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కొండాయపాళెం మజారా భూములపై సమగ్ర విచారణ జరిపితే  వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు  అంటున్నారు.


చర్యలు తీసుకొంటాం..


కొండాయపాళెం మజారా కింద భూములు  ఆక్రమిస్తే చర్యలు తీసుకొంటాం. ఏయే సర్వే నెంబర్లు, ఎంత విస్తీర్ణం, రిజిసే్ట్రషన్‌ చేయబడిందో తదితర వివరాలు సేకరించేందుకు సంబంధిత వీఆర్వోను అప్రమత్తం చేశాం. వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 


- నాగినేని శ్రీనివాసులు, తహసీల్దారు 

Updated Date - 2022-01-17T04:30:55+05:30 IST