పోలీసులూ ఇదేం పద్ధతి?

ABN , First Publish Date - 2020-10-01T18:21:06+05:30 IST

‘జిల్లాలోని పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో..

పోలీసులూ ఇదేం పద్ధతి?

అధికార పార్టీ ఒత్తిళ్లతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు

స్టేషన్లకు తీసుకెళ్లి వేధింపులు.. సింగరాయకొండ ఎస్సై తీరు దారుణం

ఆయనపై వెంటనే చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన

కొండపి ఎమ్మెల్యే స్వామి 


ఒంగోలు: ‘జిల్లాలోని పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని వేధింపులకు గురిచేస్తున్నారు’ అని టీడీపీకి చెందిన కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఈ విషయంలో సింగరాయకొండ ఎస్సై తీరు మరింత దారుణంగా ఉంది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


బుధవారం ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో  కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఆలయ ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటిని అదుపు చేయాలని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులను ఆదేశించిందన్నారు. ట్రబుల్‌ మాంగర్సును గుర్తించి నిఘా ఉంచి, చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు.


దీన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేశారన్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండతోపాటు, ఇతర కొన్ని పోలీసు స్టేషన్‌లలో కొంత మంది ఎస్సైలు ఉద్దేశపూర్వకంగా టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. శింగరాయకొండ ఎస్సై సంపత్‌కుమార్‌ వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీకి చెందిన 20 మంది యువకులపై గుట్కా అమ్ముతున్నట్లు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో దాసరి వెంకటేశ్వర్లు, పి. పుల్లయ్య చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T18:21:06+05:30 IST