అనకొండలు!

ABN , First Publish Date - 2022-05-23T06:47:10+05:30 IST

దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర.. ఇదీ ప్రస్తుతం నాయకుల తీరు.. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు..

అనకొండలు!
కొండగుంటూరులో అక్రమంగా తవ్వకాలు

రాజమహేంద్రవరం చుట్టుపక్కల కొండలు మాయం

ఖాళీగా కనిపిస్తే ఖాళీ చేసేస్తున్నారు..

కొండగుంటూరులో అక్రమంగా తవ్వకాలు

రూపురేఖలు లేని 80 ఎకరాల కొండ

గ్రావెల్‌ ఎత్తుకుపోతున్న రాజకీయ రాబంధులు

అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే

కొత్త జిల్లాలోనూ మారని అధికారుల తీరు


దొరికితే దొంగ.. దొరక్కపోతే  దొర.. ఇదీ ప్రస్తుతం నాయకుల  తీరు.. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు.. ఎంత సంపాదించామన్నదే ముఖ్యం..   రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే అంతా సాగిపోతోంది. అధికారులు   ఏం చేయలేకపోతున్నారు. అక్రమార్కులు   యథేచ్ఛగా    రెచ్చిపోతున్నారు.  దీనికి  రాజమహేంద్రవరం పరిసర   ప్రాంతాల్లో కానరాని కొండలే ఉదాహరణ. ఒకప్పుడు    రాజమహేంద్రవరం ఊరు దాటితే  చుట్టూ కొండలే.. మరి నేడో  అవన్నీ మాయమైపోయాయి.. ఏమయ్యాయంటే ఏమో. ఇదీ   అధికారుల తీరు.. ఒక పక్కన   కొండలు  ఖాళీ అయిపోతున్నా అధికారులు చూస్తూ ఉండడం   తప్ప ఏం చేయలేకపోతున్నారు.  రాజకీయ అనకొండల ఉచ్చులో    పాములుగా  మారిపోతున్నారు.  ఇక గ్రామాల్లో అయితే                   మట్టి తవ్వకాలకు అడ్డే లేకుండా పోయింది. ఎక్కడి  కనబడితే  అక్కడ  తవ్వేస్తున్నారు.


  (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

మనల్ని ఎవడ్రా అడిగేది.. అంతా మన ఇష్టం.. అది కొండైనా, ఇసుకైనా, మట్టయినా.. అధికారంలో ఎవరుంటే వారిదే. లీజైనా, అక్రమంగా తవ్వాలన్నా వారి అభీష్టమే. అధికారంతో పాటు కాస్త నోరుంటే చాలు.. ఇక ఎవరూ ఏమీ చేయలేరు.. గతంలో ఇసుక, మైన్స్‌ వ్యాపారాల్లోకి ఇష్టమున్నవారు  వచ్చేవారు. లీజు విలువ తక్కువ కావడంతో పాటు కాస్త పెట్టుబడి పెట్టగలిగినవాళ్లు, అధికారులను జాగ్రత్తగా చూసుకోగలిగినవాళ్లు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆశీస్సులు ఉన్నవాళ్లు.. ఇలా ఎవరైనా  చట్టప్రకారం లీజుకు తీసుకుని పనిచేసుకునేవారు.. కొంతకాలంగా ఈ విధానం పూర్తిగా మారింది. లీజూ లేదు.. ఏమీ లేదు.. కన్నుపడిందా ఖాళీ అయిపోవాల్సిందే. రాజకీయనేతల దృష్టి అక్రమ వ్యాపారాలపైకి మళ్లడంతో ఎక్కడ కొండలు ఉన్నా, ఎక్కడ చెరువుల్లో మట్టి ఉన్నా, రాజకీయనేతల అనుచరులకే దక్కాలి. వేరేవారెవరూ రావడానికి వీల్లేదు. 


కొండలన్నీ  ఖాళీ...


రాజానగరం నియోజకవర్గం సంపత్‌నగర్‌ రెవెన్యూ గ్రామం  కొండగుంటూరు పంచాయతీ పరిధిలో  80 ఎకరాల కొండ ఉండేది. ఇది రోడ్డు నిర్మించడానికి ఉపయోగపడే గ్రావెల్‌, ఎర్రమట్టితో ఉంటుంది. గతంలో ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఈ కొండను చాలా వరకూ మింగేశారు. ఇటీవల కొండలో ఉన్న 4.4 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వుకోవడానికి అనుమతివ్వాలని మైన్స్‌ శాఖకు ఒక వ్యక్తి దరఖాస్తు చేశాడు. ఫీజు చలానా కింద రూ. 25,500 కట్టారు. మైన్స్‌  అధికారి తహశీల్దార్‌కు నో అబ్జక్షన్‌ సరిఫికెట్‌ ఇవ్వమని రాశారు. ఆయన పంచాయతీ సెక్రటరీకి రాశారు. ఈ సమాచారం రాజకీయనేతలకు చేరింది. ప్రస్తుతం లీజుకు దరఖాస్తు చేసిన సర్వే నెంబర్‌లోని 4.4 ఎకరాల్లో కొంత భూమి ప్రైవేట్‌ వ్యక్తులదని, ఓ స్వాతంత్య్రసమరయోధుడు నుంచి కొనుగోలు చేశారని, దీంతో లీజుకు ఇవ్వడం కుదరన్నారు.అయితే ప్రస్తుతం అక్కడ యథేచ్ఛగా తవ్వకాలు జరిగిపోతున్నాయి.అయినా పట్టించుకునే వారే లేరు.ఈ నేపథ్యంలో మిగిలిన కొందరు నేతలు కొండను మిం గేస్తున్నారు. వాస్తవానికి ఇది స్వాతంత్య్ర సమరయోధులకు, పేదలకు  పట్టాలుగా ఇచ్చిన కొండ అని చెబుతుంటారు. కానీ పేదలు, స్వాతంత్య్రసమరయోధులు వ్యవసాయం చేసుకోవడానికి వీలులేకపోవడంతో చాలా కాలం కిందట వదిలేశారు. క్రమంగా రాజకీయనేతలు, వారి అనుచరులు లీజులు పేరిట వారికి కొంత డబ్బు ఇచ్చి గ్రావెల్‌, మట్టి అమ్ముకోవడంతో ఈ కొండ  క్రమంగా తరిగిపోయింది. ఇలా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చాలా కొండలు ఉన్నాయి. అయినా మైన్స్‌ అధికారులు కన్నెత్తి చూడరు.. కనీసం పట్టించుకోరు. దీంతో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొత్త జిల్లాలో ఉన్నతాధికారులైనా సమస్యపై స్పందించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.


లీజు పేరిట.. అక్రమ తవ్వకాలు..


ఇవాళ అధికార పక్షనేతలకు అనుచరుడని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఇక్కడ కొండలో కొంతభాగాన్ని లీజుకు తీసుకుని ప్రభుత్వ అవసరాలకు తవ్వుతున్నట్టు చెబుతున్నారు. కానీ లీజుపేరిట ఇక్కడ అక్రమాల జోరు కొనసాగుతోంది. ఇంకా ఏడువేల యూనిట్ల వరకూ ఇక్కడ గ్రావెల్‌ ఉన్నట్టు సమాచారం. ఇక్కడ రెండు రకాల గ్రావెల్‌ ఉంది. రోడ్లకు ఉపయోగపడే గ్రేడ్‌-1రకం అయితే యూనిట్‌ 3,800, మామూలుదైతే యూనిట్‌ రూ.2 వేలు. ఇదంతా అనధికారికంగా అమ్మితే. పర్మిట్లుతో కావాలంటే మరో రూ.1800 అదనం. ఇదంతా అక్కడ అమ్మినందుకే, రవాణా చార్జీలు వేరేగా ఉంటాయి. రవాణా చార్జీలు దూరాన్ని బట్టి పెరుగుతాయి. ఇలా రోజూ వందలాది లారీల గ్రావెల్‌ అమ్మేసుకుంటూ కొండగుంటూరును కొండ’గుంట’లూరుగా మార్చి, కొండలను మాయం చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


ఆలయ భూమి లీజుకిస్తే మట్టి తవ్వేస్తున్నారు..

నోటీసు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి


నిడదవోలు, మే 22 : నాణ్యమైన నల్లమట్టికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఉందంటే చాలు ఎత్తుకుపోతున్నారు. దీంతో మట్టికి కూడా మాఫియా తయారైంది. ఈ నేపఽథ్యంలో దేవాలయ భూముల్లో సైతం అక్రమంగా మట్టి తవ్వకాలు చేసేస్తున్నారు. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామానికి చెందిన సోమేశ్వరస్వామి దేవస్థానం పొలంలో లీజుదారుడు నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వకాలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో  మట్టి తవ్వకాలు నిలిపివేయించి లీజుదారుకు నోటీసు ఇచ్చారు. ఆలయ ఈవో శివ మాట్లాడుతూ లీజుదారైన కాయల నాగముని దేవస్తానానికి చెందిన 5.2 ఎకరాల  భూమిని మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాడని తెలి పారు. కాయల నాగముని మట్టి తవ్వి తరలిస్తున్న విషయం తెలుసుకుని పనులను నిలిపివేయించామన్నారు.  


అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు 4 వాహనాలు సీజ్‌


రంగంపేట, మే 22 : రంగంపేట గ్రామంలోని వెంకటదాసు చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. చెరువులో ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా మట్టి తవ్వుతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. మట్టి తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ మట్టితో ఉన్న రెండు ట్రాక్టర్లను, ఖాళీ ట్రాక్టరును, మట్టిని తవ్వుతున్న జేసీబీని సీజ్‌ చేసినట్టు వీఆర్‌వో కె. దుర్గ తెలిపారు. తాళాలను తహశీల్దార్‌ కార్యాలయంలో అప్పగించినట్టు చెప్పారు.


Updated Date - 2022-05-23T06:47:10+05:30 IST