కొండా సురేఖను బరిలో దింపడానికి కారణాలివే..!

ABN , First Publish Date - 2021-08-20T05:48:28+05:30 IST

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా..

కొండా సురేఖను బరిలో దింపడానికి కారణాలివే..!

కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ

గాంధీభవన్‌లో సుదీర్ఘచర్చ

నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్న టీపీసీసీ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ ముఖ్యులతో గురువారం సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లతో మరో భేటీ జరిగింది. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ అభ్యర్థిపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. శుక్ర, శనివారాల్లో అభ్యర్థి పేరును వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


బీసీ వర్గానికి ప్రాధాన్యం

బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్నందున టీఆర్‌ఎస్‌ కూడా బీసీ వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా బీసీ అభ్యర్థినే బరిలో దింపడం, బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచడం ప్రాతిపదికన చర్చించి కొండా సురేఖను అభ్యర్థిగా బరిలో నిలపాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కొండా సురేఖ పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త మురళి కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజికవర్గాలకు 55 వేల పైచిలుకు ఓట్లు ఉండడం కలిసివచ్చే అంశంగా కాంగ్రెస్‌ నేతలు భావించినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ వర్గానికి చెందినవారు కాగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,220 ఉండగా, యాదవ సామాజికవర్గానికి 22,150 ఓట్లు ఉన్నాయి. కొండా సురేఖను పోటీలో నిలిపితే కాపు, పద్మశాలి రెండు సామాజికవర్గాల నుంచి ఓట్లు పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. 


సరే.. అంటూనే.. 

కొండా సురేఖ అధిష్ఠానం ఆదేశిస్తే హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తూ 2023 ఎన్నికల్లో కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని ప్రతిపాదించారని తెలిసింది. ఒకవేళ ఇప్పుడు జరిగే పోటీలో విజయం సాధించలేకపోయినా బలం పెంచుకోగలిగి వచ్చే ఎన్నికల నాటికి గట్టి పోటీదారుగా మారవచ్చనే ఉద్దేశంతోనే ఆమె వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్ఠానం ముందుంచినట్లు చెబుతున్నారు. ఈ డిమాండ్‌తోపాటు వరంగల్‌ అర్బన్‌, పరకాల, జయశంకర్‌ భూపాలపల్లి టికెట్లను కూడా తాము సూచించినవారికి ఇవ్వాలని కూడా ఆమె ప్రతిపాదించినట్లు సమాచారం. కొండా సురేఖ డిమాండ్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలించి ఆమెకు 2023లో టికెట్‌ ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరంగల్‌ అర్బన్‌, పరకాల అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో పెద్దగా ఇబ్బందేమి లేకున్నా జయశంకర్‌ భూపాలపల్లి టికెట్‌ విషయంలోనే అధిష్ఠానం పెద్దలు సురేఖకు మాట ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఆమె టికెట్‌తోపాటు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆమె సూచించినవారికే ఇచ్చే అవకాశం ఉన్నందున సురేఖ కూడా అధిష్ఠానం మాటను మన్నించవచ్చని భావిస్తున్నారు. 


త్వరలో ప్రచారం ప్రారంభం

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా 20 నుంచి 30 వేల వరకు సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటూ వస్తున్నదని, కొండా సురేఖను బరిలో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని పీసీసీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనరసింహ మాత్రం స్థానిక నేతలకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించడంతో వెంటనే సురేఖ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదని సమాచారం. దామోదర రాజనరసింహను ఒప్పించి శుక్రవారం సాయంత్రానికిగాని, శనివారంనాటికిగాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరు తేలిపోయి ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడకుండా ఇప్పటినుంచే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో ఉండగా త్వరలోనే కాంగ్రెస్‌ కూడా అందుకు శ్రీకారం చుట్టనున్నది. 

Updated Date - 2021-08-20T05:48:28+05:30 IST