కోనసీమ.. కొలిక్కి!

ABN , First Publish Date - 2022-05-26T09:11:58+05:30 IST

అల్లర్లు, దహనాలతో అట్టుడికిన కోనసీమ క్రమేపీ తెప్పరిల్లుతోంది.

కోనసీమ.. కొలిక్కి!

  • అదుపులోకి వచ్చిన అల్లర్లు
  • 200 మంది ఆందోళనకారుల గుర్తింపు
  • పోలీసుల నిర్బంధంలో 50 మంది


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): అల్లర్లు, దహనాలతో అట్టుడికిన కోనసీమ క్రమేపీ తెప్పరిల్లుతోంది. పరిస్థితిని పోలీసులు పూర్తిగా  అదుపులోకి తెచ్చారు. ఐదు జిల్లాల నుంచి రప్పించిన 1,300 మంది సిబ్బందితో కనీవిని ఎరుగని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు,  కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రైల్వే ఎస్పీ విశాల్‌గున్నీ, సీపీ సిద్ధార్థ్‌ కౌశల్‌, పలువురు ఐపీఎస్‌ అధికారులు అమలాపురంలోనే మకాంవేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పట్టణం పూర్తిగా పోలీసుల అదుపులో ఉంది. ఆందోళనకారులతో టచ్‌లో ఉన్న టీడీపీ, జనసేన నాయకులను కాల్‌ డేటా ఆధారంగా గుర్తించే పనిలో  నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు సీసీ ఫుటేజ్‌ల ద్వారా 200 మందికిపైగా నిందితులను గుర్తించారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెబుతున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఐజీ పాలరాజు వెల్లడించారు. మండుటెండలో సైతం పోలీసులు రోడ్లపై మోటారుసైకిళ్లపై తిరిగే యువకులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లను తీసుకుని ప్రశ్నించారు. ముందు జాగ్రత్తగా అమలాపురం పట్టణం, పరిసర మండలాల్లో పోలీసు అధికారుల ఆదేశానుసారం ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఒక్క ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ మాత్రమే కొంతమేర పనిచేసింది. దీంతో ప్రజలు, వ్యాపారులు, నెట్‌ సెంటర్ల యజమానులు, అనేక వర్గాలవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 


ఎమ్మెల్యేల్లో అలజడి..

అమలాపురం ఘటనతో కోనసీమ జిల్లా ఎమ్మెల్యేల్లో ఆందోళన, అలజడి మొదలైంది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్లకు భద్రతను పెంచారు. అల్లవరం మండలం మొగళ్లమూరిలో ఉంటున్న చింతా అనురాధ, నగరంలో ఉంటున్న పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కత్తిమండలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు చెందిన ఇళ్లకు భద్రతను పెంచారు. రావులపాలెం మండలం గోపాలపురంలో ఉంటున్న ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి ఇంటికీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసం వద్ద గట్టి బందోబస్తు పెట్టారు. 


 ఎస్పీ ఎస్కార్ట్‌ వాహనంపై దాడి

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ రావులపాలెంలో జేఏసీ నాయకులు బుధవారం ఆందోళనకు పిలుపివ్వడంతో అక్కడ భారీగా బలగాలను దించారు. రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులను మోహరించారు. రావులపాలెం మండలం కళావెంకట్రావు సెంటరు వద్ద ఎస్పీ ఎస్కార్ట్‌ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. 

Updated Date - 2022-05-26T09:11:58+05:30 IST