కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-31T02:33:02+05:30 IST

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, నరసరావుపేట జిల్లాకు గుర్రం జాషువా, బాపట్ల జిల్లాకు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ల పేర్లు పెట్టాలని టీడీపీ నేత

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి: వర్ల రామయ్య

విజయవాడ: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, నరసరావుపేట జిల్లాకు గుర్రం జాషువా, బాపట్ల జిల్లాకు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ల పేర్లు పెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల పాలన సౌలభ్యం మిషతో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. మీరు చేసిన ఈ విభజన ద్వారా ప్రతి జిల్లాలో ప్రజల మధ్య అశాంతిని లేపారు. ప్రజలు వర్గాలుగా ఏర్పడి జిల్లాల విభజన పట్ల అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కొన్ని కొత్త జిల్లాలకు రాజకీయ లబ్ధి కోసమో, యథార్థంగా ఆ నాయకుల పట్ల గౌరవంతోనో కొందరు మహనీయుల పేర్లు వారి గౌరవార్థం పెట్టారు. దానిని స్వాగతిస్తూనే మీ హ్రస్వదృష్టికి బాధపడుతున్నాను. దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన మీరు, దళిత వర్గాలకు చెందిన మహనీయుల పేర్లు కొన్ని జిల్లాలకు పెట్టి వారిని కూడా గౌరవించాలన్న ఆలోచన మీకు రాకపోవడం బాధాకరం. దళిత వర్గాలను మీ పార్టీ ఓటు బ్యాంకుగానే భావించడం, వారిని చిన్నచూపు చూడటం, ఈ వర్గాలపై దాడులు జరిగినా పెద్దగా స్పందించకపోవడం, ఈ వర్గాల పట్ల మీకున్న అభిప్రాయానికి నిదర్శనం. ఇప్పటికైనా విశాల దృక్పథంతో ఆలోచించి, నేను ప్రతిపాదించినట్లుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, గుర్రం జాషువా, డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ల పేర్లను ఆయా జిల్లాలకు పెట్టాలని రాష్ట్రంలోని దళిత వర్గాల తరపున కోరుతున్నాను. ఈ విషయంలో నిర్లక్ష్యం చూపితే దళిత వర్గాలు అన్యదా భావిస్తాయని తెలియజేస్తున్నాను’’ అని లేఖలో వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-31T02:33:02+05:30 IST