Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 27 Jan 2022 00:37:37 IST

మల్లన్న మావాడు

twitter-iconwatsapp-iconfb-icon
మల్లన్న మావాడు

కొమురవెల్లి మల్లికార్జునుడి కోసం వర్ణపోరు

అంతర్గత వ్యవహారాల సర్దుబాటులో ఆలయవర్గాల నిర్లక్ష్యంతో నెలకొన్న వివాదం

మావాడంటే మావాడని వినతులు, ఆందోళనలు 

దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పాలకమండలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి


చేర్యాల, జనవరి 26 : కులాలకతీతంగా, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న కోరమీసాల కొమురవెల్లి మల్లన్న మావాడంటే మావాడని, మాకంటే మాకు ప్రాధాన్యం కల్పించి ఆలయ సంప్రదాయాన్ని పరిరక్షించాలని పలువర్గాలు ఆందోళనలు కొనసాగిస్తుండటం చర్చనీయాంశ మైంది. ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానుసారం మల్లన్నను కొలుస్తుండగా ప్రస్తుతం కొందరు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని వాపోతుండడం,తమ వర్గానికే పరిమితమని మరికొందరు పేర్కొంటుండటంతో వివాదం నెలకొన్నది. ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలతో ముడిపడిన సున్నితాంశంపై దేవాదాయ శాఖ అధికారులు, పాలకమండలి తీసుకునే నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొమురవెల్లి మల్లికార్జునుడి ప్రాశస్త్యంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 11వశతాబ్దంలో కొమురవెల్లిలోని విజయాచలగుట్టల్లో ఓ ముని తపస్సు చేయగా వెలిసిన శివలింగంపై పెరిగిన పుట్టమన్నుతో మూలవిరాట్టును రూపొందించి స్వామివారి నాభిలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది.  మల్లన్నను పరమశివుడికి ప్రతిరూపంగా కొలుస్తున్నారు. అలాగే గొర్లకాపరికి కలలో కనిపించి కొండసొరికెలలో కొలువైనట్లు తెలిపాడని చెబుతుంటారు. కొమురవెల్లి గ్రామానికి చెందిన నీలమాంబ, ఆదిరెడ్డిల ఆరో సంతానంగా జన్మించి పరమశివుడి పరమభక్తుడిగా శివానుగ్రహంతో శివుడికి ప్రతిరూపంగా మల్లికార్జునస్వామిగా కీర్తింపబడుతున్నారని ప్రచారంలో ఉంది. దశాబ్దాలక్రితం లభ్యమైన హ్యూమాయిన్‌ చిక్కాల ఆధారంగా పరమశివుని అంశతో మల్లన్న వెలిశాడని వీరశైవపెద్దలు చెబుతున్నారు. అయితే మల్లికార్జునస్వామి వీరశైవుల ఆడబిడ్డ మేడలాదేవీ, యాదవుల బిడ్డ కేతలమ్మను వివాహమాడటంతో ఆలయంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. 


ఒగ్గుపూజారులను నియమించుకున్న చౌదరీలు

నిజాం హయాంలో పన్నులు వసూలు చేసేందుకు చౌదరిగా నియమితులైన యాదవ కుటుంబానికి ఈ ఆలయంపై హక్కులు కల్పించారు. వారే ఒగ్గుపూజారులను నియమించుకుని పట్నాలు వేయించేవారు. 1887లో ముద్దం మల్లమ్మచౌదరి పట్నం టికెట్‌ను ప్రవేశపెట్టగా, జాతర నిర్వహణ విషయంలో పటేల్‌లు, పట్వారీలు ఇతరులెవరూ కలగజేసుకోకూడదని 1912వ సంవత్సరం 1323ఫస్‌లీ ఉత్తర్వులు జారీచేశారు. తొలుత చేర్యాల తాలూకా కేంద్రానికి చెందిన ఒగ్గు వారితో పట్నాలు వేయించగా వివాదం తలెత్తడంతో చౌదరీలు పొరుగు జిల్లాల నుంచి పలువురిని తీసుకువచ్చారు. రానురాను భక్తుల రద్దీ అధికం కావడంతో కొన్ని సంవత్సరాలక్రితం స్థానిక యాదవులకు చోటు కల్పించారు. కాగా చౌదరీలకన్నా ముందు నుంచే వీరశైవులు తమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 

1952లో ముద్దం బాలయ్య చౌదరి గవర్నమెంట్‌ ఆఫ్‌ దక్కన్‌ నల్లగొండ వారికి ఆలయాన్ని అప్పగించడంతో పట్నాలు వేయడానికి నిర్ధేశించిన టికెట్‌ ధరలో 1/3వంతు ఆదాయం చౌదరీలకు ప్రతిఫలంగా అందించేవారు. అందులో నుంచి ఒగ్గుపూజారులకు సగం వాటా చెల్లించేవారు. వీరితో పాటు తలనీలాలు తీసినందుకు నాయీబ్రాహ్మణులకు టికెట్‌ ధరలో వాటా చెల్లింపును 1968 నుంచి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒగ్గుపూజారులకు పట్నాలు, బోనాల టికెట్ల రుసుములో 50 శాతం చెల్లిస్తున్నారు. అయితే 1996లో సుప్రీంకోర్టు వంశపారంపర్య హక్కులను రద్దుచేసింది. ఇది అన్నివర్గాలవారికి వర్తిస్తుంది. కానీ చౌదరీ కుటుంబీకుల సంఖ్య క్రమేపీ తగ్గడంతో ముద్దంరాజుచౌదరి, కొమురయ్యచౌదరి, నర్సయ్యచౌదరీలకు కన్సాలిడేటెడ్‌ వేతనంగా అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం చౌదరీలు లేకపోవడంతో ఆ వాటాను ఒగ్గుపూజారులకు అందిస్తున్నారు. 


ఆధిపత్య పోరుతో వివాదం

మల్లన్న ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నప్పుడు ప్రస్తుతంఉన్న ముఖమండప ప్రదేశంలో ఒగ్గు పూజారులు తెల్లవారుజామున మేలుకొలుపు, రాత్రివేళ పవళింపు సేవ చేసేవారు. కాలక్రమేణా మండపాన్ని విస్తరించడం, అర్ధమండపంలో ఉన్న హుండీలు అపహరణకు గురవుతుండడంతో అప్పటి పాలకమండలి సూచనానుసారం మహామండప ద్వారా ఆవరణలో నుంచి సేవ చేస్తున్నారు. కానీ తెల్లవారుజామున ద్వారాలు తెరిచేసరికి ఆలస్యమవుతుండటంతో వారిని గేటుబయటే నిలిపి దేవుడికి దూరం చేస్తున్నారని మనోవేదనకు గురవుతున్నారు. డబ్బు చెల్లించి పట్నాల టికెట్‌ కొనుగోలు చేసినప్పటికీ పలువురు ఒగ్గ్గుపూజారులు భక్తుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆలయాధికారులు రాజగోపుర ఆవరణ గోడలతో పాటు రెండేళ్లుగా పట్నాల టికెట్లపై డబ్బు ఇవ్వరాదు అని ముద్రించారు. వీరశైవార్చకులు, ఒగ్గుపూజారులకు మధ్య పలు విషయాల్లో మనస్పర్థలు రేకె త్తాయి. ఏటా స్వామివారి కల్యాణం, పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలు, మహాశివరాత్రి పెద్దపట్నాన్ని గంగిరేగుచెట్టు ప్రాంగణంలో జరిగేది. కానీ 2014లో తోటబావి ప్రాంగణానికి మార్చబడింది. గతంలో పెద్దపట్నం, అగ్నిగుండాల సమయంలో చౌదరీలు సేవ నిర్వహించేవారు. వారి అనంతరం వీరశైవులు వచ్చారు. ఇవేకాక ఇతర విషయాలలో తమకు, తమ సేవలకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఒగ్గుపూజారులు పేర్కొంటున్నారు. ఆయా అంశాలు ఆలయాధికారులు, పాలకమండలితో చర్చిస్తే సమసిపోయే సమస్యలే. అయినప్పటికీ సున్నితమైన ఆయా అంతర్గత విషయాలను ఇతరులు ప్రస్తావించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఆలయంలో పట్నాలు రచించేది యాదవులే అయినప్పటికీ కురుమసంఘం నేతలు అంశాలను ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టడం, తమని దేవుడి నుంచి దూరం చేస్తున్నారని, బండారి సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారని ప్రచారం చేయడం కలకలం రేపింది.


తెరమీదకు రెడ్డి, చౌదరీ కుటుంబీకులు

ఆయా ఆందోళనల నేపథ్యంలో రెడ్డి కులస్థులు తెరమీదకు వచ్చారు. మల్లన్న రెడ్డి కులస్థుడైనందున తమకు ప్రాధాన్యం కల్పించాలని, కల్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందింపచేయాలని కోరుతున్నారు. అలాగే ఆలయాభివృద్ధిలో తమ పూర్వీకులు పాటుపడినందున చౌదరీ కుటుంబీకులు స్థానాచార్యులు, సర్వీ్‌సదార్‌ సేవలను కొనసాగింపచేయాలని వేడుకుంటున్నారు. 


సమసిపోయినట్టేనా?

ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట కురుమసంఘం నేతలు చేపట్టిన ఆందోళనకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఒగ్గుపూజారుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారమే సేవలందిస్తున్నామని, వ్యక్తిగత స్వార్థం కోసం ఆలయ ప్రతిష్టను దిగజార్చే చర్యలు వీడాలని కోరారు. ఇదేక్రమంలో ఆలయాధికారులు ఒగ్గుపూజారుల పలు సూచనలను అంగీకరించడంతో పాటు ఆలయేతరులు చేసిన ఆరోపణలను ఖండించారు. ఇంతటితో వివాదం సద్దుమణుగుతుంతో లేదోనన్న అనుమానాలు తలెత్తతున్నాయి.


అన్నీ అసత్య ప్రచారాలు 

మల్లన్న ఆలయంలో సంప్రదాయాలు ఏవీ మార్చబడలేదు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం సేవలందిస్తున్నాం. ఆచార, సంప్రదాయాల గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారు ఆలయంలో ఎన్నడూ పనిచేయలేదు. అంతర్గత సమస్యలను మేము చర్చించి పరిష్కరించుకుంటాం. ఆలయ ప్రతిష్టతకు భంగం కలిగించడం మానుకోవాలి.

- బొద్దుల కిష్టయ్య, మల్లన్న ఆలయ ఒగ్గుపూజారులసంఘం గౌరవాధ్యక్షుడు 


మల్లన్న దేవుడు అందరివాడు 

కొమురవెల్లి మల్లికార్జునస్వామి అందరివాడు. ఏ ఒక్క కులానికి పరిమితం కాడు. పరమశివుడికి ప్రతిరూపంగా భావిస్తూ సనాతన సంప్రదాయం ప్రకారంగా పూజలందుకుంటున్నాడు. ఆరోపణలు చేసే వ్యక్తులు కేవలం ఉనికి కోసం అసత్య ప్రచారం చేసినా ఎవరూ విశ్వసించరు. ఆలయ ప్రతిష్టతో పాటు వీరశైవ సాంప్రదాయానికి భంగం కలిగించేలా వ్యవహ రిస్తే సహించం.

- మహదేవుని శ్రీనివాస్‌, వీరశైవ లింగాయత్‌, లింగబలిజ సమాజం కొమురవెల్లి మండలాధ్యక్షుడు


ఆలయ ప్రతిష్టకు విఘాతం కలగకుండా చర్యలు  

ఆచార వ్యవహారాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో నుంచి కొనసాగుతున్న వాటిని నిర్వహిస్తున్నాం. వివాదం తలెత్తిన విషయంలో ఒగ్గుపూజారులు పలు అంశాలనూ దృష్టికి తెచ్చారు. వాటిలో కొన్ని అంగీకరించాం. స్వామివారి కల్యాణం రోజున ఒగ్గుడోలు ఏర్పాటుకు, అర్ధ మండపంలో నిత్యం ఒగ్గుపూజారులు మేలుకొలుపు, పవళింపు సేవ చేయించేలా చర్యలు తీసుకున్నాం. ఆలయ సంప్రదాయానికి, భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించకుండా పాలకమండలి, దేవాదాయశాఖ కమిషనర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటాం.

- ఈవో బాలాజీశర్మ

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.