Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 03:33AM

సమస్యల నిలయంగా కొమురవెల్లి ఆలయం

  • మల్లన్న దేవాలయ మాస్టర్‌ప్లాన్‌ అమలు ఇంకెప్పుడు?
  • డిసెంబరు 26న స్వామివారి కల్యాణం
  • పూర్తిస్థాయిలో వసతుల కల్పన లేదు 


చేర్యాల, నవంబరు 26: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం మాస్టర్‌ప్లాన్‌ అమలుకు నోచుకోకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ ఆలయం తెలంగాణ, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలవడమే కాకుండా, కోట్లాదిరూపాయల ఆదాయాన్ని అందిస్తున్నా... శాశ ్వత ప్రాతిపదికన వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించినప్పటికీ అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో నేటికీ అతీగతీ లేకుండా పోయింది. కొమురవెల్లి రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు  ఉన్నప్పటికీ చిత్తశుద్ధి కరువైంది. సీఎం కేసీఆర్‌ ఆలయాల పర్యటన సమయంలో యాదాద్రి, వేములవాడ, కాళే శ్వరం, కొండగట్టు తదితర ఆలయాలకు కోట్లాది రూపాయలు ఇస్తామని వరాలు కురిపించారు.


కొమురవెల్లితో పాటు సమీప గ్రామాల్లోని 166 ఎకరాల ప్రభుత్వ భూములను మల్లన్న పేరిట పట్టాచేయాలని కొన్నేళ్ల కిత్రం ఆదేశించారు. కానీ గుట్టలు, రాళ్లు రప్పలు ఉండటంతో ఎందుకూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. మూడేళ్లక్రితం రూ.10 కోట్లు మంజూరుచేసినా, బండగుట్ట వద్ద చేపడుతున్న 50 గదుల సత్రం నిర్మాణానికీ ఆ నిధులు సరిపడని పరిస్థితి నెలకొంది. మల్లన్న ఆలయ పరిధిలో సుమారు 140 గదులున్నప్పటికీ అవి పూర్తిగా దాతలు నిర్మించినవే కావడం, ప్రభుత్వపరంగా కనీసం షెడ్డుకూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులకు బస చేయడం కష్టంగా మారింది. వేలల్లో వచ్చే భక్తులకు అవి ఎందుకూ సరిపోవడం లేదు. మరోవైపు, మల్లన్న సన్నిధిలో వ్యక్తిగతంగా గెస్ట్‌హౌస్‌ నిర్మిస్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు పలు సందర్భాల్లో చెప్పారు. గెస్ట్‌హౌస్‌ కోసం దాసారంగుట్ట, ఎల్లమ్మగుట్ట పై స్థలాన్ని కేటాయించారు. కానీ, అప్రోచ్‌రోడ్డుకు రూ.6 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. రోడ్డు కోసం ఆలయ నిధులు వాడే పరిస్థితిలేదు. దీంతో మంత్రుల హామీలూ అమలుకు నోచుకోవడం లేదు.


బ్రహ్మోత్సవాలకు తరలిరానున్న లక్షలాది మంది

రాజీవ్‌ రహదారిని ఆనుకుని కొండపాక స్వాగత తోరణంతో పాటు తిమ్మారెడ్డిపల్లి స్వాగతతోరణం నుంచి మల్లన్న ఆలయానికి రెండు మార్గాలు ఉన్నాయి. కొమురవెల్లి శివారుమీదుగా రెండు మార్గాలను కలుపుతూ నెక్లె్‌సరోడ్డు నిర్మిస్తామని 2014లో ప్రకటించారు. కానీ, ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఎన్నో సమస్యల నిలయంగా మారిన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో డిసెంబరు 26న స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వసతి, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement