ఘనంగా కొమురవెల్లి మల్లన్న పట్నంవారం

ABN , First Publish Date - 2022-01-17T08:21:41+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు బోనమెత్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి

ఘనంగా కొమురవెల్లి మల్లన్న పట్నంవారం

బోనమెత్తిన హైదరాబాద్‌ యాదవ భక్తులు 

చేర్యాల, జనవరి 16: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు బోనమెత్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన పట్నంవారాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల చిందులతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వేలాదిమంది భక్తులు తరలిరావడంతో కొమురవెల్లి జనసంద్రంగా మారింది. మల్లన్నకు సాంప్రదాయబద్ధంగా భక్తులు బోనమెత్తి, నైవేద్యాన్ని నివేదించారు. మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెలతో వడి బియ్యం పోశారు. గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. సంతానం కోసం మహిళలు వ ల్లుబండ వద్ద వరం పట్టారు.


మల్లన్న సహోదరి ఎల్లమ్మ తల్లికి బోనం నివేదించి, బెల్లంపానకం, కల్లు శాకపెట్టి వడిబియ్యం పోసి తమ కోరికలు తీర్చాలని వేడుకున్నారు. ఆలయ ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేయగా, హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. కాగా, తోటబావి ప్రాంగణంలో హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో రచించాల్సిన పెద్దపట్నం, అగ్ని గుండాలను కరోనా ఆంక్షల కారణంగా రద్దు చేశారు. 

Updated Date - 2022-01-17T08:21:41+05:30 IST