Komatireddy Brothers అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

ABN , First Publish Date - 2022-08-05T21:48:46+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers) కలిశారు. అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Brothers అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers) కలిశారు. అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy), వెంకటరెడ్డి వేర్వేరుగా కలిశారు. వ్యక్తిగతంగా అమిత్‌షాను  రాజగోపాల్‌రెడ్డి కలిశారు. మరోవైపు వరద సాయంపై అమిత్‌షా (Amit Shah)ను వెంకటరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వరద నష్టాలపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. వరద బాధితుల కష్టాలను అమిత్‌షాకు తెలియజేశానని చెప్పారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల రూ.1400 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. ఈ భేటీకి తాను వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) స్పష్టం చేశారు. 


మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏడాది కాలంగా రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఆయనను పార్టీలో కొనసాగించే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆసక్తి చూపలేదని నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలతోపాటు కొందరు ఇతర ప్రాంతాల నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి కుటుంబాన్ని కూడా అవమానించేలా మాట్లాడారని, దీంతో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజగోపాల్‌రెడ్డి నిష్క్రమణ వల్ల కాంగ్రెస్‌కు రెండు మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందని, కానీ.. వెంకట్‌రెడ్డి కూడా వెళ్లిపోతే ఐదారు నియోజకవర్గాలను కోల్పోతామని వేణుగోపాల్‌ వద్ద వారు అన్నారు. 


భవిష్యత్తులో ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదించారు. రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న చిన్నపిల్లాడి లాంటివారని, ఆయనను బుజ్జగించాలని తాము మాణిక్కం ఠాగూర్‌కు ఏడాది క్రితమే చెప్పామని తెలిపారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు లాంటివారు కూడా చెప్పారని అన్నారు. అయినా ఠాగూర్‌ పట్టించుకోలేదని, పైగా ఆయనను పార్టీ నుంచి పంపించే విధంగానే వ్యవహరించారని చెప్పారు. రోశయ్య, పొన్నాల పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పడు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇదేవిధంగా వ్యవహరించారని, అయినా.. తమ సీట్లను గెలిపించుకుంటూ వచ్చారని వారు గుర్తు చేశారు.

Updated Date - 2022-08-05T21:48:46+05:30 IST